ఏకగ్రీవ ఎన్నికకు ఎన్డీయే వ్యూహాలు

10 Sep, 2020 16:02 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ వ్యూహాలను సిద్ధం చేస్తోంది. విపక్షాలకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఏకగ్రీవ ఎన్నిక కోసం ప్రణాళికలు రచిస్తోంది. దీనిలో భాగంగానే బీజేడీ చీఫ్‌, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ సాయం కోరింది. ఈ మేరకు బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ గురువారం నవీన్‌ పట్నాయక్‌కు  ఫోన్‌ చేశారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థికి మద్దతు తెలపాలని కోరారు. దీనికి స్పందించిన నవీన్‌ తమ పార్టీ నేతలతో చర్చించి, తుది నిర్ణయాన్ని ప్రకటిస్తామని తెలిపారు. కాగా పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ మిత్రపక్షం జేడీయూకు చెందిన హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ను ఎన్డీయే అభ్యర్థిగా రెండోసారి బరిలో నిలిపింది. (సెప్టెంబర్ 14 నుంచి పార్లమెంట్‌ సమావేశాలు‌)

మొత్తం 245 సభ్యులు గల రాజ్యసభలో ప్రస్తుతం బీజేపీకి సొంతంగా 114 సభ్యల మద్దతుంది. మిత్రపక్షాల మద్దతును కూడగట్టుకుని తమ అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. దీనిలో భాగంగా కాంగ్రెస్‌ వ్యతిరేక పక్షాల మద్దతు కోరనుంది. మరోవైపు విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. దీనిపై ఇతర పార్టీల నేతలతో ఇదివరకే సంప్రదింపులు జరిపామని వారి నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు కాంగ్రెస్‌ అధిష్టానం ఓ ప్రకటనలో తెలిపింది. నామినేషన్ల ప్రక్రియకు రేపు (శుక్రవారం) ఆఖరి రోజు కావడంతో నేతలతో చర్చించి అభ్యర్థిని ప్రకటిస్తామని కాంగ్రెస్‌ పేర్కొంది. ఎన్డీయే అభ్యర్థిగా హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ ఇదివరకే నామినేషన్‌ దాఖలు చేశారు. పార్లమెంట్‌ తొలిరోజు సమావేశాలైన సెప్టెంబర్‌ 14న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీలకు ఇదివరకే విప్‌ను సైతం జారీచేసింది. (అసెంబ్లీ ఎన్నికలు : ఆర్జేడీకి భారీ షాక్‌)

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా