Munugode Politics: మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థి ఎంపికపై క్లారిటీ వచ్చేసిందా..? ప్రకటన అప్పుడేనా?

1 Sep, 2022 13:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌/నల్గొండ: మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థి ఎంపిక సాఫీగా జరుగుతుందా? టిక్కెట్‌ రాని ఆశావహుల్ని దారికి తెచ్చుకోగలుగుతారా? గాంధీభవన్‌లో ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌గా మారింది. అభ్యర్థి ఎంపికపై అనేకసార్లు మీటింగులు జరుగుతున్నాయి. నలుగురు ఆశావహులతో కూడా భేటీలు నిర్వహించారు. అభ్యర్థి ఎంపికపై ఏకాభిప్రాయం కుదరలేదు. ఇక పీసీసీ స్థాయిలో తేలదని తేలిపోయింది. ఎంపిక బాధ్యతను హైకమాండ్‌ మీదికి నెట్టేసి కూల్ అయిపోయారు టీ కాంగ్రెస్ నాయకులు..
చదవండి: మునుగోడులో బీజేపీకి బూస్ట్‌

ఎప్పుడు ప్రకటిస్తారు?
మునుగోడు ఉప ఎన్నికపై అందరికంటే ముందే స్పందించింది కాంగ్రెస్ పార్టీ.. ఉప ఎన్నికకు సిద్ధం అవుతున్నామంటూ రేవంత్ రెడ్డి ఇతర పార్టీల నేతలకంటే ముందే ప్రకటించారు.. ఆ తర్వాత మునుగోడు నియోజకవర్గ పార్టీ మీటింగ్ నిర్వహించి ఎన్నికకు శంఖారావం కూడా పూరించారు. అభ్యర్థిని కూడా ఈ నెలాఖరుకు ప్రకటిస్తామని టీపీసీసీ తెలిపింది. నెలాఖరు అయిపోయింది. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు ఇండియాలోనే లేరు. చికిత్స కోసం మొత్తం కుటుంబం అంతా విదేశాలకు వెళ్ళింది. ఇంతకీ అభ్యర్థిని ఎప్పుడు ప్రకటిస్తారు?

ఎటూ తేల్చుకోలేక..
మునుగోడు అభ్యర్థి ఎంపిక విషయంలో కాంగ్రెస్ ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఇప్పటికే పదుల సార్లు గాంధీభవన్‌లో సమీక్షలు నిర్వహించింది హస్తం పార్టీ. మరో వైపు నేతలందరి అభిప్రాయమూ సేకరించారు. ఇంకో వైపు సునీల్ కనుగోలు సర్వే రిపోర్ట్ ఇచ్చినా అభ్యర్థిని తేల్చే విషయంలో కాంగ్రెస్ తర్జనభర్జనలు పడుతోంది. అభ్యర్థిని ప్రకటించకపోవడం వల్ల మునుగోడులో పార్టీ క్యాడర్ చే జారిపోతుందనే ఆందోళన అక్కడి పార్టీ నేతల్లో కనిపిస్తోంది. ఓ వైపు బీజేపీ, మరోవైపు టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్‌కు దిగుతున్నాయి. దీంతో కాంగ్రెస్ క్యాడర్ అంతా చెల్లా చెదురు అవుతోంది. అభ్యర్థిని ప్రకటించకపోవడంతో ఆశావాహ నేతలంతా తమకేమీ పట్టనట్లుగా ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో మునుగోడులో కాంగ్రెస్ క్యాడర్ ఖాళీ అవుతుందనే చర్చ జరుగుతోంది.

ఇప్పటికిప్పుడు ప్రకటించినా..
మరోవైపు వ్యూహాత్మకంగానే అభ్యర్థిని ప్రకటించడం లేదనే చర్చ కాంగ్రెస్‌లో నడుస్తోంది. టిక్కెట్ రాని నేతల్ని చేర్చుకునేందుకు టీఆర్ఎస్, బీజేపీ రెడీగా ఉన్నాయి. దీంతో ఎన్నికల షెడ్యూల్ రాకముందే అభ్యర్థిని ప్రకటిస్తే అసంతృప్తి చాలా కాలం కొనసాగి పరిస్థితి చేజారి పోయే ప్రమాదం ఉందని, అందుకే టీఆర్ఎస్ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించిన తర్వాతే కాంగ్రెస్ అభ్యర్ధిని ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు ప్రకటించినా.. కొద్ది రోజుల తర్వాత ప్రకటించినా పెద్ద తేడా ఏమీ ఉండదని, కేంద్రం, రాష్ట్రంలోని రెండు అధికార పార్టీలు నయానో, భయానో తమ నేతల్ని, కార్యకర్తల్ని లాగేసుకునే ప్రయత్నం చేస్తున్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

ఆశావాహుల్లో టెన్షన్..
ఇప్పటికే టిక్కెట్‌ ఆశిస్తున్న నలుగురు ఆశావహ నేతలతో గాంధీభవన్‌లో సమావేశం నిర్వహించారు. తమ అభిప్రాయాలను సీల్డ్‌ కవర్‌లో ఢిల్లీకి పంపించారు టీపీసీసీ నేతలు. మంగళవారం నాడు గాంధీ భవన్‌లో పార్టీ ముఖ్యనేతలు, మునుగోడు మండల ఇంఛార్జ్‌లతో కూడా సమావేశం నిర్వహించారు. అభ్యర్థిని ప్రకటించే బాధ్యత హైకమాండ్‌దే అంటున్నారు టీపీసీసీ మాజీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి. అయితే ఆశావాహుల్లో మాత్రం టెన్షన్ కొనసాగుతోంది. వీలైనంత తొందరగా అభ్యర్థిని ప్రకటించి క్యాడర్‌ను కాపాడుకోవాలని కోరుతున్నారు. 

మరిన్ని వార్తలు