కాంగ్రెస్‌ నిర్వాకం వల్లే ఈశాన్యంలో సమస్యలు.. నార్త్‌ఈస్ట్‌... జిగర్‌ కా తుక్డా: మోదీ

11 Aug, 2023 10:25 IST|Sakshi

ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడల్లా మాకు శుభాలే కలుగుతున్నాయి

వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఘన విజయం సాధిస్తాం.. వరుసగా మూడోసారీ మా ప్రభుత్వమే  

2028లో అవిశ్వాసం పెడితే నాలుగోసారి కూడా గెలుస్తాం

లోక్‌సభలో ప్రధాని మోదీ సుదీర్ఘ ప్రసంగం.. అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానం

మణిపూర్‌లో శాంతి కోసం కృషి చేస్తున్నాం.. త్వరలోనే మళ్లీ అభివృద్ధి పథంలో మణిపూర్‌  

కాంగ్రెస్‌ నీచ రాజకీయాల వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి     

అహంకారుల కూటమి ‘ఇండియా’.. త్వరలో ఆ దుకాణం బంద్‌   

సభలో మూజువాణి ఓటుతో వీగిపోయిన అవిశ్వాస తీర్మానం 

న్యూఢిల్లీ: ప్రతిపక్షాలు తమపై అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టిప్పుడల్లా శుభాలే కలుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆనందం వ్యక్తం చేశారు. అవిశ్వాసం అంటే శుభపద్రం, శుభసూచకమేనని చెప్పారు. వచ్చే ఎన్నికల్లోనూ ఘన విజయం సాధిస్తామని, వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తేల్చిచెప్పారు. 2028లో కూడా తమపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. పేదల బిడ్డను ప్రజలు కచ్చి తంగా ఆశీర్వదిస్తారని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వంపై లోక్‌సభలో విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చకు గురువారం ఆయన సమాధానమిచ్చారు.

ప్రతిపక్షాలపై, ముఖ్యంగా కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ఇండియా’ కూటమి అహంకారులతో నిండిపోయిందని మండిపడ్డారు. అందులో అందరూ పెళ్లికొడుకులేనని ఎద్దేవా చేశారు. మోదీ లోక్‌సభలో 2.10 గంటలపాటు సుదీర్ఘంగా ప్రసంగించారు. మణిపూర్‌ అంశాన్ని మోదీ ప్రస్తావించినప్పుడు కాంగ్రెస్‌ సహా ప్రతిపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు.

అసలు విషయం మోదీ మాట్లాడడం లేదని వారు ఆరోపించారు. మణిపూర్‌లో త్వర­లోనే శాంతి నెలకొంటుందని ప్రధాని చెప్పారు. ప్రజలపై అరాచకాలకు పాల్పడ్డ దుండగులను శిక్షిస్తామని హామీ ఇచ్చారు. దేశ ప్రజలంతా మీకు అండగా ఉన్నారంటూ మణిపూర్‌ మహిళలకు భరోసా కల్పించారు. అవిశ్వాసంపై జరిగిన చర్చలో టీడీపీ తరపున ఎవరూ మాట్లాడలేదు. మోదీ ప్రసంగం అనంతరం సభలో అవిశ్వాస తీర్మానం మూజువాణి ఓటుతో వీగిపోయింది. ప్రధాని ప్రసంగం ఆయన మాటల్లోనే...  

2028లోనూ అవిశ్వాసం పెట్టండి  
వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో మేము మళ్లీ ఘన విజయం సాధించడం తథ్యం. రికార్డులను తిరగరాయడం ఖాయం. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మాకు శుభప్రదమే. 2018లో మాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. 2019లో జరిగిన ఎన్నికల్లో అఖండ విజయం సాధించాం. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చాం. ఆ అవిశ్వాస తీర్మానం మాకు శుభ సూచకమని నిర్ధారణ అయ్యింది.

ఇప్పుడు ప్రవేశపెట్టిన అవిశ్వాసం కూడా మాకు శుభాలు చేకూర్చబోతోంది. వచ్చే ఎన్నికల్లో నెగ్గబోతున్నాం. ప్రజలకు కుంభకోణాల రహిత, అవినీతి రహిత పాలన అందిస్తున్నాం. వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తాం. 2028లో కూడా మాపై మరో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడితే మన దేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం తథ్యం. మా ప్రభుత్వంపై దేశ ప్రజలు మళ్లీ మళ్లీ విశ్వాసాన్ని కనబరుస్తున్నారు. అందుకు వారికి కృతజ్ఞతలు. ఈ పేదల బిడ్డను ప్రజలు ఆశీర్వదిస్తారు.   
 
నార్త్‌ఈస్ట్‌... జిగర్‌ కా తుక్డా  
ఈశాన్య ప్రాంతం మన దేశం హృదయంలో ఒక భాగం(జిగర్‌ కా తుక్డా). మణిపూర్‌లో హింస జరగడం నిజంగా బాధాకరం. మణిపూర్‌లో శాంతియుత పరిస్థితుల పునరుద్ధరణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేస్తున్నాయి. త్వరలోనే అక్కడ శాంతి నెలకొంటుంది. మహిళలపై అరాచకాలను ఎంతమాత్రం సహించబోం.

మహిళలను అవమానించిన వారిని, అకృత్యాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తాం. మణిపూర్‌లో త్వరలోనే శాంతి నెలకొంటుందని దేశ ప్రజలకు హామీ ఇస్తున్నా. మణిపూర్‌ ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు హామీ ఇస్తున్నా. దేశం మొత్తం మీకు అండగా ఉంది. పార్లమెంట్‌ మీకు అండగా ఉంది. మణిపూర్‌లో సమస్యలకు పరిష్కారాన్ని కచ్చి తంగా కనుగొంటాం. మణిపూర్‌ త్వరలోనే మళ్లీ అభివృద్ధి పథంలో పయనిస్తుంది.   
 
మహిళలపై నేరాలు క్షమార్హం కావు  
మణిపూర్‌ హైకోర్టు నిర్ణయం తర్వాతే అక్కడ సమస్య మొదలైంది. చిన్నచిన్న సంఘటనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. హింస చోటుచేసుకుంది. ఎన్నో కుటుంబాలను సమస్యలను ఎదుర్కొన్నాయి. చాలామంది తమ ఆప్తులను కోల్పోయారు. మహిళలపై అఘాయిత్యాలు జరిగాయి. మహిళలపై నేరాలు క్షమార్హం కావు. మణిపూర్‌ అంశంపై పార్లమెంట్‌లో చర్చ జరగడం ప్రతిపక్షాలకు ఎంతమాత్రం ఇష్టం లేదు. అందుకే నిత్యం ఉభయ సభల్లో ఉద్దేశపూర్వకంగా రగడ సృష్టిస్తున్నాయి.

దేశ అభివృద్ధికి సంబంధించిన బిల్లులపై పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేతలు చర్చ జరగనివ్వడం లేదు. వారికి దేశం కంటే పార్టీయే ముఖ్యమని నిరూపిస్తున్నారు. ప్రజలు వంచిస్తున్నారు. కాంగ్రెస్‌కు ప్రభుత్వంపై విమర్శలపై ఉన్న శ్రద్ధ పార్లమెంట్‌లో ఆమోదం పొందాల్సిన కీలక బిల్లులపై లేదు. విపక్షాలు నోబాల్స్‌ వేస్తుంటే అధికార పక్షం సెంచరీలు కొడుతోంది. మణిపూర్‌ విషయంలో రాజకీయాలు చేయొద్దని విపక్షాలను కోరుతున్నా. ప్రజల భాధలను తగ్గించే ఔషధంగా పనిచేయండి.   
 
మా అంకితభావానికి నిదర్శనం  
ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. గత తొమ్మిదేళ్లలో ఈశాన్య రాష్ట్రాల్లో 50 పర్యాయాల కంటే ఎక్కువే పర్యటించా. మా మంత్రులు 400 కంటే ఎక్కువసార్లు అక్కడ పర్యటించారు. ఇవి కేవలం గణాంకాలు కాదు. ఈశాన్యంపై మా ప్రభుత్వానికున్న అంకితభావానికి ఇవొక నిదర్శనం. ప్రధానమంత్రి ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం 1966 మార్చి 5న మిజోరాం ప్రజలపై వైమానిక దాడులకు పాల్పడింది.

