సారీ మేము రావడం లేదు.. ఖర్గే ఆహ్వానానికి నో చెప్పిన సీఎం నితీశ్‌!

26 Jan, 2023 16:55 IST|Sakshi

కాంగ్రెస్‌ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర తలపెట్టిన విషయం తెలిసిందే. కాగా, భారత్‌ జోడో యాత్ర జనవరి 30వ తేదీన జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ముగియనుంది. ఈ సందర్బంగా కాంగ్రెస్‌ పార్టీ జోడో యాత్ర ముగింపు సభ జరగనుంది. ఈ సభ కోసం విపక్షాలను ఒకే వేదిక మీదకు తెచ్చేందుకు ప్లాన్‌ చేసింది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీతో భావసారుప్యత కలిగిన దేశంలోని 24 రాజకీయ పార్టీలకు చెందిన నేతలను జోడో యాత్ర ముగింపునకు ఆహ్వానించింది. ఈ మేరకు జనవరి 30వ తేదీన ముగింపు సభలో పాల్గొనాలని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే.. రాజకీయ నేతలకు లేఖలు రాశారు. అయితే ఖర్గే ఆహ్వానాన్ని బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని జేడీయూ తిరస్కరించింది. దీంతో​, కాంగ్రెస్‌ పార్టీకి ఊహించని షాక్‌ తగిలింది. 

అయితే, కాంగ్రెస్‌ పార్టీ ముగింపు సభ ఆహ్వానంపై జేడీయూ జాతీయ అధ్యక్షుడు రాజివ్‌ రంజన్‌ సింగ్‌ స్పందించారు. భారత్‌ జోడో యాత్ర ముగింపు సభకు ఎందుకు రాలేకపోతున్నామనే దానిపై వివరణ ఇచ్చారు. తాము అదే రోజున పార్టీకి అత్యంత ముఖ్యమైన కార్యక్రమాన్ని ప్రారంభించాల్సి ఉందని తెలిపారు. నాగాలాండ్‌లో పార్టీ తరపున అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పారు. అందువల్ల తాము భారత్‌ జోడో యాత్ర ముగింపు సభలో పాల్గొనలేకపోతున్నామని ఖర్గేకి లేఖ రాశారు. అయితే, జోడో యాత్ర మాత్రం సక్సెస్‌ అవ్వాలని తాను కోరుకుంటున్నట్టు తెలిపారు. 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు