ఈటల, వెంకట్‌ తరఫున నామినేషన్లు 

8 Oct, 2021 02:10 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌/ యాదగిరిగుట్ట: హుజూరాబాద్‌ బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులు ఈటల రాజేందర్, బల్మూరి వెంకట్‌ల తరఫున గురువారం నామినేషన్లు దాఖలయ్యాయి. వెంకట్‌ తరఫున హుజూరాబాద్‌ మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు కొల్లూరి కిరణ్‌కుమార్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ఆ పత్రాల్లో తనతో పాటు తల్లి ఆస్తుల వివరాలు కూడా వెంకట్‌ పేర్కొన్నారు. ఇటీవల కాంగ్రెస్‌ నిర్వహించిన విద్యార్థి–నిరుద్యోగ జంగ్‌ సందర్భంగా వెంకట్‌ గాయపడిన విషయం తెలిసిందే.

కాగా శుక్రవారం టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డితో కలిసి వెంకట్‌ స్వయంగా నామినేషన్‌ వేయనున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇలావుండగా వెంకట్‌ గురువారం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. యాదాద్రీశుడి ఆశీస్సులతో హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో విజయ ఢంకా మోగిస్తామని ఆయన ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.  

ఈటల తరఫున నామినేషన్‌ 
బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ నామినేషన్‌ పత్రాలను ఆయన సోదరుడు ఈటల భద్రయ్య దాఖలు చేశారు. ఈటల జమున నామినేషన్‌ను కంకణాల సుదర్శన్‌రెడ్డి దాఖలు చేశారు. కాగా శుక్రవారం ఈటల స్వయంగా మరోసారి నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు గురువారం ఒక్కరోజే అత్యధికంగా 11 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో మొత్తం నామినేషన్ల సంఖ్య 24కు చేరింది.   

మరిన్ని వార్తలు