10 మంది ఆప్ ఎమ్మెల్యేలకు బీజేపీ ఫోన్.. ప్రభుత్వాన్ని కూల్చేందుకు కోట్లు

14 Sep, 2022 15:20 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: గోవాలో 8 మంది కాంగ్రెస్‌ ఎ‍మ్మెల్యేలు బీజేపీలో చేరిన రోజే సంచలన ఆరోపణలు చేశారు ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్. పంజాబ్‌లోనూ 'ఆపరేషన్ లోటస్‌' ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. తమ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు బీజేపీ సంప్రదింపులు జరిపిందని బుధవారం తెలిపారు.

దేశవ్యాప్తంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాలను కూల్చేందుకు బీజేపీ కోట్ల రూపాయలు వెచ్చిస్తోందని కేజ్రీవాల్ ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదన్నారు. బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా పంజాబ్, ఢిల్లీలో ఆపరేషన్ లోటస్ విజయవంతం కాదని కేజ్రీవాల్ తేల్చిచెప్పారు.

బీజేపీ సంప్రదింపులు జరిపిన ఆప్ ఎమ్మెల్యేల పేర్లను పంజాబ్ మంత్రి హర్పాల్ చీమ వెల్లడించారు. దినేష్ చద్దా, రమణ్ అరోడా, బుధ్ రామ్, కుల్వాంత్ పండోరి, నరీందర్ కౌర్ భరాజ్, రాజ్నీశ్ దహియా, రూపిందర్ సింగ్ హప్పీ, శీతల్ అంగురాల్, మంజీత్ సింగ్ బిలాస్‌పుర్, లాభ్ సింగ్ ఉగోకే, బలీందర్ కౌర్‌లకు బీజేపీ ఫోన్ చేసిందని తెలిపారు. ఫోన్‌ కాల్స్ ఆధారంగా ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు.

ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని కేజ్రీవాల్ ఇదివరకే ఆరోపించిన విషయం తెలిసిందే. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.20-25 కోట్ల వరకూ ఇస్తామని కమలం పార్టీ ప్రలోభ పెట్టిందని పేర్కొన్నారు. ఆ వారంలోనే ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి తమ ప్రభుత్వ బలాన్ని నిరూపించుకున్నారు. ఆప్ ఎమ్మెల్యేలు ప్రలోభాలకు లొంగరని, బీజేపీ ప్రయత్నాలు ఫలించవని చెప్పారు.
చదవండి: బీజేపీ ప్లాన్‌ సక్సెస్‌.. గోవాలో కాంగ్రెస్‌ ఖాళీ!

మరిన్ని వార్తలు