KTR: కేసీఆర్‌ను తిడితే పెద్ద లీడర్లు అయిపోరు

17 Jun, 2021 02:12 IST|Sakshi
రెండు పడక గదుల ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌

సోషల్‌ మీడియాలో విమర్శలపై మంత్రి కేటీఆర్‌ మండిపాటు

అర్హులందరికీ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు వస్తాయని హామీ

రాష్ట్రంలో 1.67 లక్షల బెడ్‌రూమ్‌ ఇళ్లు పూర్తి: మంత్రి ప్రశాంత్‌రెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రుల పర్యటన

సిరిసిల్ల: తెలంగాణను అత్యంత ప్రేమించే సీఎం కేసీఆర్‌ను తిట్టినంత మాత్రాన పెద్ద లీడర్లు అయిపోరని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. నోరుందని కొందరు సీఎం కేసీఆర్‌ను తిడుతూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, అలా తిట్టే పిచ్చివాళ్లకు మీరే గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను కేసీఆర్‌ తెలంగాణలో అమలు చేస్తున్నారన్నారు. కేటీఆర్‌ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాకలో ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డితో కలిసి రైతువేదికను బుధవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. కరోనా సంక్షోభ సమయంలోనూ ఎక్కడా సంక్షేమం ఆగలేదని చెప్పారు. రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని కొన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టంచేశారు. ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్, కోనసీమను దాటి నంబర్‌ వన్‌ స్థానానికి చేరుకున్నామని.. ఇది సీఎం కేసీఆర్‌ సాధించిన ఘనత కాదా అని కేటీఆర్‌ అన్నారు. సమైక్యాంధ్ర పాలనకు, తెలంగాణ స్వరాష్ట్ర పాలనకు కొదురుపాక పాత బ్రిడ్జి.. కొత్త బ్రిడ్జి సాక్ష్యాలని పేర్కొన్నారు. కొదురుపాకలో తన అమ్మమ్మ, తాతయ్య జోగినిపల్లి లక్ష్మి, కేశవరావు జ్ఞాపకార్థం సొంత డబ్బులతో కేటీఆర్‌ రైతువేదికను నిర్మించారు. అమ్మమ్మ ఊరు కొదురుపాకతో ఉన్న చిన్ననాటి జ్ఞాపకాలను కేటీఆర్‌ గుర్తు చేసుకున్నారు.

పేదల ముఖాల్లో చిరునవ్వు చూడాలనే..
రాష్ట్రంలోని అర్హులందరికీ వెనకా ముందు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు వస్తాయని మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు. జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్, గొల్లపల్లి, ఎల్లారెడ్డిపేటల్లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను మంత్రులు ప్రారంభించి మాట్లాడారు. ఇప్పుడు ఇళ్లు రానివారు నారాజు కావద్దని, భవిష్యత్‌లో తప్పకుండా వస్తాయన్నారు. సీఎం కేసీఆర్‌ పేదల ముఖాల్లో చిరునవ్వు చూడాలనే సంకల్పంతోనే ఈ పథకానికి రూపకల్పన చేశారన్నారు. ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కేటీఆర్‌ దేశంలోనే అత్యుత్తమ మంత్రిగా పేరు సంపాదించారన్నారు. ఆయన చొరవతో ఐటీ పరిశ్రమలు వస్తున్నాయని, 19వేల ఎకరాల్లో, రూ.75వేల కోట్లతో ఫార్మా హబ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీని ద్వారా రాష్ట్రంలో 5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.

ఎల్లారెడ్డిపేటలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలతో పాటు, కొత్తబట్టలు అందించారు. వారితో కలిసి మంత్రులు సహపంక్తి భోజనాలు చేశారు. ఎల్లారెడ్డిపేట మండలంలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, సిరిసిల్లలో తెలంగాణ డయాగ్నస్టిక్‌ సెంటర్, కొదురుపాకలో రైతు వేదిక, విలాసాగర్‌లో ఎత్తిపోతల పథకాన్ని మంత్రులు ప్రారంభించారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జెడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, కలెక్టర్‌ కృష్ణభాస్కర్, ఎస్పీ రాహుల్‌హెగ్డే పాల్గొన్నారు.

గల్ఫ్‌ బందీల విడుదలకు భరోసా
సిరిసిల్ల శివారులోని పెద్దూరుకు చెందిన శివరాత్రి రవి, మల్లేశం, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన మరో ముగ్గురు 15 ఏళ్లుగా దుబాయ్‌ జైల్లో బందీలుగా ఉన్నారు. వీరి కుటుంబ సభ్యులు మంత్రి కేటీఆర్‌ను కలిసి కన్నీరు పెట్టుకున్నారు. ఆ బందీల విడుదలకు కేటీఆర్‌ భరోసా ఇచ్చారు. గతంలో వీరి విడుదల కోసం రూ.15 లక్షలు చెల్లించామని, దౌత్యపరమైన చర్చల ద్వారా వారి విడుదలకు కృషిచేస్తామని కేటీఆర్‌ చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్‌ ఉందా? రైతుబంధు ఇచ్చే సంస్కారం ఉందా? రైతుబీమా కల్పించే ఆలోచన ఉందా..? ఆడపిల్ల పెళ్లికి కల్యాణలక్ష్మి ఇస్తున్నారా..?  రైతు వేదికలు ఉన్నాయా? అని ప్రతిపక్షాలను కేటీఆర్‌ ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు