‘2020లో సీట్లు తక్కువొచ్చినా సీఎం పదవి’.. బీజేపీ విమర్శలపై నితీశ్‌ క్లారిటీ

25 Aug, 2022 09:08 IST|Sakshi

పాట్నా: బిహార్‌లో బీజేపీకి టాటా చెప్పి తన పాత స్నేహితులతో కలిసి తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు నితీశ్‌ కుమార్‌. ఈ క్రమంలో బీజేపీ, జేడీయూ మధ్య మాటల యుద్ధం మొదలైంది. నితీశ్‌ కుమార్‌ అసలు సీఎం పదవికి తగిన వ్యక్తి కాదంటూ బీజేపీ నేతలు ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో 2020లో బీజేపీతో పోలిస్తే తనకు తక్కువ సీట్లు వచ్చినా ముఖ్యమంత్రి పదవి ఇవ్వటం వెనుకున్న కారణాలను బలపరీక్ష సందర్భంగా అసెంబ్లీ వేదికగా వెల్లడించారు నితీశ్‌ కుమార్‌. విపక్ష నేతలతో చేతులు కలిపి నితీశ్‌ ద్రోహం చేశారంటూ బీజేపీ చేసిన ఆరోపణలను తిప్పికొడుతూ పలు ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించారు. 

‘ 2020 ఎన్నికల్లో బీజేపీతో పోలిస్తే తక్కువ సీట్లు వచ్చినా.. నేను ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు సిద్ధమయ్యాను. కానీ, సీఎం పదవిలో కొనసాగేందుకు నాపై తీవ్రమైన ఒత్తిడి ఉంది. నేనే ముఖ్యమంత్రినని వారు చెప్పారు. నాకు ముఖ్యమంత్రి పదవి వద్దని చెప్పాను. మీరు ఎక్కువ సీట్లు గెలిచారు.. మీ పార్టీ నుంచే ముఖ్యమంత్రి ఉండాలని సూచించాను. చివరకు అంగీకరించాను. కానీ, ఆ పదవిని ఒత్తిడిలో చేపట్టాను. నంద్ కిషోర్ యాదవ్‌ను స్పీకర్‌గా చేస్తారని నాకు చెప్పారు. పాత మిత్రుడని.. బావుంటుందని చెప్పాను. కానీ, అతను కాలేదు. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. ఓ వ్యక్తిని కింది స్థాయి నుంచి తీసుకొచ్చి కేంద్రంలోకి పంపిస్తే నాకే ద్రోహం చేశాడు.’ అని పేర్కొన్నారు నితీశ్‌. ముఖ్యమంత్రి రేసులో ఉన్న బీజేపీ నేతలు సుశీల్‌ కుమార్‌ మోదీ, ప్రేమ్‌ కుమార్‌ పేర్లను సైతం వెల్లడించారు.  

ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయటంపై బీజేపీ చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు నితీశ్‌ కుమార్‌. 2017లో ఆర్జేడీని వీడి బీజేపీతో చేతులు కలిపిన అంశాన్ని లేవనెత్తుతూ విమర్శలు చేయటంపై స్పష్టత ఇచ్చారు. ‘2017లో వారి నుంచి విడిపోయాను. మీరు చాలా ఆరోపణలు చేశారు. కానీ ఐదేళ్ల గడిచినా వారికి వ్యతిరేకంగా ఏమీ కనిపించలేదు.’ అని స్పష్టం చేశారు నితీశ్‌.

ఇదీ చదవండి: Bihar Floor Test: బల పరీక్షలో నెగ్గిన నితీష్‌ ప్రభుత్వం.. బీజేపీపై అటాక్‌

మరిన్ని వార్తలు