రాహుల్‌ అనర్హతపై ట్విస్ట్‌ ఇచ్చిన సీఎం నితీష్‌.. కాంగ్రెస్‌కు షాక్‌!

30 Mar, 2023 08:51 IST|Sakshi

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ సంచలన కామెంట్స్‌ చేశారు. ఈ అంశంపై తాను మాట్లాడేందుకు సిద్ధంగా లేనంటూ ముక్కుసూటిగా చెప్పేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా హాట్‌ టాపిక్‌గా మారాయి. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీపై కూడా నితీష్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. 

అయితే, నితీష్‌ కుమార్‌ పాట్నాలో మీడియాతో మాట్లాడుతూ.. అవినీతిపరులు చేతులు కలిపారు అని ప్రధాని చేసిన వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. అన్ని పార్టీలతో కలిసి కాంగ్రెస్ ముందుకు సాగాలని తాను కోరుకుంటున్నట్టు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఐక్య ప్రతిపక్షం అవసరమని అన్నారు. ప్రధాని మోదీ ఎప్పుడూ ఏదో ఒకటి చెప్పుకుంటూ ముందుకు వెళ్తారు. ప్రతిపక్షాలను టార్గెట్‌ చేసి లేనిది ఉన్నట్టుగా చెబుతారు అని ఆరోపణలు చేశారు. అలాగే, ప్రధాని.. అవినీతి గురించి మాట్లాడేటప్పుడు ఆయన ఎలాంటి వ్యక్తులతో పొత్తులు పెట్టుకుంటున్నారో వీడియో రికార్డులు చేసుకోవాలని విరుచుకుపడ్డారు. 

ఈ క్రమంలో రాహుల్‌ గాంధీ అనర్హత వేటుపై నితీష్‌ స్పందిస్తూ.. కోర్డు ఆర్డర్‌కు సంబంధించిన ఏ విషయంపైనా కూడా నేను ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఈ అంశంపై పార్టీ ఒక క్లారిటీతో ఉంది. దీనిపై మాట్లాడేందుకు సిద్ధంగా లేనని స్పష్టం​ చేశారు. ఇదే విషయమై సుప్రీంకోర్టులో సవాల్‌ చేయడంపై మాట్లాడుతూ.. కోర్టును ఆశ్రయించడం ప్రతీ వ్యక్తికి ఉన్న హక్కు. ఈ సమయంలో అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాల్సిన అవసరం ఉందని తాను ఇప్పటికే చెప్పినట్టు స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు