బిహార్‌ ఎన్నికలు : 10 మంది మంత్రుల ఓటమి

12 Nov, 2020 15:39 IST|Sakshi

పట్నా : బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించినా ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ కేబినెట్‌లో 24 మంది మంత్రుల్లో పది మంది ఓటమి పాలయ్యారు. వీరిలో ఎనిమిది మంది జేడీయూకు చెందిన వారు కాగా, ఇద్దరు బీజేపీ మంత్రులున్నారు. నితీష్‌ కేబినెట్‌లో మొత్తం 29 మంత్రులున్నా వారిలో 5గురు ఎమ్మెల్సీలు కావడంతో ఎన్నికల బరిలో నిలవలేదు. 23 మంది మంత్రులు తమ నియోజకవర్గాల్లో పోటీ చేయగా, 2015లో ఘోసి నుంచి పోటీ చేసిన విద్యా మంత్రి కృష్ణ నందన్‌ ప్రసాద్‌ వర్మ తాజాగా జెహనాబాద్‌ నుంచి బరిలో దిగారు.

ఇక బీజేపీ కోటా నుంచి నితీష్‌ కేబినెట్‌లో చేరిన పట్టణాభివృద్ధి మంత్రి సురేష్‌ కుమార్‌ శర్మ, గనుల మంత్రి బ్రిజ్‌ కిషోర్‌ బింద్‌లు వరుసగా ముజఫర్‌పూర్‌, చైన్‌పూర్‌ల నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మరోవైపు వర్మతో పాటు జేడీయూ మంత్రులు శైలేష్‌ కుమార్‌, సంతోష్‌ కుమార్‌ నిరాల, జైకుమార్‌ సింగ్‌, రాం సేవక్‌ సింగ్‌, రమేష్‌ రిషిదేవ్‌, ఖర్షీద్‌, లక్ష్మేశ్వర్‌ రాయ్‌లు ఓటమి చవిచూశారు. ఎల్జేపీ అభ్యర్ధులు పలు నియోజకవర్గాల్లో సంప్రదాయ ఎన్డీయే ఓట్లను చీల్చడంతో తమ మంత్రులు ఓడిపోయారని ఎల్జేపీ తమ విజయావకాశాలను దెబ్బతీయకుంటే జేడీయూ 80 స్ధానాల్లో విజయం సాధించేందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో తమ అభ్యర్ధుల ఓటమిపై ఎన్డీయే నేతలు సమీక్షిస్తారని చెప్పారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు