ప్రతిపక్షం పలాయనం 

28 Sep, 2023 04:00 IST|Sakshi

చంద్రబాబు అరెస్ట్‌పై అధికార పక్షాన్ని నిలదీస్తామన్న ప్రతిపక్షం 

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే ఆత్మరక్షణలో పడిన వైనం

స్కిల్‌ స్కామ్‌తోపాటు ఫైబర్‌ గ్రిడ్, ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ స్కామ్‌లు చర్చకు వస్తాయని ఆందోళన 

కుంభకోణాలు చర్చకు రాకుండా అడ్డుకుని, సస్పెన్షన్‌ వేటు వేయించుకోవాలని ఎత్తు 

అధికారపక్షం గొంతు నొక్కుతోందని రాద్ధాంతం చేసి సానుభూతి పొందవచ్చని వ్యూహం 

అభాసుపాలై సమావేశాలను బహిష్కరించి పలాయనం చిత్తగించిన ప్రతిపక్షం 

శాసనసభ ఐదు రోజుల సమావేశాలు ముగిసిన తీరిది 

సాక్షి, అమరావతి: తాము చేసిన సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు కళ్లకు కట్టినట్టు వివరించడానికి అధికార పక్షానికి.. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రతిపక్షానికి శాసనసభ సమావేశాలు సరైన వేదిక. అధికార పక్షం నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తూ శాసనసభ సమావేశాలను సమర్థవంతంగా వినియోగించుకుంటే.. చంద్రబాబు చేసిన అక్రమాలతో ఆత్మరక్షణలో పడ్డ ప్రతిపక్షం పలాయనం చిత్తగించి అభాసుపాలైంది. గత 52 నెలల్లో సంక్షేమ, అభివృద్ధి, పథకాల ద్వారా ప్రజలకు చేసిన మంచిని వివరించడంతోపాటు టీడీపీ సర్కార్‌ హయాంలో జరిగిన కుంభకోణాలను సాక్ష్యాధారాలతో బయటపెట్టడంలో అధికార పక్షం విజయవంతమైంది.

స్కిల్‌ స్కామ్‌లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును అరెస్ట్‌ చేయడంపై శాసనసభ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీస్తామని, ప్రజలకు వాస్తవాలు తెలిసేలా గళమెత్తుతామని బీరాలు పలికిన ప్రతిపక్ష సభ్యులు చిల్లర చేష్టలు, వెకిలి వేషాలు, అసభ్య సైగలు చేస్తూ లేకి ప్రవర్తనతో ఆత్మరక్షణలో పడి రెండ్రోజుల్లోనే పలాయనం చిత్తగించారు. ఇదీ శాసనసభ సమావేశాలు జరిగిన తీరు. ఈనెల 21న ప్రారంభమైన శాసనసభ సమావేశాలు బుధవారం ముగిశాయి. ఐదు రోజులపాటు సమావేశాలు జరిగాయి. 

ఆత్మరక్షణలో ప్రతిపక్షం 
స్కిల్‌ స్కామ్‌లో ప్రభుత్వ ఖజానా నుంచి రూ.371 కోట్లు దోచేసి, సీఐడీ పోలీసులకు దొరికిపోయిన చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్‌ విధించి రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు పంపింది. ఈ ఉదంతంపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని.. ప్రజలకు వాస్తవాలను వివరించేలా గళమెత్తి అధికా­ర పక్షం కక్ష సాధింపు చర్యలను జనంలోకి తీసుకెళ్తామని టీడీపీ శాసనసభా పక్షం ప్రకటించింది. తీరా శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాక ఆత్మరక్షణలో పడిపోయింది.

