బీహార్‌లోనూ మహారాష్ట్ర సీన్‌ రిపీట్‌??.. షిండేలాగే నితీశ్‌ కూడా..

16 Aug, 2022 06:58 IST|Sakshi

రాంచీ: బీహార్‌లోనూ మహారాష్ట్ర పరిస్థితులు పునరావృతం కానున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి నుంచి వైదొలిగి.. తిరిగి పాత మిత్రులతో జత కట్టిన నితీశ్‌ కుమార్‌.. ఇప్పటికే కేబినెట్‌ కూర్పును ఓ కొలిక్కి తెచ్చారు. మంగళవారం ఉదయం రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. అయితే.. 

ఇక్కడ కూడా మహారాష్ట్ర తరహా పరిస్థితులే కనిపించబోతున్నాయా? అనే చర్చ జోరందుకుంది. బీహార్‌ సీఎం నితీశ్‌ ఇవాళ కేబినెట్‌ను విస్తరించబోతున్నారు. మొత్తం బీహార్‌ కేబినెట్‌లో 36 మంత్రి పదవులు ఉన్నాయి. ఈ తరుణంలో కేబినెట్‌లో తేజస్వియాదవ్‌ జేడీయూకు 16, నితీశ్ కుమార్‌ జేడీయూకు 12 స్థానాలు కేటాయించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు, హిందుస్థానీ ఆవామ్‌ మోర్చా జితిన్‌ రామ్‌ మాంఝీకి, మరో ఇండిపెండెట్‌ అభ్యర్థికి సైతం కేబినెట్‌ బెర్త్‌లు దాదాపుగా ఖరారు అయ్యాయి. కానీ, కీలకమైన విభాగాలు మాత్రం ఆర్జేడీ, ఇతరులకు తరలిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. 

మహారాష్ట్రలోనూ బీజేపీ కీలకమైన శాఖలన్నీ ఉంచేసుకుని.. షిండే వర్గానికి మిగిలిన పోస్టులను మిగిల్చింది. గతంలో ఈ శాఖలు ఎన్సీపీ, కాంగ్రెస్‌లు అనుభవించాయి. ఇప్పుడు.. బీహార్‌లోనూ మిత్రపక్షాల కోసం జేడీయూ అదే తరహా త్యాగం చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇప్పటికే డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన తేజస్వి యాదవ్‌.. హోం లేదంటే ఆర్థిక శాఖను చేజిక్కించుకోవచ్చనే ప్రచారం నడుస్తోంది. ఇంతకు ముందు హోం శాఖను నితీశ్‌ కుమారే స్వయంగా పర్యవేక్షించడం విశేషం. 

అంతేకాదు తన పేషీలోని కీలకమైన, సీనియర్‌ ఎమ్మెల్యేలకు ఆర్జేడీ తేజస్వి యాదవ్‌.. ముఖ్యమైన పోస్టులు అప్పజెప్పబోతున్నారనే ప్రచారం అక్కడి స్థానిక మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. ఇంతకు ముందు బీజేపీకి జేడీయూ కేటాయించిన ఆరోగ్యం, ఆర్థికం, రోడ్లు భవనాల శాఖల మీదే ఆర్జేడీ ఫోకస్‌ చేసిందని.. వాటి కోసమే పట్టుబడుతోందన్నది ఆ కథనాల సారాంశం. ఇదిలా ఉంటే.. మహాకూటమి నేతృత్వంలోని నితీశ్ సర్కార్‌ వచ్చే వారం.. అసెంబ్లీలో బలనిరూపణకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదీ చదవండి: మీ రాజకీయాల కోసం.. చరిత్రను వక్రీకరించకండి: సోనియా గాంధీ

మరిన్ని వార్తలు