బిహార్‌ సీఎంగా మళ్లీ నితీశ్‌

16 Nov, 2020 01:21 IST|Sakshi
మిత్రపక్షాల నేత జితన్‌రామ్‌ మాంఝీతో కలసి అభివాదం చేస్తున్న నితీశ్‌ కుమార్‌

నేడే ప్రమాణ స్వీకారం

ఉప ముఖ్యమంత్రులుగా తార్‌ కిశోర్, రేణు దేవి!

పట్నా: బిహార్‌ ముఖ్యమంత్రిగా నితీశ్‌ కుమార్‌ వరుసగా నాలుగోసారి సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బొటాబొటి మెజార్టీతో నెగ్గిన ఎన్డీయే కూటమి ముందే ప్రకటించినట్టుగా సీఎం పగ్గాలు నితీశ్‌కే అప్పగించింది. ఆదివారం పట్నాలో జరిగిన ఎన్డీయే కూటమి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేలు తమ శాసనసభా పక్ష నేతగా నితీశ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

243 సీట్లున్న అసెంబ్లీలో 125 సీట్ల మెజార్టీతో అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. సుపరిపాలనా దక్షుడిగా పేరు తెచ్చుకున్న నితీశ్‌కుమార్‌ కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ సమయంలో వలస కార్మికుల సమస్యను ఎదుర్కోవడంలో విఫలం కావడంతో చాలా మంది ఆయనకు వ్యతిరేకమయ్యారు. గత అసెంబ్లీతో పోల్చి చూస్తే నితీశ్‌ పార్టీ జనతాదళ్‌ యునైటెడ్‌ (జేడీ–యూ) బలం 71 నుంచి 43కి పడిపోయింది. అయినప్పటికీ ముందుగా చేసిన నిర్ణయానికి కట్టుబడి ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు మిస్టర్‌ క్లీన్‌ ముద్ర ఉన్న నితీశ్‌కు మళ్లీ ముఖ్యమంత్రి పదవిని అప్పగించారు.  

గవర్నర్‌ని కలుసుకున్న నితీశ్‌  
ఎన్డీయే శాసనసభా పక్షనాయకుడిగా ఎన్నికైన వెంటనే నితీశ్‌ కుమార్‌ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ ఫాగూ చౌహాన్‌ను కలుసుకున్నారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఆయనని కోరారు. ఎన్డీయే పార్టీల ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన పత్రాన్ని గవర్నర్‌కు సమర్పించారు. అనంతరం నితీశ్‌ విలేకరులతో మాట్లాడుతూ సోమవారమే తాను పదవీ ప్రమాణం చేయనున్నట్టుగా చెప్పారు. ‘‘ఎన్డీయే కూటమిలో నాలుగు పార్టీల ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖని గవర్నర్‌కి సమర్పించాను. గవర్నర్‌ ఆదేశం మేరకు సోమవారం సాయంత్రం 4–4:30 మధ్య రాజ్‌భవన్‌లో పదవీ ప్రమాణ స్వీకారం చేస్తాను’’అని చెప్పారు. ఎన్డీయే కూటమి సమావేశానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, పార్టీ రాష్ట్ర ఇన్‌ చార్జ్‌ భూపేంద్ర యాదవ్, ఎన్నికల ఇన్‌చార్జ్‌ ఫడ్నవీస్‌ హాజరయ్యారు.  

బీజేపీ శాసనసభా పక్ష నేతగా తార్‌ కిశోర్‌  
బిహార్‌ ఉప ముఖ్యమంత్రి పదవి ఈసారి ఇద్దరిని వరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కతిహర్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన తార్‌ కిశోర్‌ ప్రసాద్, బెత్తాహ్‌ ఎమ్మెల్యే రేణుదేవిలను డిప్యూటీ సీఎంలుగా దాదాపు ఖరారు అయినట్టే. అసెంబ్లీలో బీజేపీ శాసనసభా పక్ష నాయకునిగా తార్‌ కిశోర్‌ ప్రసాద్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో ఆయనే డిప్యూటీ సీఎం పగ్గాలు చేపడతారని భావిస్తున్నారు. ఇన్నాళ్లూ డిప్యూటీ సీఎంగా వ్యవహరించిన సుశీల్‌ కుమార్‌ మోదీకి కేంద్రంలో పదవి అప్పగించే అవకాశాలున్నాయి. బీజేపీ శాసనసభ పక్ష సమావేశంలో ఆయనే  ప్రసాద్‌ పేరు ప్రతిపాదించారు.  బీజేపీఎల్పీ ఉప నేతగా రేణు దేవిని ఎన్నుకోవడంతో ఆమెకు కూడా డిప్యూటీ సీఎం పదవి లభిస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఎవరీ తార్‌కిశోర్‌ ప్రసాద్‌ ?
రాజకీయవర్గాల్లో పెద్దగా పరిచయం లేని ప్రసాద్‌ (52) ఎంపికపై అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్థ ఏబీవీపీ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ప్రసాద్‌ వెనుకబడిన కల్వార్‌ సామాజిక వర్గానికి చెందినవారు. కతిహర్‌ నుంచి వరుసగా నాలుగోసారి ఎమ్మెల్యే అయ్యారు.

 తార్‌ కిశోర్‌, రేణు దేవి

మరిన్ని వార్తలు