రాజ్యసభలో తీవ్ర రగడ

11 Aug, 2023 02:09 IST|Sakshi

మణిపూర్‌పై 176 నిబంధన కింద చర్చ కోసం విపక్షాల పట్టు  

చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్, ఎలక్షన్‌ కమిషనర్ల బిల్లుపై అభ్యంతరం 

న్యూఢిల్లీ: మణిపూర్‌ అంశంతోపాటు వివాదాస్పద ముఖ్య ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల బిల్లుపై విపక్ష సభ్యులు ఆందోళన, నినాదాలతో గురువారం రాజ్యసభ అట్టుడికింది. మణిపూర్‌ హింసపై 267 నిబంధన కింద సభలో చర్చ చేపట్టాలని ఇన్నాళ్లూ పట్టుబట్టిన విపక్షాలు కొంత దిగొచ్చాయి. 176 నిబంధన కింద చర్చ ప్రారంభించాలని, ప్రధాని మోదీ సభకు వచ్చిన సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశాయి. 

ప్రధానమంత్రి ఏమైనా దేవుడా? 
రాజ్యసభ గురువారం ఉదయం ప్రారంభం కాగానే మణిపూర్‌ వ్యవహారంపై 176 నిబంధన కింద చర్చ కోసం విపక్ష సభ్యులు పట్టుబట్టారు. వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు. ప్రధాని మోదీని సభకు రప్పించాలని రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ను కాంగ్రెస్‌ సభ్యుడు మల్లికార్జున ఖర్గే కోరారు. దీనిపై అభ్యంతరం తెలిపిన అధికార బీజేపీ ఎంపీలపై ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రధానమంత్రి ఎందుకు రాకూడదు? ఆయన ఏమైనా దేవుడా?’ అని ప్రశ్నించారు.

ఖర్గే వ్యాఖ్యలతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో సభను చైర్మన్‌ ధన్‌ఖడ్‌ మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా వేశారు. అనంతరం వివిధ పార్టీల సభాపక్ష నేతలతో ఆయన సమావేశమయ్యారు. సభకు సహకరించాలని కోరారు. సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా విపక్షాల ఆందోళన ఆగలేదు. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యుడు డెరెక్‌ ఓబ్రెయిన్‌ పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ లేవనెత్తారు. రాజ్యసభ కార్యకలాపాలకు కేంద్ర ప్రభుత్వమే అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు.

ఓబ్రెయిన్‌ తీరును కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ తప్పుపట్టారు. అనంతరం మల్లికార్జన ఖర్గే మాట్లాడారు. అధికార పక్షం వల్లే సభ సజావుగా సాగడం లేదని మండిపడ్డారు. బీజేపీ ఎంపీల వ్యవహార శైలిని ఆక్షేపిస్తూ ఓ కవిత వినిపించారు. ఖర్గే తీరు గురువింద గింజలా ఉందని పీయూష్‌ గోయల్‌ ఎద్దేవా చేశారు.

ఖర్గే వ్యాఖ్యలను పలువురు బీజేపీ సభ్యులు ఖండించారు. మిజోరాం ఎంపీ ఒకరు మాట్లాడబోతుండగా చైర్మన్‌ ధన్‌ఖడ్‌ అనుమతించలేదు. పార్లమెంట్‌ సభ్యులకు దేశంలో ఏదో ఒక ప్రాంతం ముఖ్యం కాదని, దేశమంతా సమానమేనని ధన్‌ఖడ్‌ అన్నారు. 

ఫార్మసీ(సవరణ) బిల్లుకు ఆమోదం 
వివాదాస్పద ‘చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్, అదర్‌ ఎలక్షన్‌ కమిషనర్స్‌(అపాయింట్‌మెంట్‌ కండీషన్స్‌ ఆఫ్‌ సర్వీస్‌ అండ్‌ టర్మ్‌ ఆఫ్‌ ఆఫీస్‌) బిల్లు–2023ను కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు పట్ల ప్రతిపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

అనంతరం విపక్షాల ఆందోళన మధ్యే కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ‘పోస్ట్‌ ఆఫీస్‌ బిల్లు–2023’ను ప్రవేశపెట్టారు. ఈ తర్వాత కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయా ప్రవేశపెట్టిన ‘ఫార్మసీ(సవరణ) బిల్లు–2023’ సభలో ఆమోదం పొందింది. అనంతరం సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్‌ ధన్‌ఖడ్‌ ప్రకటించారు.  

మరిన్ని వార్తలు