ముందు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పండి.. కేసీఆర్ సర్కార్‌పై నిర్మల ఫైర్‌

3 Sep, 2022 13:18 IST|Sakshi

సాక్షి, కామారెడ్డి: జిల్లాలో కేంద్ర ఆర్థిక మంత్రి   నిర్మలా సీతారామన్ పర్యటన మూడో రోజు కొనసాగుతోంది. ఇందులో భాగంగా గాంధారిలో రైతులతో ఆమె సమావేశమయ్యారు.  తెలంగాణ సర్కార్‌పై మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు. శుక్రవారం తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే రాష్ట్ర మంత్రులు మండిపడుతున్నారని ధ్వజమెత్తారు. 

తెలంగాణలో రైతులకు అన్యాయం జరుగుతోందని నిర్మల ఆరోపించారు. భూ నిర్వాసితులకు పరిహారం ఇవ్వడం లేదన్నారు. 2017 నుంచి 2019 మధ్య రాష్ట్రంలో  రెండు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు రికార్డ్స్ చెబుతున్నాయని పేర్కొన్నారు. ఎన్నికల్లో రుణమాఫీపై హామీ ఇచ్చిన కేసీఆర్‌ ప్రభుత్వం కేవలం వందలో ఐదుగురు రైతులకు మాత్రమే చేసినట్లు చెప్పారు. మల్లన్నసాగర్ ,మిడ్ మానేరు ,సీతారామ ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయిన రైతులకు ఇప్పటిదాకా పూర్తి పరిహారం ఇవ్వలేదని విమర్శించారు. వీటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

మొక్కజొన్న వేయొద్దని, వరి వేస్తే ఉరేనంటూ రైతులను తెలంగాణ ప్రభుత్వం బెదిరిస్తోందని నిర్మల ఫైర్ అయ్యారు. అందరివాడైన రైతు సమస్యలను కేసీఆర్‌ సర్కార్‌ రాజకీయాలకు వాడుకుంటోందని మండిపడ్డారు. సున్నితమైన అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. 2014 నుంచి మోదీ ప్రభుత్వం ఆయా రాష్ట్రాల్లోని రైతు సమస్యలకు అనుగుణంగా రైతు సంక్షేమం గురించి ఆలోచిస్తోందని నిర్మల అన్నారు. ఏ రాష్ట్రానికి ఏం కావాలో ప్రధాని మోదీకి తెలుసని వ్యాఖ్యానించారు.
చదవండి: బీజేపీ ఎంపీలు నిశికాంత్ దూబె, మనోజ్‌ తివారీపై కేసు

మరిన్ని వార్తలు