‘బీజేపీకి ఒమర్‌ అబ్దుల్లా సవాల్‌.. ఎన్నికలు నిర్వహించండి’

25 Feb, 2024 14:47 IST|Sakshi

ముంబై: జమ్మూ కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా బీజేపీపై మండిపడ్డారు. బీజేపీ జమ్ము కశ్మీర్‌లో అభివృద్ధి, శాంతి స్థాపనకు కృషి చేశామని చెప్పుకోవటాన్ని తప్పుపట్టారు. ముంబైలో 'ఐడియాస్ ఆఫ్ ఇండియా' సమ్మిట్‌లో ఒమర్‌ అబ్దుల్లా పాల్గొని మట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘంతో కాకుండా సుప్రీం కోర్టుతో జమ్ము కశ్మీర్‌ ఎన్నికల నిర్వహిస్తామని చెప్పించటం బీజేపీకి సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. తమ పార్టీ జమ్ము కశ్మీర్‌ నేషనల్‌ కాన్ఫరెన్స్‌.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

‘2019 తర్వాత ఐదేళ్లు గడుస్తోంది. ఇప్పటికీ జమ్ము కశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించకపోవటం సిగ్గుచేటు.  2024లో జమ్ము కశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించాలి. మేము బీజేపీతో పోరాడుతాం. జమ్ము కశ్మీర్‌ ప్రజలు హక్కులు, భూములు, 2019లో దెబ్బతిన్న కశ్మీర్‌ను మరల  యథాస్థానానికి తీసుకురావటానికి పోరాడుతాం’ అని అన్నారు. ‘ఈ ప్రభుత్వం సామాన్య ప్రజలకు చేరువలో లేదు. మేము 2014 నుంచి ఎ‍న్నికలు చూడలేదు. 2019 తర్వాత కశ్మీర్‌ ప్రజల్లో శాంతి స్థాపన జరిగే మరి ఎందుకు ఎన్నికలు నిర్వహించరు?. 2024లో ఎన్నికలు నిర్వహించాలని సవాల్‌ చేస్తున్నా’ అని ఒమర్‌ అబ్దుల్లా మండిపడ్డారు.

ఇక.. ఇప్పటికే ఇండియా కూటమిలో పొత్తులేకుండా తమ జమ్ము కశ్మీర్‌ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ లోక్‌సభ ఎన్నికలో ఒంటరిగా పోటీ చేస్తుందని ఫరూక్‌ అబ్దుల్లా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్‌ సీట్ల కేటాయింపుల విషయంలో 3-3 ఫార్ములతో నేషనల్‌ కాన్ఫరెన్స్‌తో  ఒప్పించేందుకు కసరత్తు చేస్తోంది.

whatsapp channel

మరిన్ని వార్తలు