సొంత ప్రజలపై వైమానిక దాడుల చేసిన ఘటన దేశ చరిత్రలో ఇదొక్కటే. 1962లో భారత్‌–చైనా యుద్ధ సమయంలో ఈశాన్య ప్రాంతాల ప్రజలను అప్పటి నెహ్రూ ప్రభుత్వం గాలికొదిలేసింది. 1980వ దశకంలో పంజాబ్లో అకల్‌ తఖ్త్‌పై కాంగ్రెస్‌ సర్కారు సైనిక చర్యకు దిగింది. మణిపూర్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉన్నప్పుడు తీవ్రవాదులు చెలరేగిపోయారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో గాందీజీ చిత్రపటాలు పెట్టనివ్వలేదు. స్కూళ్లలో జాతీయ గీతం పాడనివ్వలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉన్నప్పుడే నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ విగ్రహంపై ముష్కరులు బాంబుదాడి చేశారు. కాంగ్రెస్‌ హయాంలో ఎన్నో దారుణాలు జరిగాయి.  
 
దాడులు చేస్తున్న దేశంతో చర్చలు జరపాలా?
 
కాంగ్రెస్‌కు, దాని మిత్రపక్షాలకు పాకిస్తాన్‌ అంటే ఎనలేని ప్రేమ. మనదేశంలో ఉగ్రవాద దాడులు జరిగినప్పుడల్లా పాకిస్తాన్‌పై అనురాగం ప్రదర్శిస్తుంటాయి. భారతీయులను మనోభావాలను పక్కనపెట్టి పాకిస్తాన్‌ను సమర్థిస్తుంటాయి. విపక్షాలు ఎప్పుడూ పాకిస్తాన్‌నే నమ్ముతుంటాయి. భారతదేశపు అంతర్గత శక్తియుక్తులపై, భారత సైనికుల సామర్థ్యంపై ప్రతిపక్షాలకు విశ్వాసం లేదు. కశ్మీర్‌లోని వేర్పాటువాదులంటే విపక్ష నాయకులకు ఎంతో మక్కువ. వారు ఎక్కువగా వేర్పాటువాదులనే కలుస్తుంటారు. పాకిస్తాన్‌ మన సరిహద్దుల్లో దాడులు చేస్తోంది.

ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి మన దేశంలోకి పంపిస్తోంది. భారత్‌లో ఉగ్రదాడులు జరిగితే పాకిస్తాన్‌ ఎలాంటి బాధ్యత తీసుకోదు. అయినా మన ప్రతిపక్ష నాయకులు పాకిస్తాన్‌నే సమర్థి,స్తుంటారు. పాకిస్తాన్‌ ఏది చెబితే అది నిజమని నిస్సిగ్గుగా వెనకేసుకొస్తారు. మన గడ్డపై పాకిస్తాన్‌ ముష్కరులు దాడులు చేస్తున్నా ఆ దేశంతో చర్చలు జరపాలని మూర్ఖంగా వాదిస్తుంటారు.  
 
పాకిస్తాన్‌ జెండాలు మోసినవారే కాంగ్రెస్‌కు ఇష్టం  
కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఉగ్రవాద మంటల్లో కశ్మిర్‌ చిక్కుకుంది. అమాయక జనం బలైపోయారు. అయినా కశ్మిర్‌లోని సామాన్య ప్రజలను ఏనాడూ కాంగ్రెస్‌ విశ్వసించలేదు. హురియత్‌ కాన్ఫరెన్స్‌ను, వేర్పాటువాదులను, పాకిస్తాన్‌ జెండాలు మోసినవారిని మాత్రమే కాంగ్రెస్‌ నమ్మింది.

పాకిస్తాన్‌ భూభాగంలో నక్కిన ముష్కరులపై సర్జికల్‌ స్ట్రైక్స్‌ నిర్వహించినప్పుడు కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు నానా యాగీ చేశాయి. మన సైనిక దళాల బలాన్ని విశ్వసించలేదు. మన శత్రువులు చెప్పినదాన్నే విశ్వసించాయి. భారతదేశానికి వ్యతిరేకంగా ఎవరు ఏది మాట్లాడినా దాన్ని మరింత పెద్దది చేసి చూపి, సంబరపడే శక్తి ప్రతిపక్షాలకు ఉంది.  
 
ప్రతిపక్షాల వద్ద ‘రహస్య వరం’  
ప్రతిపక్షాలు అహంకారానికి, అవిశ్వాసానికి మారుపేరు. వాటిది నిప్పుకోడి తరహా మనస్తత్వం. భారతదేశ కీర్తిప్రతిష్టలు అంతర్జాతీయ నూతన శిఖరాలకు చేరుతున్నాయి, ప్రజల్లో కొత్త ఉత్సహం, కొత్త శక్తి నిండుతోంది. ఈ నిజాన్ని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ప్రతిపక్షాల వద్ద ‘రహస్య వరం’ ఏదో ఉన్నట్టుంది. ఇతరులకు చెడు జరగాలని వారు (విపక్ష నేతలు) కోరుకుంటే మంచి జరుగుతోంది. అందుకు నేనే ఉదాహరణ. గత 20 ఏళ్లుగా నన్ను లక్ష్యంగా చేసుకుంటున్నారు. శాపనార్థాలు పెడుతున్నారు.

