మళ్లీ మార్చి పంపండి!

28 Jul, 2020 04:26 IST|Sakshi
జైపూర్‌లోని ఓ హోటల్‌లో తన మద్దతుదారులతో కలసి నిరసన చేపట్టిన సీఎం గహ్లోత్‌

అశోక్‌ గహ్లోత్‌ కేబినెట్‌ పంపిన ప్రతిపాదనను మళ్లీ వెనక్కు పంపిన గవర్నర్‌

విశ్వాస పరీక్ష కోసమే అయితే స్వల్ప వ్యవధి నోటీసు

లేదంటే, 21 రోజుల నోటీస్‌ పీరియడ్‌తో అసెంబ్లీకి ఓకేనన్న గవర్నర్‌

జైపూర్‌: రాజస్తాన్‌ రాజకీయ డ్రామా కొనసాగుతోంది. 31వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించాలని కోరుతూ సీఎం అశోక్‌ గహ్లోత్‌ కేబినెట్‌ సవరణలతో పంపిన ప్రతిపాదనను గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రా సోమవారం వెనక్కు పంపారు. మరి కొన్ని వివరాలతో మరో ప్రతిపాదనను పంపించాలని కేబినెట్‌ను కోరారు. ‘కొన్ని వివరణలు కోరుతూ గవర్నర్‌ ఆ ఫైల్‌ను వెనక్కు పంపించారు’ అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

కేబినెట్‌ పంపిన తొలి ప్రతిపాదనను ఆరు అంశాలపై వివరణ కోరుతూ గవర్నర్‌ వెనక్కిపంపడం తెల్సిందే. వాటికి వివరణ ఇస్తూ ఈ నెల 31 నుంచి అసెంబ్లీని సమావేశపర్చాలని కోరుతూ రెండో ప్రతిపాదనను కేబినెట్‌ గవర్నర్‌కు పంపించింది. తాజాగా దాన్నీ గవర్నర్‌ వెనక్కు పంపించారు. మెజారిటీని నిరూపించుకునేందుకే అయితే, స్వల్ప వ్యవధిలో అసెంబ్లీని సమావేశపర్చే అవకాశముందని గవర్నర్‌ పేర్కొన్నారు.

‘విశ్వాస పరీక్ష కోసమే అసెంబ్లీ భేటీని నిర్వహించనున్నట్లు ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలో లేదు’అన్నారు. రెండో సారి ప్రతిపాదనను తిరస్కరిస్తూ గవర్నర్‌ ప్రభుత్వానికి పంపిన నోట్‌లో ఆ వివరాలున్నాయి. ఆ నోట్‌లో ‘21 రోజుల నోటీస్‌ పీరియడ్‌కు ప్రభుత్వం అంగీకరిస్తే శాసన సభను సమావేశపర్చవచ్చు. లేదా, సమావేశం ఎజెండా బలనిరూపణే అయితే, ఆ నోటీస్‌ కాల వ్యవధిని తగ్గించవచ్చు. ఒకవేళ విశ్వాస పరీక్ష జరిగితే.. ఆ మొత్తం కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలి. 

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధక జాగ్రత్తలు తీసుకోవాలి’అని ఉంది. అయితే, అసెంబ్లీ భేటీ సందర్భంగా విశ్వాస పరీక్ష నిర్వహిస్తామని గవర్నర్‌కు పంపిన నోటీసులో ప్రభుత్వం పేర్కొనకపోవడం గమనార్హం. ‘సామాజిక, ఆర్థిక అంశాలపై ఆన్‌లైన్‌లోనూ చర్చ జరపవచ్చు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు, హైకోర్టులు కేసుల విచారణను ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తున్నాయి’అని గవర్నర్‌ సూచించారు. భౌతిక దూరం పాటిస్తూ 200 మంది ఎమ్మెల్యేలు,  వెయ్యి మంది సిబ్బంది కూర్చునే వీలు  శాసన సభలో లేదని గవర్నర్‌ వ్యాఖ్యానించారు.  

రాష్ట్రపతికి సీఎల్పీ లేఖ
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు రాజస్తాన్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు లేఖ రాశారు. ఎమ్మెల్యేలను డబ్బుతో ప్రలోభపర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని  వివరించారు.  రాష్ట్రపతి జోక్యం చేసుకుని రాజస్తాన్‌ అసెంబ్లీని సమావేశపర్చేలా చూడాలని కోరారు. కేంద్రమంత్రి ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టారనేందుకు ఆధారాలున్నా, కేబినెట్‌ నుంచి తొలగించకపోవడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని పేర్కొన్నారు. కాగా, సచిన్‌ పైలట్‌ నాయకత్వంలోని  రెబల్‌ ఎమ్మెల్యేల అనర్హతపై జులై 24 వరకు చర్యలు తీసుకోవద్దని రాజస్తాన్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను రాజస్తాన్‌ స్పీకర్‌ సీపీ జోషి సోమవారం వెనక్కు తీసుకున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణులు గవర్నర్‌ల అధికార నివాసాలైన రాజ్‌భవన్‌ల వద్ద సోమవారం నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

మోదీకి గహ్లోత్‌ ఫోన్‌
రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ వివరించారు. ప్రస్తుత రాజకీయ సంక్షోభం, అసెంబ్లీని సమావేశపర్చాల్సిన అవసరం, కరోనా విపత్తు తదితర అంశాలను ప్రధానికి చేసిన ఫోన్‌ కాల్‌లో సీఎం గహ్లోత్‌ వివరించినట్లు సమాచారం. కొన్ని రోజుల క్రితం సీఎం గహ్లోత్‌ ప్రధాని మోదీకి ఇవే వివరాలతో ఒక లేఖ కూడా రాశారు.  

మరిన్ని వార్తలు