నితీష్‌ ప్రధాని అవుతారు, ఆయనకు మించిన సమర్థుడు లేడు: జేడీయూ నేత

24 Sep, 2023 19:25 IST|Sakshi

బిహార్‌ సీఎం నితీష్ కుమార్ ప్రధానమంత్రి అవుతారని జేడీయూ నేత కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష ఇండియా కూటమిలో నితీష్‌ కుమార్‌ ప్రధాపి అభ్యర్థిగా ఉంటారని బిహార్‌ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ మహేశ్వర్‌ హజారీ పేర్కొన్నారు. నితీష్‌కు మించిన సమర్థుడైన నాయకుడు మరొకరు లేరని అన్నారు. నితీషే ప్రధానమంత్రి అభ్యర్థనే విషయాన్ని ఇండియా కూటమి తర్వలోనే ప్రకటిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

2024 లోకసభ ఎన్నికలకుముందు పార్టీ సన్నద్ధత గురించి ఆయన మాట్లాడుతూ.. సీఎం నితీష్ కుమార్‌లో ప్రధానికి కావాల్సిన అన్ని అర్హతలు, లక్షణాలు ఉన్నాయని అన్నారు. ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి పేరును ఎప్పుడు ప్రకటించినా.. అది నితీష్‌ కుమార్‌ పేరే అయి ఉంటుందని తెలిపారు. 

దేశంలో రామ్‌మనోహర్‌ లోహియా తర్వాత మహోన్నతమైన సోషలిస్టు నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది నితీష్‌ కుమార్‌ జీ అని ప్రధాని నరేంద్ర మోదీ గతంలో  వ్యాఖ్యానించారని, నితీష్ కుమార్ 5 సార్లు కేంద్రంలో మంత్రిగా 18 ఏళ్లుగా బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
చదవండి: మణిపూర్-మయన్మార్ సరిహద్దులో కంచె!

కాగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా.. 26 ప్రతిపక్ష పార్టీలు కలిసి ‘ఇండియా’ కూటమిగా ఏర్పడిన విషయం అందరికీ తెలిసిందే. అయితే.. ఇందులో ప్రధాని అభ్యర్థి ఎవరు? అనే విషయంపై మాత్రం సస్పెన్స్‌ కొనసాగుతోంది. దీనిపై తామింకా నిర్ణయం తీసుకోలేదని కూటమి నేతలు చెప్తున్నప్పటికీ.. మమతాబెనర్జీ, నితీష్ కుమార్, రాహుల్ గాంధీ ఇలా పలువురు నాయకులు ప్రధాని అభ్యర్థి బరిలో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మహేశ్వర్‌ హజారీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఇదిలా ఉండగా.. నితీష్ కుమార్ మాత్రం తనకు ప్రధాని పదవిపై ఎలాంటి ఆశలు లేవని ఇదివరకే అన్నారు. ప్రతిపక్ష నాయకులు ఏకమై ముందుకు సాగాలన్నదే తన కోరిక అని తెలిపారు. అయితే 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రతిపక్షాల ప్రయత్నాలకు నాయకత్వం వహిస్తానని చాలాసార్లు చెప్పారు.
చదవండి: ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం, బీజేపీకి సర్‌ప్రైజ్‌!: రాహుల్‌ గాంధీ

మరిన్ని వార్తలు