50 Hours Parliament Protest: సస్పెండ్‌ ఎంపీల రాత్రి జాగారం.. 50 గంటల్లో పొద్దున్నే ఇలా..

28 Jul, 2022 09:18 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  నిత్యావసరాల ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, జీఎస్టీ వంటి అంశాలు పార్లమెంట్‌ ఉభయ సభలను కుదిపేస్తున్నాయి. వీటిపై తక్షణమే చర్చ చేపట్టాలని, ప్రభుత్వం సమాధానం చెప్పాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. బుధవారం సైతం ప్రతిపక్ష సభ్యులు పట్టువీడకపోవడంతో ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగింది. ధరలపై చర్చకు సిద్ధమని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ వారు వెనక్కి తగ్గలేదు. ఎంపీలపై సస్సెన్షన్‌ ఎత్తివేయాలంటూ ఆందోళన చేపట్టారు. బుధవారం రాజ్యసభ నుంచి ఆమ్‌ ఆద్మీ పార్టీ సభ్యుడు సంజయ్‌సింగ్‌ను సభాపతి సస్పెండ్‌ చేశారు. దీంతో ఉభయ సభల నుంచి బహిష్కరణకు గురైన విపక్ష ఎంపీల సంఖ్య 24కి చేరింది.

సస్పెండైన ప్రతిపక్ష ఎంపీలు బుధవారం పార్లమెంట్‌ ప్రాంగణంలో గాంధీ విగ్రహం వద్ద రిలే నిరసన ప్రారంభించారు. 50 గంటల పాటు నిరసన కొనసాగిస్తామన్నారు. 20 మంది రాజ్యసభ ఎంపీలకు నలుగురు లోక్‌సభ ఎంపీలూ తోడయ్యారు. వారికి విపక్షాలు ఆహారం, నీరు అందిస్తున్నాయి.  నిరసనలో టీఆర్‌ఎస్‌ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పాల్గొన్నారు. పలు పార్టీల నేతలు రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యను కలిసి సస్సెన్షన్‌ ఎత్తేయాలని కోరారు. సదరు ఎంపీలు విచారం వ్యక్తం చేస్తేనే అది సాధ్యమని ఆయన చెప్పారు. అందుకు వారు తిరస్కరించారు.

కాగా, నిరసనల్లో భాగంగా ఎంపీలందరూ పార్లమెంట్‌ ఆవరణలోనే నిద్రించారు. కాగా, రాత్రంతా జాగారం చేసినట్టు తెలుస్తోంది. పార్లమెంట్‌ వద్దే గురువారం ఉదయమే 6 గంటలకు టీ, 8 గంటలకు టిఫిన్‌ చేసినట్టు సమాచారం. దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్‌ నేతలు ట్విట్టర్‌ వేదికగా పోస్ట్‌ చేశారు.

విపక్షాల నోటీసుల తిరస్కరణ  
రాజ్యసభ ప్రారంభమైన వెంటనే ఛైర్మన్‌ వెంకయ్య నాయుడు విపక్ష ఎంపీల నోటీసులను తిరస్కరించారు. 19 మంది సభ్యుల సస్పెన్షన్‌ అంశాన్ని ప్రతిపక్ష ఎంపీలు లేవనెత్తడంతో సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది. తర్వాత మంగళవారం పోడియంపై కాగితాలు చించి విసిరేసినందుకు సంజయ్‌ సింగ్‌ను సస్పెండ్‌ చేస్తూ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌సింగ్‌ తీర్మానం ఆమోదించారు. అయినా సింగ్‌ సభలోనే ఉండిపోయారు. దీనిపై రగడతో సభ గురువారానికి వాయిదా పడింది.   లోక్‌సభలోనూ టీఆర్‌ఎస్‌ సహా విపక్ష ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళనకు దిగారు. సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని ఆందోళన చేయడం రెండుసార్లు వాయిదాకు దారి తీసింది. ప్లకార్డులు ప్రదర్శించకుంటే సస్పెన్షన్‌ను ఎత్తేస్తామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషీ అన్నారు. 

ధరలపై వచ్చేవారం చర్చ!  
మోదీ సర్కారు దిగొచ్చి విపక్షాల డిమాండ్‌ మేరకు ధరల పెరుగుదల, సామాన్య ప్రజల కష్టాలపై పార్లమెంట్‌లో చర్చకు సిద్ధపడే సంకేతాలు కనిపిస్తున్నాయి. చర్చకు తాము సిద్ధమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషీ వెల్లడించారు. ధరలపై వచ్చేవారం చర్చ ఉండొచ్చని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. 

మరిన్ని వార్తలు