కొన్ని పార్టీల తీరు దారుణం.. ఇదో కొత్త రకం రాజకీయ ఏకీకరణ

2 Sep, 2022 07:36 IST|Sakshi

కొచ్చి: అవినీతిపరులపై కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యలు జాతీయ రాజకీయాల్లో కొత్త తరహా విభజనకు దారి తీశాయని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ‘‘అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని కాపాడేందుకు పలు రాజకీయ సమూహాలు ఒక్కటవుతున్నాయి. ఇందుకోసం బహిరంగంగానే చేతులు కలుపుతున్నాయి. ఈ వైనాన్ని దేశమంతా గమనిస్తూనే ఉంది’’ అంటూ కాంగ్రెస్‌ తదితర విపక్షాలపై పరోక్షంగా విమర్శలు ఎక్కుపెట్టారు. ఇలాంటి గ్రూపులతో దేశ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ‘‘దేశాభివృద్ధికి అవినీతే అతి పెద్ద అడ్డంకి. యువత ప్రయోజనాలకూ గొడ్డలిపెట్టు’’ అన్నారు.

రెండు రోజుల పర్యటన కోసం మోదీ గురువారం కేరళ చేరుకున్నారు. ఈ సందర్భంగా కొచ్చి విమానాశ్రయం వద్ద జరిగిన సభలో భారీ జన సమూహాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ‘‘దేశవ్యాప్తంగా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అభివృద్ధి పరుగులు పెడుతోంది. డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వాల వల్లే ఇది సాధ్యమవుతోంది. కేరళలోనూ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైతే అభివృద్ధిలో రాష్ట్రం కొత్త శిఖరాలకు చేరుతుంది’’ అన్నారు. ‘‘దేశాభివృద్ధికి, సానుకూల మార్పుకు పాటుపడుతున్నది బీజేపీయేనని కేరళ ప్రజలు అర్థం చేసుకున్నారు. అందుకే తమ రాష్ట్రాభివృద్ధి విషయంలో కూడా బీజేపీ మీద వారు ఆశలు పెంచుకుంటున్నారు’’ అని చెప్పుకొచ్చారు.

దేశంలో ప్రతి పౌరునికీ మౌలిక సదుపాయాలు కల్పించడం, ఆధునిక మౌలిక వ్యవస్థ నిర్మాణమే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాథమ్యమని ప్రధాని చెప్పారు. ఈ సందర్భంగా కొచ్చి మెట్రో తొలి దశతో పాటు పలు రైల్వే ప్రాజెక్టులను మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు.

కాలడి సందర్శన..
ఎర్నాకుళం జిల్లా కాలడిలో ఆది శంకరుల జన్మస్థలిని ప్రధాని మోదీ సందర్శించారు. పెరియార్‌ నది ఒడ్డున ఉన్న ఈ పవిత్ర ప్రాంత సందర్శన గొప్ప అనుభూతినిచి్చందన్నారు. అద్వైత సిద్ధాంతకర్త అయిన ఆది శంకరులు భరత జాతికి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు.
చదవండి: విశ్వాస పరీక్షలో నెగ్గిన కేజ్రీవాల్‌ సర్కార్‌

మరిన్ని వార్తలు