జీవితంలో మూడేళ్లు వృథా

20 May, 2022 06:30 IST|Sakshi

మరో పార్టీలో చేరికపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు

గుజరాత్‌ పటీదార్‌ ఉద్యమ నేత హార్దిక్‌ పటేల్‌

అహ్మదాబాద్‌: కాంగ్రెస్‌లో ఉండి తన జీవితంలో మూడేళ్లు వృథా చేసుకున్నానని గుజరాత్‌ పటీదార్‌ ఉద్యమనేత హార్దిక్‌ పటేల్‌ వాపోయారు. ఆయన బుధవారం కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ కుల రాజకీయాలు చేస్తోందని హార్దిక్‌ మండిపడ్డారు. గురువారం అహ్మదాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. గుజరాత్‌లో అధికార బీజేపీ లేదా ఆమ్‌ ఆద్మీ పార్టీ లేదా మరో రాజకీయ పార్టీలో చేరికపై నిర్ణయం తీసుకోలేదనన్నారు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల ప్రయోజనాల కోసమేనని పేర్కొన్నారు. ఆయోధ్యలో రామమందిర నిర్మాణం, జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు వంటి ఘనతలు బీజేపీ సాధించిందంటూ ప్రశంసల వర్షం కురిపించారు.  కాంగ్రెస్‌లో ముందుచూపు లేని నేతలు ఉన్నారని, గుజరాత్‌ ప్రజలపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్‌ సిద్ధాంతం.. వాడుకో, వదిలించుకో
గుజరాత్‌లో తనను కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమించినప్పటికీ ఏనాడూ సరైన పని అప్పగించలేదని, గౌరవం కల్పించలేదని హార్దిక్‌ ఆక్షేపించారు. పటీదార్‌ కోటా ఉద్యమంతో గుజరాత్‌లో 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎంతగానో లాభపడిందన్నారు. అయినప్పటికీ కీలకపార్టీ కార్యక్రమాలకు తనను ఆహ్వానించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గుజరాత్‌ కాంగ్రెస్‌లో 25 ఏళ్లుగా 7–8 మందే పెత్తనం చెలాయిస్తున్నారన్నారు. సెకండ్‌ క్యాడర్‌ నేతలకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నారు. వాడుకో, వదిలించుకో.. ఇదే కాంగ్రెస్‌ సిద్ధాంతమని దుయ్యబట్టారు.  కాంగ్రెస్‌కు ఇప్పుడు కావాల్సింది చింతన్‌(మేధోమథనం) కాదు, చింత అని హార్దిక్‌ పటేల్‌ వ్యాఖ్యానించారు.

హార్దిక్‌ పటేల్‌కు జైలు భయం: కాంగ్రెస్‌
హార్దిక్‌ వ్యాఖ్యలను గుజరాత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు జగదీష్‌ ఠాకూర్‌ తిప్పికొట్టారు. బీజేపీ  స్క్రిప్ట్‌ ప్రకారమే రాజీనామా పత్రం తయారు చేసుకున్నాడని విమర్శించారు. అతడిపై దేశద్రోహం కేసు నమోదయ్యిందని గుర్తుచేశారు. జైలుకు వెళ్లాల్సి వస్తుందన్న భయంతోనే కాంగ్రెస్‌ను వీడాడన్నారు.

మరిన్ని వార్తలు