వరుస ఎదురు దెబ్బలు: ఎన్డీయే విచ్ఛిన్నం..!

27 Sep, 2020 13:39 IST|Sakshi

  ఎన్డీయే నుంచి అకాలీదళ్‌ ఔట్‌

సాక్షి, ముంబై : బీజేపీ నేతృత్వంలోని నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయెన్స్‌ (ఎన్డీయే) కూటమి నుంచి ఒక్కో పార్టీ జారుకుంటోంది. మొదటి నుంచి బీజేపీతో జట్టు కట్టిన తెలుగుదేశం పార్టీ గత సార్వత్రిక ఎన్నికల కంటే ముందే వైదొలగగా.. ఆ పార్టీ దారిలోనే మరికొన్ని పార్టీలు సైతం నడుస్తున్నాయి. ఎన్డీయే కూటమిలో అత్యంత పెద్దపార్టీగా ఉన్న శివసేన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో గుడ్‌బై చెప్పింది. ఫలితాల అనంతరం ఇరు పార్టీల మధ్య ఏర్పడిన మనస్పర్ధాలు కూటమి నుంచి వైదొలిగి వేరు కుంపటి పెట్టుకునే వరకు సాగాయి. అనంతరం కాంగ్రెస్‌, ఎన్సీపీతో శివసేన జట్టుకట్టడంతో పార్లమెంట్‌లో ఎన్డీయేకు కొంతలోటు ఏర్పడింది. ఇది జరిగిన కొద్ది నెలల్లోనే బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. దాదాపు 40 ఏళ్ల పాటు బీజేపీతో స్నేహంగా మెలిగిన శిరోమణీ అకాలీదళ్‌ తాజాగా ఎన్డీయే కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. (ఎన్డీయేకు గుడ్‌బై చెప్పిన మిత్రపక్షం)

కేంద్ర ప్రభుత్వం గతవారం​ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు నిరసనగా తొలుత కేంద్రమంత్రికి పదవికి రాజీనామా చేసిన ఆపార్టీ ఎంపీ హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌.. పార్లమెంట్‌లో బిల్లులకు వ్యతిరేకంగా నిరసన స్వరం వినిపించారు. అనంతరం ఎన్డీయే కూటమి నుంచి శాస్వతంగా తప్పుకుంటున్నట్లు శనివారం ప్రకటించి.. చిరకాల స్నేహానికి ముగింపు పలికారు. ఎన్డీయే కూటమిలో కీలకమైన అకాలీదళ్‌ తప్పుకోవడం బీజేపీకి ఊహించని ఎదురుదెబ్బగానే భావించవచ్చు. (భార్య రాజీనామా వెనుక భర్త వ్యూహం..!)

మరోవైపు కీలకమైన పంజాబ్‌ అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ పరిణామం చోటుచేసుకోవడం కాషాయ దళానికి ఊహించని షాకే. ఇలాంటి తాజా పరిస్థితులపై శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ స్పందించారు. శివసేనతో పాటు, శిరోమణీ అకాలీదళ్‌ వైదొలగడంతో ఎన్డీయే విచ్ఛిన్నమైందని, తాము ఇరువురం లేని కూటమి ఎన్డీయే కానేకాదని స్పష్టం చేశారు. కూటమిలోని  భాగస్వామ్య పార్టీలన్నీ ఎన్డీయే నుంచి తప్పుకుంటున్నాయని గుర్తుచేశారు. అయితే తమ స్థానంలో వచ్చే కొత్త స్నేహితులు కూడా ఎంతకాలం ఉంటారో చెప్పలేమని రౌత్‌ వ్యాఖ్యానించారు. (ప్రశాంత్‌ కిషోర్‌తో మరో సీఎం ఒప్పందం..!)

మరిన్ని వార్తలు