గ్రేటర్‌ ప్రచారం: ట్రంప్‌ ఒక్కరే మిగిలిపోయారు

29 Nov, 2020 11:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గ్రేటర్‌లో ప్రచార పర్వం తారాస్థాయికి చేరిపోయింది. ప్రచారానికి మరికొద్ది గంటలు మాత్రమే సమయం మిగిలి ఉండటంతో నేతలు మరింత జోరుపెంచారు. నగరంలోని గల్లీలన్నీ తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటల లోపు ప్రచారాన్ని ముగించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇవ్వడంతో.. చివరి అస్త్రాలను సందిస్తున్నారు. విజయమే లక్ష్యంగా వ్యూహాలకు పదునుపెడుతూ తుది దశ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఓ వైపు టీఆర్‌ఎస్‌కు చెందిన జిల్లా నేతలంతా భాగ్యనగరంలో వాలిపోతే బీజేపీ ఏకంగా ఢిల్లీ ఇతర రాష్ట్రాల నుంచి నేతలను బరిలోకి దించింది. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌తో పాటు పలువురు కేంద్రమంత్రులు ఇదివరకే హైదరాబాద్‌లో పర్యటించారు. ఇక ప్రచార చివరి రోజైన ఆదివారం నాడు కేంద్ర హోమంత్రి అమిత్‌ షా నగరంలో పర్యటించనున్నారు. బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. దీంతో రాజధానిలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. (మతిలేని మాటలతో విద్వేషమా?)

బీజేపీ జాతీయ నేతల పర్యటన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై గతంలో ఎన్నడూ లేనంత చర్చసాగుతోంది. గల్లీ ఎన్నికలకు ఢిల్లీ నేతలు ప్రచారం చేయడం హాస్యాస్పదంగా ఉందని సీఎం కేసీఆర్‌తో పాటు టీఆర్‌ఎస్‌ నేతలు సైతం ఎద్దేవా చేశారు. మరోవైపు అమిత్‌ షా పర్యటనపై హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ వ్యంగ్ర్యాస్త్రాలు సంధించారు. ‘గ్రేటర్‌ ఎన్నికలకు కూడా బీజేపీ ఎన్నికల కేంద్రమంత్రులను, జాతీయ నాయకులు తీసుకుని వస్తున్నారు. ఓ చిన్న పిల్లవాడు నాతో మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఒక్కరే మిగిలిపోయారు అని అన్నారు. నిజమే అందుబాటులో ఉంటే ట్రంప్‌ చేత కూడా బీజేపీ నేతలు ప్రచారం చేయించేవారేమో’ అంటూ ఒవైసీ వ్యంగ్యంగా అన్నారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు