పేదల ఇళ్లపై ఇవీ నిజాలు.. బాబూ పవనూ అర్థమవుతుందా?

17 Nov, 2022 16:36 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొన్ని కార్యకమాలు చేపట్టడం ప్రభుత్వానికి మంచిదే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఏ స్కీమ్‌ను విమర్శించడానికి ప్రయత్నిస్తారో దానిపై ఆయనకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆపై, ప్రజలలో ఆ స్కీమ్ గురించి మంచి చర్చ జరగడానికి ఆస్కారం ఏర్పడుతోంది.

పవన్ కల్యాణ్ సినిమా నటుడు కావడం, ఆయన ఎక్కడకు వెళ్లినా కొంతమంది అభిమానులు అక్కడకు వెళ్లడం, ఆయనను తెలుగుదేశం పార్టీ మీడియా భుజాన వేసుకోవడంతో కనీసం ఇప్పుడైనా ఆ స్కీమ్ గురించి ప్రజలకు మరింతగా తెలియచేసే అవకాశం వస్తోంది.
చదవండి: అబద్ధాలపై పేటేంట్‌ చంద్రబాబుకే.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..

పేదలకు ఇళ్లు ఇస్తే అక్కసా?
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పేదలకు 31లక్షల స్థలాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణం సంకల్పించారు. రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే ఎక్కడా ఈ స్థాయిలో పేదలకు స్థలాలు మంజూరు చేయలేదన్నది వాస్తవం. ఆ స్థలాలలో  కేంద్ర ప్రభుత్వం స్కీంను కొంత వాడుకుని, తద్వారా వచ్చే నిధులకు తోడు రాష్ట్ర నిధులను జత చేసి ఇళ్లనిర్మాణం చేపడుతోంది. జగనన్న కాలనీల పేరుతో సాగుతున్న ఈ నిర్మాణాలు ఒకరకంగా చరిత్ర సృష్టిస్తున్నాయని చెప్పాలి.

దీంతో ప్రతిపక్ష తెలుగుదేశంకు, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియాకు తేళ్లు, జెర్రులు పాకుతున్నట్లయింది. ఇది జగన్‌కు మంచి పేరు తెచ్చే స్కీమ్ కావడంతో దానిని ఎలా బదనాం చేయాలా అని ప్లాన్ చేసి రకరకాల ప్రచారాలు చేపట్టారు. ఆవ భూములని, స్కామ్‌లని, వర్షం పడితే నీళ్లు నిలుస్తాయని, కాలనీలపై ఒకటి కాదు.. అనేక రకాలుగా విషం కక్కుతూ తెలుగుదేశం మీడియా వార్తా కథనాలు ఇచ్చింది. టీడీపీ నేతలు పలు ఆరోపణలు చేస్తూ కథ నడిపారు. కాని దానివల్ల తమకు నష్టం కలుగుతుందని భావించారో,లేక మరే కారణమో తెలియదు కానీ, ఇళ్ల స్థలాలపై విమర్శల జోరు తగ్గించినట్లు అనిపించింది.

రెడీ.. కెమెరా.. యాక్షన్
అదే సమయంలో తమకు పరోక్ష మిత్రుడుగా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఆ బాధ్యత అప్పగించినట్లు ఉన్నారు. ఆయన ఒక రకంగా అమాయకుడు, అంత పరిజ్ఞానం కూడా లేని వ్యక్తి కావడంతో, లేచిందే లేడీకి ప్రయాణం అన్నట్లుగా ఈ స్కీమ్  స్థలాలను పరిశీలించేందుకు వెళ్లారు. ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా ఉత్సాహంగా ఆయా కాలనీలలోకి వెళ్లి లబ్ధిదారులను పట్టుకుని ఇంటర్వ్యూలు చేసి విమర్శల వర్షం కురిపించాలని భావించారు. కానీ వారికి విధి వక్రీకరించిందన్నట్లుగా వారు వెళ్లిన ఎక్కువ చోట్ల లబ్ధిదాదారులు నిలదీశారు.

దీనికి సంబంధించి వచ్చిన కథనాలు, ప్రత్యేకించి సోషల్ మీడియాలో వచ్చిన వీడియోలు ఆసక్తి కలిగించాయి. కొందరు మహిళా లబ్దిదారులను జనసేన కార్యకర్తలతో మాట్లాడుతూ, తమకు వస్తున్న సదుపాయాన్ని చెడగొట్టవద్దని నిర్మొహమాటంగా చెప్పారు. ఒక్కో చోట పట్టణాన్ని బట్టి లబ్ధిదారులకు మూడు లక్షల నుంచి పది లక్షల వరకు విలువైన స్థలాలు దక్కాయి. ఆ విషయాన్ని వారు చాలా స్పష్టంగా చెబుతున్నారు. చివరికి పవన్ కల్యాణ్ ప్రోగ్రాంలో సైతం ఆయన ఊదరకొట్టిన ఉపన్యాసం తప్ప, లబ్దిదారులు ఎవరూ వచ్చి ఫిర్యాదు చేయలేదట. దాంతో ఆయన పార్టీ నేతలను తప్పు పట్టి వెళ్లిపోయారు. 

జనసేన నేతలు సరిగా ఆర్గనైజ్ చేయలేకపోయారన్నది ఆయన బాధ కావచ్చు. కానీ వాస్తవాలు తెలుసుకుని ఆయన వ్యవహరించకపోతే ఇలాగే చేదు అనుభవాలే మిగులుతాయి. ఇళ్ల స్థలాల స్కీము ఆలోచన చేయడమేపూర్తి సాచ్యురేషన్ మోడ్‌లో జగన్ చేశారు. అందువల్లే 31 లక్షల మంది పేదలకు ఈ స్కీమ్‌ను అమలు చేయడానికి ఆయన సిద్దమయ్యారు. దీనిని మెచ్చుకోకపోతే, పోనీ మొత్తం కుంభకోణం అంటూ ప్రచారం చేయడానికి తెగించారు.

ఎక్కడైనా ఒకటి, రెండు చోట్ల ఎవైనా అవకతవకలు జరిగి ఉంటే వాటిని ప్రస్తావిస్తే తప్పు కాదు. కానీ అసలు స్కీమ్  కింద తీసుకున్న భూముల విలువకన్నా ఎక్కువ మొత్తం స్కామ్ జరిగిందని ఆరోపిస్తే ఎవరు నమ్ముతారు? మొత్తం 71 వేల ఎకరాల భూమిని  పేదల ఇళ్ల స్థలాల కోసం సేకరిస్తే, అందులో ప్రభుత్వ భూమి పోను మిగిలిన 25 వేల ఎకరాల కొనుగోలుకు 11 వేల కోట్ల రూపాయల వ్యయం అయిందట. కానీ పవన్ కల్యాణ్ మాత్రం ఏకంగా పదిహేనువేల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ఆరోపించారు. ఇలాంటి ప్రకటనలే పవన్  అజ్ఞానాన్ని బయటపెడుతున్నాయని మంత్రి రోజా ఎద్దేవా చేశారు.

ఇక్కడ 40 ఇయర్స్‌ అబద్దాలు
ఈ ధోరణి రాష్ట్ర రాజకీయాలలో తెలుగుదేశం ప్రవేశం తర్వాత బాగా పెరిగిపోయింది. చంద్రబాబు నాయుడుతో పాటు, ముద్దుకృష్ణమనాయుడు వంటివారు ఆధారాలు లేని ఆరోపణలు చేయడంతో సిద్దహస్తులుగా పేరొందారు. నిజంగానే ఏ అంశంపైన అయినా పరిశీలన చేసి విమర్శ చేయదలిస్తే, క్షుణ్ణంగా అధ్యయనం చేసి వెళ్లాలి. కానీ ఎక్కువ సందర్భాలలో పవన్ అరకొర పరిజ్ఞానంతో వెళ్లి అభాసుపాలు అవుతున్నట్లు అనిపిస్తుంది.

తెలుగుదేశం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఈనాడులో వచ్చిన విషపూరిత కథనాల ఆధారంగా ఆయన ఇలాంటి యాత్రలు పెట్టుకుంటున్నారు. ఒక కుట్ర ప్రకారం ముందుగా ఈనాడు, తదితర తెలుగుదేశం మీడియాలలో సంబంధిత ఆరోపణలతో కథనాలు ఇవ్వడం, ఆ తర్వాత తెలుగుదేశం, జనసేన వంటి పార్టీలు ప్రకటనలు చేయడం నిత్యకృత్యం అయింది.

పింగళి గారు.. గమనించారా?
జనసేన అధినేత వీకెండ్  షూటింగ్ లేని సమయంలో ఇలాంటి యాత్రలు పెట్టుకుని తన వంతు పాత్ర పోషిస్తున్నారు. ఈనాడు మీడియా అయితే పూర్తి అయిన ఇళ్ల గురించి వార్తలు ఇవ్వదు. పూర్తి కానీ ఇళ్ల గురించే వ్యతిరేక కథనాలు ఇస్తూ, అసలేమీ జరగడం లేదేమో అన్న భావన క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తోంది. జగనన్న కాలనీలలో మౌలిక సదుపాయాలైన రోడ్లు, డ్రైనేజ్, నీటి సదుపాయం వంటివాటిని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తుంటే టీడీపీ మీడియా మాత్రం ప్రతిదానిని తప్పుపడుతూ, నిందలు మోపుతూ ప్రజలను గందరగోళం చేయడానికి తంటాలు పడుతోంది.

ఆ సంగతి పక్కన బెడితే సోషల్ మీడియాలో పవన్ గురించి ఒక వీడియో వచ్చింది. ఆయన బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని మాట్లాడుతున్నట్లుగా ఉంది. అందులో జాతీయ పతాకాన్ని తయారు చేసింది జవహర్ లాల్ నెహ్రూ అన్నట్లుగా ఉంది. అది ఆయన వీడియోలాగే ఉంది. దీనిని బట్టే పవన్ కల్యాణ్ రాజకీయాలలోనే కాదు.. చరిత్ర విషయంలో కూడా అంత పరిజ్ఞానంతో మాట్లాడడం లేదన్నది అర్థం అవుతుంది. రాజకీయాలలో ముఖ్యమైన భూమిక పోషించాలని అనుకుంటే, అందుకు తగ్గట్లుగా విషయ పరిజ్ఞానం పంపొందించుకోవాలన్న సంగతి పవన్ కల్యాణ్‌కు ఎప్పటికి అర్ధం అవుతుందో!
-పొలిటికల్‌ ఎడిటర్, సాక్షి డిజిటల్‌
feedback@sakshi.com
 

మరిన్ని వార్తలు