ప్రభుత్వంపై నితిన్‌ గడ్కరీ వ్యాఖ్యలు.. మరోసారి దుమారం!

24 Aug, 2022 13:43 IST|Sakshi

ముంబై: బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తాజా వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. కీలకమైన పార్లమెంటరీ కమిటీ నుంచి ఆయన్ని తప్పించిన దరిమిలా.. రాజకీయ వర్గాల్లో విస్తృతస్థాయి చర్చ నడిచిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వం సకాలంలో నిర్ణయాలు తీసుకోవట్లేదని, అదో పెద్ద సమస్యగా మారిందని గడ్కరీ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు విశ్లేషణ మొదలైంది.

ఆదివారం సాయంత్రం ముంబైలో నాట్కోన్‌ 2022 ఈవెంట్‌కు హాజరైన కేంద్రమంత్రి గడ్కరీ మాట్లాడుతూ.. భారత మౌలిక సదుపాయాల భవిష్యత్తు చాలా ప్రకాశవంతమైందని పేర్కొన్నారు. అద్భుతాలు చేయొచ్చు. ఆ సామర్థ్యం భారత్‌కు ఉంది. అందుకు మంచి సాంకేతికతను అంగీకరించాల్సి ఉంటుంది. ఖర్చు తగ్గించుకోవడానికి ప్రత్యామ్నాయాలను పాటించాల్సి ఉంటుందని పేర్కొన్నారు ఆయన. అయితే..

నిర్మాణంలో అత్యంత ముఖ్యమైన విషయం.. సమయం. టైం అనేది అతిపెద్ద పెట్టుబడి. కానీ, మన ప్రభుత్వం సకాలంలో నిర్ణయాలు తీసుకోకపోవడమే పెద్ద సమస్యగా మారింది అని వ్యాఖ్యానించారాయన. కీలక నిర్ణయాల విషయంలో ప్రభుత్వం తీరు మారకపోతే.. ఎన్ని ప్రకటనలు చేసుకున్నా వ్యర్థమేనని, అభివృద్ది ముందుకెళ్లదని వ్యాఖ్యానించారాయన. దీంతో సొంత పార్టీని టార్గెట్‌ చేసే ఆయన అలా అని ఉంటారన్న చర్చ బీజేపీలో నడుస్తోంది. మరోవైపు ఆయన వ్యాఖ్యలు సాధారణమైనవేనని మరికొందరు అంటున్నారు.

మోదీ వ్యాఖ్యల అనంతరం.. 
తన పాలనను స్వర్ణ యుగంగా అభివర్ణించుకున్న ప్రధాని మోదీ.. ఎన్నో మైలు రాళ్లను దాటిందంటూ పొగడ్తలు గుప్పించుకున్నారు. అయితే ఈ వ్యాఖ్యల తర్వాత నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో నితిన్‌ గడ్కరీ మాట్లాడుతూ.. గతంతో పోలిస్తే ఇప్పటి రాజకీయాల తీరు మారిందని, వాటిని చూస్తుంటే కొన్ని సమయాల్లో రాజకీయాలను వదిలేయాలని ఉందని వ్యాఖ్యానించారాయన. అయితే ఆ వ్యాఖ్యలు దుమారం రేపడంతో కొన్నిగంటలకే ఆయన తన ప్రకటనను సవరిస్తూ మరోసారి మాట్లాడారు. కానీ, ఆ వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగానే మారాయి. 

బిజేపీ అధికారంలోకి రావడానికి, చాలా రాష్ట్రంలో అధికారంలో ఉండడానికి, రాజకీయాల్లో ఈ స్థానంలో ఉండడానికి వాజ్‌పేయి, అద్వానీ, దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ లాంటి వాళ్ల కృషి ఉందని పేర్కొన్నారాయన. అంతేకాదు.. 1980లో వాజ్‌పేయి చేసిన ప్రసంగాన్ని ఉటంకిస్తూ (చీకట్లు తొలగిపోయి.. సూర్యుడు ఉదయిస్తాడు. కమలం విరబూస్తుందన్న వ్యాఖ్యలను) గడ్కరీ ప్రస్తావించారు. గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేసిన కొన్నాళ్లకే.. కీలకమైన బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి  ఆయన్ని తప్పించడం కొసమెరుపు. 

ఆరెస్సెస్‌ మూలాలున్న ఈ మహారాష్ట్ర నేత.. గతంలో బీజేపీ చీఫ్‌గానూ వ్యవహరించారు. ఢిల్లీ కంటే సొంత నియోజకవర్గంలోనే ఎక్కువగా గడిపే గడ్కరీ అంటే.. జనాదరణతో పాటు పార్టీలకతీతంగా నేతల అభిమానం సైతం ఉండడం గమనార్హం.

ఇదీ చదవండి: గడ్కరీ ప్రత్యర్థికి బీజేపీ ఎందుకు ఛాన్స్‌ ఇచ్చింది?

మరిన్ని వార్తలు