Vaccination: దుమారం రేపిన గడ్కరీ వ్యాఖ్యలు..

19 May, 2021 17:27 IST|Sakshi

వివరణ ఇచ్చిన గడ్కరీ

న్యూఢిల్లీ: కరోనా కట్టడి కోసం వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటికి.. టీకాల కొరత వల్ల అది సాఫీగా సాగడం లేదు. ప్రస్తుతం దేశంలో రెండు కంపెనీలు మాత్రమే టీకాలను ఉత్పత్తి చేస్తుండటంతో డిమాండ్‌కు సరిపడా సరఫరా జరగడం లేదు. ఈ నేపథ్యంలో విపక్ష నేతలు ఇతర కంపెనీలకు టీకా తయారి బాధ్యతను అప్పగించాలని.. అప్పుడే భారీ ఎత్తున టీకాలు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వానికి సూచించాయి. 

ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ కూడా ఇదే సూచించారు. వైస్-చాన్స్‌లర్స్‌తో మంగళవారం జరిగిన వర్చువల్ సమావేశంలో గడ్కరీ మాట్లాడుతూ.. ‘‘ఎక్కువ కంపెనీలకు టీకా తయారీ లైసెన్స్ ఇవ్వాలి. అలాగే ఆమేరకు రాయల్టీ కూడా చెల్లించాలి. ప్రతి రాష్ట్రంలో రెండు, మూడు ల్యాబ్‌లున్నాయి. వాటిని వినియోగించుకున్నట్లైతే కేవలం 15-20 రోజుల్లోనే అవి వ్యాక్సిన్‌లను సరఫరా చేయగలవు. సమస్య త్వరగా పరిష్కారం అవుతుంది’’ అన్నారు.  

గడ్కరీ వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని లేపాయి. దీనిపై విపక్ష కాంగ్రెస్, బీజేపీకి చురకలు అంటించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్‌ మాట్లాడుతూ  “ఏప్రిల్ 18న మజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు మీరే ఇదే చెప్తున్నారు. ఇంతకు మీ బాస్‌ వింటున్నారా’’ అంటూ ఎద్దేవా చేశారు.  

తన వ్యాఖ్యలు ఇలా వివాదాన్ని రాజేయడంతో గడ్కరీ దిద్దుబాటు చర్యలకు దిగారు. ‘‘వ్యాక్సిన్‌ ఉత్పత్తి గురించి మంగళవారం నేను ఓ ప్రకటన చేశాను. కానీ నా ప్రసంగానికి ముందు రసాయన మరియు ఎరువుల శాఖ మంత్రి మన్సుఖ్ మాండ్వియా వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివరించారని నాకు తెలియదు. సరైన దిశలో ఈ సమయానుకూల జోక్యానికి నేను అతని బృందాన్ని అభినందిస్తున్నాను’’ అంటూ గడ్కరీ ట్వీట్‌ చేశారు. 

చదవండి: ‘పీఎంఓతో ఉపయోగం ఉండదు.. గ‌డ్క‌రీకి ఇవ్వండి’ 

మరిన్ని వార్తలు