మూడు రోజుల్లో రెండో సారి..

3 Oct, 2023 04:04 IST|Sakshi

నేడు నిజామాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటన

రూ.8 వేల కోట్ల విలువైన పనులకు వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

అనంతరం జరిగే బహిరంగ సభలో రాజకీయ ప్రసంగం

బీఆర్‌ఎస్, ఎంఐఎంతోపాటు కాంగ్రెస్‌పైనా విమర్శలు ఉంటాయంటున్న నేతలు

ఇప్పటికే ఇందూరుకు పసుపు బోర్డు ప్రకటించిన ప్రధాని 

ఈ సభకు హాజరై కృతజ్ఞతలు తెలుపుతామన్న పసుపు రైతులు

సాక్షి, హైదరాబాద్‌/ సాక్షి, న్యూఢిల్లీ/ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: ప్రధాని నరేంద్ర మోదీ కేవలం మూడు రోజుల వ్యవధిలోనే తెలంగాణలో రెండోసారి పర్యటిస్తున్నారు. ఈ నెల 1న మహబూబ్‌నగర్‌లో రూ.13,500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపిన ప్రధాని.. మంగళవారం నిజామాబాద్‌లో నిర్వహించే కార్య­క్రమాల్లో పాల్గొననున్నారు. విద్యుత్, రైల్వే, ప్రజారోగ్యానికి సంబంధించి రూ.8,021 కోట్ల విలువైన ప్రాజెక్టులకు వర్చువల్‌ విధానంలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయను­న్నారు. తర్వాత ఇక్కడి గిరిరాజ్‌ కాలేజీ మైదానంలో నిర్వహించే బీజేపీ బహిరంగ సభలో రాజకీయ ప్రసంగం చేయనున్నారు. పాలమూరు పర్యట­నలో బీఆర్‌ఎస్, ఎంఐఎంలపై విమర్శలు గుప్పించిన ప్రధాని మోదీ.. నిజామా­బాద్‌­లో ఏం మాట్లాడుతారు, ఎలాంటి విమ­ర్శలు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

పాలమూరులో శంఖారావంతో..
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పాల­మూరు ప్రజాగర్జన సభలో బీజేపీ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించింది. ప్రధా­ని మోదీ ఈ సభ­లో పాల్గొని కేంద్ర ప్రభు­త్వం తెలంగాణకు అందిస్తున్న సాయాన్ని వివరించారు. రూ.­13,500 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. దీనితో­పాటు రాష్ట్రంలోని అధికార పార్టీపై ఘా­టుగా విమర్శలు గుప్పించారు.

మంగళవారం నిజామా­బాద్‌ సభలోనూ అటు అభివృద్ధి కార్యక్రమాలు, ఇటు రాజకీయ విమర్శలతో ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయను­న్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలో 3 ఎంపీ స్థానాలు గెలుచు­కు న్న బీజేపీ ఈసారి మరింత పట్టుపెంచుకునే దిశ గా నిజామాబాద్‌లో సభ, ప్రధానితో వరాల ప్రక టన చేపట్టినట్టు రాజకీయ వర్గాలు చెప్తున్నాయి.

కాంగ్రెస్‌పైనా విమర్శల దాడి:
పాలమూరు సభలో అధికార బీఆర్‌ఎస్‌పై, కేసీఆర్‌ సర్కార్‌ తీరుపై, బీఆర్‌ఎస్, ఎంఐఎం కుటుంబ రాజకీయాలను ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. అయితే ఈ ఏడాది చివరలో తెలంగాణతోపాటు మరో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉండటం, అందులో రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌ కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలు కావడం, తెలంగాణలోనూ ఆ పార్టీలో జోష్‌ కనిపిస్తుండటంతో..ఈసారి కాం­గ్రెస్‌ పార్టీపైనా మోదీ విరుచుకుపడే అవ­కా­­శం ఉందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి.
రాష్ట్రంలో పసుపు బోర్డు ఏ­ర్పా­టు చేస్తామని ప్రధాని ప్రకటించిన నేపథ్యంలో.. నిజామాబాద్‌ సభకు హాజ­రై కృతజ్ఞతలు చెప్తామని పసుపు రైతులు ప్రకటించారు. దీనికి నిజామాబా ద్, జగిత్యాల, నిర్మల్‌ జిల్లా ల నుంచి పసుపు రైతులు భారీగా తరలిరానున్నారు.

అభివృద్ధి కార్యక్రమాలు ఇవీ..

  •  నిజామాబాద్‌ పర్యటనలో మొత్తం రూ.8,021 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అందులో ప్రాజెక్టులు, పథకాలు ఇవీ..
  • పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎన్టీపీసీ నిర్మించిన అల్ట్రా సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌లో 800 మెగావాట్ల తొలి యూనిట్‌ను జాతికి అంకితం చేస్తారు.
  •  ‘ప్రధానమంత్రి ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మిషన్‌’ కింద రూ.516.5 కోట్లతో తెలంగాణలోని 20 జిల్లా కేంద్ర ఆస్పత్రుల్లో నిర్మించనున్న 50 పడకల క్రిటికల్‌ కేర్‌ విభాగాలకు శంకుస్థాపన చేస్తారు.
  • రూ.1,200 కోట్లతో 76 కిలోమీటర్ల పొడవునా  నిర్మించిన సిద్దిపేట–మనోహరాబాద్‌ రైల్వేలైన్‌ను.. సిద్దిపేట–సికింద్రాబాద్‌ వరకు తొలి రైలు సర్వీసును ప్రారంభిస్తారు.
  • ‘ధర్మాబాద్‌ మహారాష్ట్ర)–­మనోహరాబాద్‌–  మహబూ బ్‌నగర్‌–కర్నూల్‌ (ఏపీ)’ రైల్వే    లైన్‌లో రూ.305 కోట్లతో 348 కిలోమీటర్ల  మేర చేపట్టిన విద్యుదీకరణ పనులను జాతికి అంకితం చేస్తారు.

ఇదీ ప్రధాని మోదీ షెడ్యూల్‌

మంగళవారం మధ్యాహ్నం 2.55 గంటలకు ఎంఐ–17 సైనిక హెలికాప్టర్‌లో నిజామాబాద్‌కు చేరుకుంటారు. æ 3 గంటలకు ఇక్కడి గిరిరాజ్‌ ప్రభుత్వ కాలేజీ గ్రౌండ్స్‌లో తొలి వేదిక వద్దకు చేరుకుంటారు

  •  3.35 గంటలదాకా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు.
  • 3.45 గంటలకు పక్కనే ఉన్న బహిరంగ సభా వేదిక వద్దకు చేరుకుంటారు
  •  4.45 గంటల దాకా సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
  • సాయంత్రం 5 గంటలకు నిజామాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో తిరుగుప్రయాణం అవుతారు.
మరిన్ని వార్తలు