మంత్రి ఈటలకు ఏమైంది? మరోసారి ‘అసంతృప్తి’ వ్యాఖ్యలు

20 Apr, 2021 03:11 IST|Sakshi

నమ్మకం పోతోంది..

రాజకీయాలపై మంత్రి ఈటల వ్యాఖ్య

నాయకులపై ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారు

గతంలో అపారమైన గౌరవం, విలువలు ఉండేవి

ఇప్పుడు అలాంటి పరిస్థితులు నెలకొనేలా ప్రజలను నడిపించాలి

మాటలు చెబుతూ కాలం గడిపితే ప్రజలు ఆదరించరు

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: కొంతకాలంగా నర్మగర్భ వ్యాఖ్యలతో ఈటెలు సంధిస్తున్న రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సోమవారం వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో జరిగిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశంలోనూ అలాగే మాట్లాడారు. రాజకీయాలపై, నాయకులపై ప్రజలకు రాను రాను నమ్మకం పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు ప్రజలకు అపారమైన విశ్వాసం ఉండేదని, ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మీకు తెలుసునని, చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. హన్మకొండ భీమారంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో సోమవారం గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ ఎన్నికల సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడారు.

బీజేపీ మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తోంది
‘టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలకు నోట్లో నాలికగా ఉంటుంది. కానీ భారతీయ జనతా పార్టీ ఉంది.. అది సోషల్‌ మీడియాలో మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తోంది. గతంలో రాజకీయాలు, నాయకులు అంటే సమాజంలో ఒక గొప్ప గౌరవం, విలువలు, విశ్వాసం ఉండేవి. కానీ రానురాను నాయకుల మీద, రాజకీయాల మీద ఎట్లాంటి భావన వస్తుందో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మంచి సంప్రదాయమైతే కాదు. తాత్కాలికమైన విజయాల కోసం, తాత్కాలికమైనటువంటి ప్రయోజనాల కోసం సంప్రదాయాలను, మర్యాదలను, గౌరవాలను ఫణంగా పెట్టే పరిస్థితి రావద్దని కడియం శ్రీహరి గారి లాంటి వాళ్లు ఎక్కువగా కోరుకుంటారు. నాలాంటి వాళ్లు కూడా ఇవ్వాల అదే కోరుకుంటున్నారు’ అని ఈటల అన్నారు.

పెరుగుట విరుగుట కోసమే..
‘వాస్తవానికి రాజకీయ నాయకులెప్పుడు కూడా సమాజ శ్రేయస్సు కోసం పని జేసే వాళ్లు తప్ప, ఇబ్బంది పెట్టడం కోసమో, సొంత ప్రయోజనాల కోసమో ఆశించేవాళ్లు కాదు. కానీ అట్లా చిత్రీకరించేటటువంటి పరిస్థితి వచ్చింది. మానవ సంబంధాల్లోనే కాకుండా, రాజకీయ నాయకులు.. ప్రజల మధ్య ఉండే సంబంధాల్లో చోటుచేసుకుంటున్న బాధాకరమైన సన్నివేశాల్ని ఇవ్వాళ మనం చూస్తున్నం. కాబట్టి ఏదో ఒకనాడు పెరుగుట విరుగుట కోసమే అన్నట్టుగా ఇట్లాటివన్నీ పెరుగుతయ్‌.. మళ్లీ ఎక్కడో తప్పకుండా విరుగుతయ్‌ అనే నమ్మకం నాకుంది. అంతిమంగా రాజకీయాలు, రాజకీయ నాయకుల పట్ల గౌరవం ఇనుమడింపజేసేలా ప్రజలను మనం డ్రైవ్‌ చేయాలి..’ అని మంత్రి పేర్కొన్నారు.

అతి తక్కువ కాలంలో ఎక్కువ ఫలితాలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలోని ఆనేక రంగాల్లో ఏ రాష్ట్రం కూడా పోటీపడని విధంగా, అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ ఫలితాలు కనిపిస్తున్నాయని ఈటల తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్‌ నాయకత్వంలోని టీఆర్‌ఎస్‌ చరిత్రకెక్కాయని అన్నారు. మాటలు చెబుతూ, కాలం గడిపితే ప్రజలు ఆదరించరని, గతమేందో, ఇవ్వాలేందో తర్కించుకుని, బేరీజు వేసుకుని ప్రజలు మనల్ని ఆదరిస్తున్నారని చెప్పారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా మారేవాడే రాజకీయ నాయకుడని, అదే తరహాలో వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌ నడుస్తున్నారని అన్నారు.

చదవండి: బ్లాక్‌లో వ్యాక్సిన్‌ దందా.. రూ.800 మందు రూ.14 వేలకు
చదవండి: మున్సి‘పోరు’: టీఆర్‌ఎస్‌ సరికొత్త రాజకీయం

>
మరిన్ని వార్తలు