కానీ, నాకు ఏమీ కాలేదు. బ్యాంకింగ్‌ రంగంపై, ప్రభుత్వ రంగంలోని హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌పై, భారతీయ జీవిత బీమా సంస్థపై ప్రతిపక్షాలు ఎన్నో ఆరోపణలు చేశాయి. వాస్తవానికి ప్రభుత్వ రంగ బ్యాంకులు రికార్డు స్థాయిలో లాభాలు ఆర్జించాయి. హెచ్‌ఏఎల్‌ రికార్డు స్థాయిలో రెవెన్యూ సాధించింది. ఇక ఎల్‌ఐసీ అద్భుత పనితీరుతో లాభాల బాటలో దూసుకెళ్తోంది. విపక్షాలు ఇప్పుడేం చేయాలో తెలియక చివరకు దేశాన్ని శపిస్తున్నాయి.

కానీ, మన దేశం మరింత శక్తివంతంగా మారుతోంది. ప్రభుత్వం సైతం బలోపేతం అవుతోంది. మూడో పర్యాయం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. అప్పుడు మన దేశం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. భారత్‌ ఇప్పుడు చాలా కీలక దశలో ఉంది. దీని ప్రభావం మరో వెయ్యేళ్లు ఉంటుంది. దేశ ప్రజల బలం, శ్రమ, కష్టపడే తత్వం వచ్చే వెయ్యి సంవత్సరాలకు బలమైన పునాది వేస్తాయి. నీతి ఆయోగ్‌ నివేదిక ప్రకారం.. దేశంలో గత ఐదేళ్లలో ఏకంగా 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు.  
 
కాంగ్రెస్‌ నిర్వాకం వల్లే ఈశాన్యంలో సమస్యలు  
పరాయి గడ్డ నుంచి మన దేశంలోకి వస్తున్న ముష్కర మూకలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ మాట్లాడిన దాఖలాలు ఎప్పుడూ లేవు. అందుకే కాంగ్రెస్‌ పట్ల దేశ ప్రజలు పూర్తి అవిశ్వాసం ప్రదర్శిస్తున్నారు. కాంగ్రెస్‌కు ఒక విజన్‌ గానీ, ఒక విధానం గానీ లేవు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ పాత్ర గురించి కాంగ్రెస్‌కు తెలియదు. భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ది వెనుక తమ నాయకుల పాత్ర ఉందని ఆ పార్టీ చెప్పుకుంటోంది. అందులో ఎంతమాత్రం నిజంలేదు. ఈశాన్య రాష్ట్రాల్లో అన్ని సమస్యలకు కాంగ్రెస్, ఆ పార్టీ నీచ రాజకీయాలే మూలకారణం. అక్కడి ప్రజలను కాంగ్రెస్‌ దారుణంగా మోసం చేసింది. ఈశాన్యంతో నాకు భావోద్వేగ అనుబంధం ఉంది. ప్రధానమంత్రిని కాకముందే ఆ ప్రాంతంలో ఎన్నోసార్లు పర్యటించా.  
 
విపక్ష దుకాణం త్వరలో బంద్‌  
ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి అహంకారులైన వారసత్వ రాజకీయ నాయకులతో నిండిపోయింది. విద్వేషం, విభజన, అత్యవసర పరిస్థితి, సిక్కులపై దాడులు, అబద్ధాలు, అవినీతి, కుంభకోణాలు, రెండంకెల ద్రవ్యోల్బణం, అస్థిరత, బుజ్జగింపు రాజకీయాలు, వారసత్వ రాజకీయాలు, నిరుద్యోగం, ఉగ్రవాదం.. ఇవన్నీ ప్రతిపక్షాల ఘనతలే. ప్రతిపక్ష నాయకులు గనుక అధికారంలోకి వస్తే దేశాన్ని రెండు శతాబ్దాలు వెనక్కి తీసుకెళ్తారు.

ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి బీటలువారిన ఇంటికి పూతలు పూసే ప్రయత్నంలా ఉంది. మా కూటమి ఎన్డీయే కేవలం అభివృద్ధి రాజకీయాలు చేస్తోంది. దేశం పేరు పెట్టుకున్న విపక్ష కూటమితో ఒరిగేదేమీ లేదు. విపక్షాల కొత్త దుకాణం త్వరలో బంద్‌ అవుతుంది. ఈ విషయం విపక్ష నేతలకు కూడా తెలుసు. అది కేవలం లూటీ దుకాణం, విద్వేష బజార్‌. మా కూటమి ఎన్డీయే. దానికి రెండు ‘ఐ’ అక్షరాలు కలిపి ‘ఇండియా’ అని పెట్టుకున్నారు.

అందులో ఒక ‘ఐ’ 26 పార్టీల అహంకారం. మరో ‘ఐ’ ఒక కుటుంబ అహకారం. పేరు మార్చుకున్నంత మాత్రాన పాత పాపాలను దాచలేరు. వారసత్వ రాజకీయాలు అంతం కావాలని మహాత్మాగాందీ, అంబేడ్కర్, మౌలానా ఆజాద్‌ తదితర గొప్ప నాయకులు ఆకాంక్షించారు. కానీ, వారసత్వ రాజకీయాలు, డబ్బుతోనే ఒక కుటుంబం చుట్టూ ‘ఇండియా’ కూటమి ఏర్పాటైంది.  
 
నేను ప్రధాని కావడం కాంగ్రెస్‌ జీర్ణించుకోవడం లేదు  
నేను పేద కుటుంబం నుంచి వచ్చా. పేదల బిడ్డ అధికారంలోఉండడాన్ని గాంధీ కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది. దేశంలో 30 ఏళ్ల తర్వాత ప్రజలు పూర్తి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. నిరుపేద బిడ్డ ఉన్నత పదవిలో ఉండడం ఏమిటని కాంగ్రెస్‌ పెద్దలు ఆందోళన చెందుతున్నారు. వారు(కాంగ్రెస్‌ నాయకులు) గతంలో విమానాల్లో పుట్టిన రోజు కేకులు కట్‌ చేసుకున్నారు. మనం అదే విమానాల్లో వ్యాక్సిన్లు రవాణా చేశాం. వారు తమ దుస్తులను విమానాల్లో పంపించుకున్నారు.

నేడు పేదలు సైతం విమానాల్లో ప్రయాణిస్తున్నారు. వారు నావికాదళం నౌకలను విందులు వినోదాల కోసం వాడుకున్నారు. అది ‘ఇండియా’ కాదు, ముమ్మాటికీ అహంకార కూటమి. అందులోని ప్రతి నాయకుడు పెళ్లి కొడుకు(ప్రధానమంత్రి) కావాలనుకుంటున్నారు. కాంగ్రెస్‌ను ఒక విదేశీయుడు స్థాపించారు. ఆ పార్టీ జెండా, పార్టీ గుర్తు, సిద్ధాంతాలు ఇతరుల నుంచి దొంగిలించినవే. అహంభావం వల్లే కాంగ్రెస్‌ 400 సీట్ల నుంచి 40 సీట్లకు పడిపోయింది. బెంగళూరులో ‘యూపీఏ’కు సమాధి కట్టిన విపక్ష స్నేహితులకు ఇదే నా సానుభూతి.  
 
రాహుల్‌.. విఫల ఉత్పత్తి  

మన భరతమాత మృతి చెందాలని కొందరు ఎందుకు కోరుకుంటున్నారో అర్థం కావడం లేదు. భారతమాత హత్య అంటూ అనుచితంగా మాట్లాడడం భారతీయుల మనోభావాలను తీవ్రంగా గాయపర్చింది. ప్రజాస్వామ్యం హత్య, రాజ్యాంగం హత్య అంటూ మాట్లాడే ఈ వ్యక్తులే(కాంగ్రెస్‌ నాయకులు) భరతమాతను మూడు ముక్కలు చేశారు. బానిసత్వం నుంచి భరతమాతకు విముక్తి కలిగించే సమయం వచ్చి నప్పుడు ఆమె అవయవాలను నరికేశారు. కాంగ్రెస్‌కు రాజకీయాలు చేయడం తప్ప మరేమీ తెలియదు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీని పలుమార్లు రాజకీయాల్లో ప్రవేశపెట్టారు. ప్రతిసారీ ఆయన విఫలమయ్యారు. ఆయనొక ‘విఫల ఉత్పత్తి’.   

మరిన్ని వార్తలు