స్కిల్‌ స్కామ్‌తోపాటు ఫైబర్‌ నెట్‌ స్కామ్, ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ సహా టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాలు చర్చకు వస్తే చంద్రబాబు అక్రమాల బాగోతం సాక్ష్యాధారాలతో సహా అధికారపక్షం గుట్టురట్టు చేయడం ఖాయమని.. అప్పుడు ప్రజల్లో మరింత చులకనవుతామని భావించిన ప్రతిపక్షం వ్యూహం మార్చింది. ఎలాగైనా సరే సస్పెన్షన్‌ వేటు వేయించుకుంటే చర్చ నుంచి తప్పించుకోవడంతోపాటు సభ నుంచి బయటకు వచ్చాక అధికార పక్షం తమ గొంతు నొక్కుతోందంటూ రాద్ధాంతం చేసి చంద్రబాబు కుంభకోణాల నుంచి ప్రజల దృష్టి మళ్లింపవచ్చని ఎత్తు వేసింది.

ఆ వ్యూహంలో భాగంగా తొలి రోజు, రెండో రోజూ స్కిల్‌ స్కామ్‌పై చర్చకు సిద్ధమని అధికార పక్షం స్పష్టం చేసినా వినకుండా స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టి.. పేపర్లు చింపి విసిరేస్తూ వీధి రౌఢీల్లా అరుపులు, కేకలు వేస్తూ.. బూతులు తిడుతూ ప్రతిపక్ష సభ్యులు వీరంగం చేశారు. బాలకృష్ణ అయితే మీసం మెలేసి.. అసభ్య సైగలు చేస్తూ లేకిగా ప్రవర్తించి చట్టసభల ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరించి సస్పెన్షన్‌ వేటు వేయించుకున్నారు. శాసనభలో మొదటి రోజు, రెండో రోజు ప్రతిపక్షం లేకి ప్రవర్తనను ప్రజలు అసహ్యంచుకోవడంతో.. అకారణంగా తమను సస్పెండ్‌ చేస్తూ అధికార పక్షం తమ గొంతు నొక్కుతోందని.. అందుకే తాము శాసనసభ సమావేశాలను బహిష్కరిస్తున్నామంటూ ప్రతిపక్షం పలాయన మంత్రం జపించింది. 

ప్రజాపక్షమై ప్రతిధ్వనిస్తూ.. 
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ సంక్షేమ అభివృద్ధి పథకాల ద్వారా చేసిన మేలును శాసనసభ సాక్షిగా అధికార పక్షం ప్రజలకు వివరించింది. టీడీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానం మేరకు స్కిల్‌ స్కామ్‌పై చర్చను చేపట్టి.. ప్రభుత్వ ఖజానా నుంచి రూ.371 కోట్లను అప్పటి సీఎం చంద్రబాబు ఎలా దోచుకున్నారన్నది సాక్ష్యాధారాలతో ప్రజలకు వివరించడంలో సక్సెస్‌ అయ్యింది. ఇదే క్రమంలో ఫైబర్‌ గ్రిడ్‌ స్కామ్, ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ మార్పు స్కామ్‌లతో చంద్రబాబు, లోకేశ్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడి.. ప్రభుత్వ ఖజానాను దోచేయడంతోపాటు తమ వందిమాగధులకు ఎలా లబ్ధి చేకూర్చారన్నది సాక్ష్యాధారాలతోసహా ప్రజల ముందు పెట్టింది.

ప్రజాధనానికి ధర్మకర్తగా వ్యవహరించాల్సిన బాధ్యతను నిర్వర్తించే క్రమంలోనే దర్యాప్తు సంస్థ సీఐడీకి పూర్తి స్వేచ్ఛను ఇచ్చామని.. స్కిల్‌ స్కామ్‌లో అడ్డంగా దొరికిన చంద్రబాబును ఆ సంస్థ అరెస్ట్‌ చేసిందని వివరించింది. ఈ వ్యవహారంలో ఎలాంటి కక్ష సాధింపులు లేవని.. ప్రజాధనానికి ధర్మకర్తగా వ్యవహరించాల్సిన బాధ్యతను త్రికరణ శుద్ధితో నిర్వర్తిస్తున్నామనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో అధికార పక్షం గ్రాండ్‌ సక్సెస్‌ అయ్యింది.   

మరిన్ని వార్తలు