తెలంగాణ గొంతుకోసిన కాంగ్రెస్‌

21 Jan, 2024 04:23 IST|Sakshi

ఆ ప్రాజెక్టులు కేఆర్‌ఎంబీకి ఎలా అప్పగిస్తారు?

రాష్ట్రంలో సాగునీళ్లు, తాగునీళ్లు ప్రశ్నార్థకం చేశారు

మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ధ్వజం

సాక్షి, హైదరాబాద్‌: నాగార్జునసాగర్, శ్రీశైలం నీటి ప్రాజెక్టులపై పూర్తి అధికారాన్ని కృష్ణా నదీ యాజ మాన్య మండలి(కేఆర్‌ఎంబీ)కి అప్పగించి కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ గొంతు కోసిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లేసి గెలిపించిన ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల ప్రజలకు ఈ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు.

శనివారం తెలంగాణ భవన్‌లో ఆయన ఎమ్మెల్సీ ఎంఎస్‌ ప్రభాకర్, మాజీ చైర్మన్‌ గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు.  ఈ ప్రాజెక్టులపై అధికారాన్ని కేఆర్‌ ఎంబీకి అప్పగించడం రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు అని వ్యాఖ్యానించారు. గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణ నీటి వాటా తేలే దాకా ఏ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను ఒప్పుకో మని నాటి కేసీఆర్‌ ప్రభుత్వం తేల్చిచెప్పిందని మాజీ మంత్రి గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా అక్కడ మినిట్స్‌ రాసినట్లయితే వెంటనే ఆ విషయం స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. ఇప్పుడు కేఆర్‌ఎంబీ అనుమతి లేకుండా ఆ డ్యాంల మీదికి అడుగు పెట్టే అవకాశం ఉండదన్నారు. తెలంగాణకు సాగునీళ్లు, తాగునీళ్లు ప్రశ్నార్థకం చేశారని ఆరోపించారు. రాష్ట్రం ఇక పూర్తిగా థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంపైనే ఆధారపడేలా చేశారన్నారు.

అలా అన్న వాళ్లే బొందలో కలిసిపోయారు
తెలంగాణలో తన శిష్యుడు రాజ్యం ఏలుతున్నాడని చంద్రబాబు సంతోషపడుతున్నారని నిరంజన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు శిష్యుడు విదేశాల్లో తిరుగుతూ కేసీఆర్‌ పార్టీని బొందపెడతానని అంటున్నారని, అలా అన్నవాళ్లు అందరూ బొందలో కలిసిపోయారన్నారు. గోదావరి బేసిన్‌లో రైతులకు సాగునీళ్లు ఇవ్వకుండా కాళేశ్వరం మీద దుష్ప్రచా రం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

>
మరిన్ని వార్తలు