నూపుర్‌ వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు సీరియస్‌.. కాంగ్రెస్‌ స్పందన.. ‘సిగ్గుతో ఉరేసుకోవాలి’

1 Jul, 2022 20:03 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ బహిష్కృత నేత నూపుర్‌ శర్మపై సుప్రీం కోర్టు సీరియస్‌ అయిన నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ స్పందించింది. ఇంతటి అవమానకర పరిస్థితుల్లో కాషాయ పార్టీ సిగ్గుతో ఉరేసుకోవాలని వ్యాఖ్యానించింది. ఈమేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ జైరాం రమేశ్‌ ట్విటర్‌ వేదికగా శుక్రవారం  ఒక ప్రకటన విడుదల చేశారు.

‘మహ్మద్‌ ప్రవక్తపై వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలు చెలరేగడానికి నూపుర్‌ శర్మ వ్యాఖ్యలే కారణమని సుప్రీం చెప్పడం సరైంది. జరిగిన ఘటనలకు ఆమెదే పూర్తి బాధ్యత అని, జాతి మొత్తానికి క్షమాపణలు చెప్పాలని చెప్పడం ఆహ్వానించదగ్గది. అధికారం ఉందని విర్రవీగేవారికి సుప్రీం వ్యాఖ్యలు చెంపపెట్టు లాంటివి’ అని కాంగ్రెస్‌ పేర్కొంది.
చదవండి👉సోమవారమే ఏక్‌నాథ్‌ షిండే ప్రభుత్వానికి బల పరీక్ష

‘ఇందులో రహస్యమేమీ లేదు.. మత విద్వేషాలను రెచ్చగొట్టి కమళం పార్టీ లబ్ది పొందాలనుకుంటోంది. విధ్వంసపు విభజన భావజాలాలపై పోరాడే ప్రతి ఒక్కరికి సుప్రీం కోర్టు వ్యాఖ్యలు బలాన్నిచ్చాయి’ అని జైరాం రమేశ్‌ పేర్కొన్నారు. రాజకీయంగా ప్రయోజనం పొందేందుకు ఎత్తుగడలు వేసే జాతీ విద్రోహ శక్తులపై పోరాటాన్ని కాంగ్రెస్‌ ఎప్పటికీ ఆపదని తేల్చి చెప్పారు. అలాంటివారి వికృత చర్యలను భరత జాతి ప్రజలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. 

కాగా, మహ్మద్‌ ప్రవక్తపై నూపుర్‌ శర్మ వ్యాఖ్యల నేపథ్యంలో ఇంటా బయటా బీజేపీపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. అయితే, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని చెప్తూ నూపుర్‌ క్షమాపణలు కూడా చెప్పారు. కానీ, తదనంతరం కూడా పలు చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈక్రమంలోనే దేశ అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం కీలక వా​ఖ్యలు చేసింది.
చదవండి👉కర్మ అనుభవించక తప్పదు.. ఉద్ధవ్‌ రాజీనామాపై రాజ్‌ఠాక్రే స్పందన

మరిన్ని వార్తలు