నితీష్‌ ప్రభుత్వంపై ప్రతిపక్ష ఆర్జేడీ ధ్వజం

18 Nov, 2020 19:03 IST|Sakshi

అవినీతి పరులకు అందలం అంటూ ఘాటు విమర్శలు

పట్నా: బిహార్‌లో కొత్త ప్రభుత్వం కొలువు దీరిన రెండు రోజుల్లోనే వివాదం చెలరేగింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మెవాలాల్‌ చౌదరిని మంత్రివర్గంలోకి తీసుకోవడమే ఈ వివాదాని​కి కారణం. గతంలో మెవాలాల్‌ భాగల్‌పూర్‌ వ్యవసాయ వర్సిటీకి వైస్‌ చాన్సలర్‌గా పని చేశారు. ఆయన హయాంలో వర్సిటీ పరిధిలో నిర్మించిన పలు భవనాల విషయంలో అవకతవకలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు వినిపించాయి. దీంతో పాటు 2017లో లంచం తీసుకుని అర్హతలేని వారిని యూనివర్శిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, జూనియర్‌ శాస్త్రవేత్తలుగా నియమించినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే బిహార్‌లో కొత్తగా ఏర్పాటైన ఎన్డీయే సర్కార్‌ ఆయనకు విద్యాశాఖ మంత్రిగా అవకాశం కల్పించింది. అవినీతికి పాల్పడిన వ్యక్తికి మంత్రి పదవి ఎలా ఇస్తారంటూ ప్రతిపక్ష ఆర్జేడీ (రాష్ట్రీయ జనతాదల్‌) మండిపడింది. ఈ మేరకు తేజస్వీ యాదవ్‌ ట్వీట్‌ చేశారు. ఒ‍క్క ముస్లిం వ్యక్తికి కూడా మంత్రి అయ్యే అవకాశం ఇవ్వలేదని.. తన సీఎం పదవిని కాపాడుకోవడం కోసమే అవినీతిపరులకు నితీష్‌ పదవులు కట్టబెడుతున్నారని తేజస్వీ ఆరోపించారు. పది లక్షల ఉద్యోగాలు ఇస్తానని తాను చెప్తే అందుకు విరుద్ధంగా నితీష్‌ ప్రభుత్వం మెవాలాల్‌ను మంత్రిని చేసి అవినీతిని ప్రోత్సహిస్తుందని ఆయన మండిపడ్డారు.

ఈ ఆరోపణలను మెవాలాల్‌ తోసిపుచ్చారు. ఈ అంశాలపై విచారణ కొనసాగుతోందని, దీనితో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. కోర్టులో తనపై ఎలాంటి పెండింగ్‌ కేసులు లేవన్నారు. తనపై ఎలాంటి చార్జిషీట్‌ దాఖలు చేయలేదని.. తనపై కేసులున్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో ఎక్కడా పేర్కొనలేదని ఆయన వివరణ ఇచ్చారు. అవినీతి పరుడైన తేజస్వీ యాదవ్‌కు ఇతరులను విమర్శించే అర్హత లేదన్నారు. చాలా మంది ఆర్జేడీ ఎమ్మెల్యేలపై అవినీతి కేసులున్న విషయాన్ని ఈ సందర్భంగా మెవాలాల్‌ గుర్తుచేశారు. ఈ కేసుకు సంబంధించి 2017లో తన మేనల్లుడు అరెస్టయ్యాడన్న తేజస్వి ఆరోపణలను ఆయన ఖండించారు. అప్పటి రాష్ట్ర గవర్నర్‌ రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ అంశంపై దర్యాప్తుకు ఆదేశించారని, తమపై ఎలాంటి కేసులు నమోదు కాలేదన్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని మెవాలాల్‌ హెచ్చరించారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో మెవాలాల్‌ చౌదరి తారాపూర్‌ నియోజకవర్గం నుంచి జేడీయూ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2017లో జేడీయూ నుంచి బహిష్కరణకు గురైన మెవాలాల్‌ తర్వాతి కాలంలో మళ్లీ పార్టీలోకి వచ్చారు. (చదవండి: బిహార్‌ అసెంబ్లీలో నేర చరితులెక్కువ!)

మరిన్ని వార్తలు