ఫిబ్రవరి 11న జీహెచ్‌ఎంసీ మేయర్‌ ఎన్నిక

23 Jan, 2021 19:18 IST|Sakshi

అదేరోజు తొలుత కార్పొరేటర్ల ప్రమాణం 

ఆపై మేయర్, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక 

నోటిఫికేషన్‌ జారీచేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్‌

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) మేయర్‌ ఎన్నిక ఫిబ్రవరి 11న జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం నోటిఫికేషన్‌ను జారీచేసింది. వచ్చేనెల 11వ తేదీన ఉదయం 11 గంటలకు కొత్తగా ఎన్నికైన జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లతో ప్రిసైడింగ్‌ అధికారి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు నిర్వహించే ప్రత్యేక సమావేశంలో ముందుగా మేయర్‌ ఎన్నిక జరుగుతుంది. ఆ తర్వాత డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకుంటారు. ఏవైనా అనివార్య కారణాల వల్ల 11న ఈ ఎన్నిక నిర్వహించలేని పక్షంలో మరుసటి రోజు 12న (ఒకవేళ సెలవు రోజు అయినప్పటికీ) ఈ ఎన్నిక నిర్వహిస్తారు.

ఈ మేరకు జీహెచ్‌ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్‌ పరోక్ష ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌తో పాటు దీనికి సంబంధించిన విధానపరమైన సూచనలను విడుదల చేసినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి.పార్థసారథి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తగా ఎన్నికైన 150 మంది కార్పొరేటర్లతో పాటు గ్రేటర్‌లో ఎక్స్‌అఫీషియో సభ్యులుగా నమోదైన లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా సమావేశానికి సంబంధించిన సమాచారాన్ని 6వ తేదీకల్లా తెలియజేస్తారు.  గత ఏడాది డిసెంబరు ఒకటో తేదీన జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 56, బీజేపీ 48, ఎంఐఎం 44, కాంగ్రెస్‌ 2 స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈసారి మేయర్‌ స్థానం జనరల్‌ మహిళకు రిజర్వు అయింది.    

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు