సర్వజ్ఞాని కోసమే వేడుకలు ఎత్తేశారు

14 Aug, 2022 06:33 IST|Sakshi

పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో ప్రత్యేక కార్యక్రమాల రద్దుపై కాంగ్రెస్‌

న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం రోజున పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో తప్పక నిర్వహించాల్సిన ప్రత్యేక కార్యక్రమాలను మోదీ సర్కార్‌ ఉద్దేశ్యపూర్వకంగా రద్దుచేస్తోందని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. ‘సెంట్రల్‌ హాల్‌ వేడుకలు అంతర్థానమవుతున్నాయి. సర్వజ్ఞాని కీర్తి ప్రతిష్టలు పెంచడం పైనే దృష్టిపెట్టారు. ఇదంతా ఆ సర్వజ్ఞాని పుణ్యమే’ అంటూ ప్రధాని మోదీని పరోక్షంగా ఉద్దేశిస్తూ కాంగ్రెస్‌ పార్టీ విమర్శలు గుప్పించింది. ‘గతంలో 25వ స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు సెంట్రల్‌ హాల్‌లో ప్రత్యేకంగా జరిగాయి. అలాగే 50వ, 60వ వేడుకలూ కొనసాగాయి. దురదృష్టంకొద్దీ ఈ సారి బీజేపీ సర్కార్‌ 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను హాల్‌లో రద్దుచేసింది. సర్వజ్ఞానికే పేరొచ్చేలా వ్యవహరిస్తోంది. ఆ జ్ఞాని ఎవరో అందరికీ తెలుసు’ అంటూ కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ వ్యాఖ్యానించారు. స్వాతంత్య్ర వేడుకల నిర్వహణ విధానంపై కాంగ్రెస్, బీజేపీ పరస్పర విమర్శలు చేసుకోవడం కొనసాగుతోంది.

చీకటి కోణాన్ని దాచేందుకే.. : అఖిలేశ్‌
బీజేపీ తనలోని చీకటి కోణాన్ని కప్పిపుచ్చేందుకే ఇలా హర్‌ ఘర్‌ తిరంగా అని నినదిస్తోందని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ ఆరోపించారు. ‘ స్వాతంత్య్రం సిద్ధించాకా జాతీయ జెండాను, భారత రాజ్యాంగాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) అంగీకరించలేదు. బ్రిటిష్‌వారికి అనుకూలంగా వ్యవహరించారు. అలాంటి ఆర్‌ఎస్‌ఎస్‌–బీజేపీ తమ చరిత్రలోని చీకటి అధ్యాయాలను వెనుక వైపు దాచేస్తూ ముందువైపు త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శిస్తున్నాయి’ అని అఖిలేశ్‌ అన్నారు.

మరిన్ని వార్తలు