సోషల్‌ మీడియాలో ‘డర్టీ పాలిటిక్స్‌’

2 Aug, 2021 13:41 IST|Sakshi

విమర్శలు, ప్రతి విమర్శలతో హోరెత్తిస్తున్న వైనం

సామాజిక మాధ్యమాల్లో ‘డర్టీ పాలిటిక్స్‌’

జిల్లా అంతటా అదే పరిస్థితి  

సాక్షి, కామారెడ్డి: జిల్లాలో రాజకీయ పార్టీల నడుమ ‘సోషల్‌ వార్‌’ నడుస్తోంది. ఫలితంగా రోజురోజుకూ ‘పొలిటికల్‌’ హీట్‌ పెరుగుతోంది. విమర్శలు, ప్రతి విమర్శలతో సోషల్‌ మీడియా హోరెత్తుతోంది. అధికార, విపక్ష పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు సామాజిక మాధ్యమాల వేదికగా కత్తులు దూసుకుంటున్నారు. వ్యక్తిగత విమర్శలకు సైతం దిగుతున్నారు. ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే నిధులు వస్తాయంటూ ప్రతిపక్ష పార్టీల నేతలు సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతూ డిమాండ్‌ చేస్తున్నారు. వాటిని తిప్పికొడుతూ అధికార పార్టీ నేతలు పెడుతున్న పోస్టింగులతో రచ్చవుతోంది. 

దళిత బంధు పథకానికి శ్రీకారం చుడుతున్న ప్రభుత్వం.. ఉప ఎన్నిక జరుగనున్న హుజురాబాద్‌లోని మొత్తం దళిత కుటుంబాలకు సాయం అందించనున్నట్లు ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల సాయం అందించనున్నట్లు తెలిపింది. దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నేతలు సామాజిక మాధ్యమాల వేదిక విమర్శలు కురిపిస్తున్నారు. మన ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తే మన దగ్గర కూడా ఉప ఎన్నికలు వస్తాయని, తద్వారా మనకూ నిధుల వరద పారుతుందని ప్రచారం ప్రారంభించారు.

జిల్లాలోని నలుగురు ఎమ్మెల్యేల ఫొటోలు పెట్టి మరీ రాజీనామా చేయాలంటూ వైరల్‌ చేస్తున్నారు. దీంతో టీఆర్‌ఎస్‌ శ్రేణులు రంగంలోకి దిగాయి. అదే సోషల్‌ మీడియా వేదికగా ఎదురుదాడి ప్రారంభించాయి. ప్రభుత్వం కల్యాణలక్ష్మి ఇస్తున్నందుకు రాజీనామా చేయాలా..? లేక రైతుబంధు ఇస్తున్నందుకు రాజీనామా చేయాలా? అంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేస్తున్నారు. దీంతో రెండు, మూడ్రోజులుగా సోషల్‌ మీడియాలో పొలిటికల్‌ వార్‌ జోరుగా సాగుతోంది. 

మితిమీరితే కేసులు తప్పవు..! 
సోషల్‌ మీడియా వేదికగా జరుగుతున్న యుద్ధం పరిమిత స్థాయిలో ఉంటే ఫర్వాలేదు. కానీ పరుష పదాలతో పాటు హెచ్చరించే పోస్టులు పెడితే మాత్రం ఎవరైనా ఇబ్బందులు పడాల్సిందే. విమర్శలు మితిమీరి అదుపు తప్పితే కేసులతో పాటు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితులు కూడా ఉత్పన్నమవుతాయని పోలీసులతో పాటు న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాజీనామాలు డిమాండ్‌ చేయడం, ఎందుకు రాజీనామా చేయాలని ఎదురు దాడికి పరిమితమైతే ఏ ఇబ్బంది ఉండదు. కానీ కొందరు మా జోలికొస్తే ఊరుకునేది లేదని, తాటా తీస్తామనే పెద్ద పెద్ద పదాలు వాడుతూ రెచ్చగొడుతున్నారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోననే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆయా రాజకీయ పార్టీల నేతలు తమ సోషల్‌ మీడియా బాధ్యులతో పాటు పార్టీల శ్రేణులను నిలువరించక పోతే పరిస్థితి అదుపు తప్పే ప్రమాదముంది.  

వ్యక్తిగత విమర్శలకూ వెనుకాడడం లేదు.. 
రాజీనామాల డిమాండ్‌తో మొదలైన సోషల్‌ వార్‌ క్రమంగా ముదురుతోంది. విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూ చివరకు వ్యక్తిగత విమర్శలకూ దిగుతున్నారు. కొందరైతే పరిమితులు దాటి వ్యవహరిస్తున్నారు. మా జోలికొస్తే తాటా తీస్తామంటూ పెడుతున్న పోస్టింగులు మరింత ఆజ్యం పోస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో రాజకీయ పార్టీల మధ్య సాగుతున్న సోషల్‌ వార్‌ ఎటు దారి తీస్తుందోనన్న చర్చ నడుస్తోంది. 

అన్ని పార్టీలకూ సోషల్‌ మీడియా విభాగాలు.. 
అధికార టీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్, బీజేపీలకు చెందిన సోషల్‌ మీడియా విభాగాలు క్రియాశీలకంగా పని చేస్తున్నాయి. అయితే, ఎన్నికల సమయంలో హడావుడి చేసే ఆయా పార్టీల ‘సోషల్‌ వారియర్లు’ ఈ సారి ముందుగానే యాక్టివ్‌ అయ్యారు. అప్పుడే ఎన్నికలు వచ్చాయా అన్న రేంజ్‌లో ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నాయి. వాట్సప్, ఫేస్‌బుక్‌ ఓపెన్‌ చేస్తే చాలు రాజీనామాల డిమాండ్‌లు, ఎందుకు రాజీనామా చేయాలన్న ఎదురుదాడులతో కూడిన పోస్టులే కనిపిస్తున్నాయి. జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్‌ అసెంబ్లీ నియోజక వర్గాల్లో అన్ని చోట్లా టీఆర్‌ఎస్‌కు చెందిన వారే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వారంతా రాజీనామా చేయాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్‌ చేస్తుండగా, అధికార పక్షం ఎందుకు రాజీనామా చేయాలని ప్రశ్నిస్తోంది. ఇదే సమయంలో ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు.

మరిన్ని వార్తలు