Opposition Alliance INDIA: పార్లమెంట్‌లో నేడే ఎన్డీయే సర్కార్‌పై అవిశ్వాసం

26 Jul, 2023 04:13 IST|Sakshi

నేడు ‘ఇండియా’ కూటమి భేటీలో నిర్ణయం 

మణిపూర్‌పై అట్టుడికిన ఉభయ సభలు 

ప్రధాని పార్లమెంటుకు వచ్చి చర్చించాలి 

51 మంది విపక్ష ఎంపీల నోటీసులు 

నిరసనలకు మద్దతు పలికిన బీఆర్‌ఎస్‌ 

విపక్షాలు కలసి రావాలంటూ అమిత్‌ షా లేఖ 

సాక్షి, న్యూఢిల్లీ: మణిపూర్‌ హింసపై పార్లమెంట్‌ వెలుపలా, లోపలా నిరసనలతో హోరెత్తిస్తున్నా ప్రధాని నరేంద్ర మోదీ నోరుమెదపకపోవడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఇండియన్‌ నేషనల్‌ డెవలప్‌మెంటల్‌ ఇంక్లూజివ్‌ అలయన్స్‌ (ఇండియా) పేరిట ఇటీవలే ఒక్కటైన కాంగ్రెస్‌ సహా 26 విపక్షాలు ఈ అంశానికి సంబంధించి కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే యోచనలో ఉన్నాయి.

రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన మంగళవారం జరిగిన విపక్షాల భేటీలో అవిశ్వాస తీర్మానంపై కీలక చర్చలు జరిగాయి. బుధవారం నేతలతో మరోసారి సంప్రదించి తుది నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్‌ నేతలు వెల్లడించారు. తీర్మాన ప్రతి ఇప్పటికే సిద్ధమైందని, 50 మంది ఎంపీల సంతకాల సేకరణ ప్రక్రియ జరుగుతోందని వివరించారు.

ఆ రోజు విధిగా లోక్‌సభకు హాజరవాలంటూ కాంగ్రెస్‌ ఇప్పటికే తమ సభ్యులకు విప్‌ జారీ చేసింది. మరోవైపు, మణిపూర్‌పై చర్చిద్దాం రమ్మంటూ ఉభయ సభల్లో విపక్ష నేతలు ఖర్గే, అదీర్‌ రంజన్‌ చౌదరిలకు అమిత్‌ షా లేఖలు రాశారు. లోక్‌సభలో ఈ మేరకు ప్రకటన కూడా చేశారు.

83 రోజులుగా సాగుతున్న మణిపూర్‌ హింసపై పార్లమెంటు ఉభయ సభల్లోనూ ప్రధాని మోదీ సమగ్రమైన ప్రకటన చేయాల్సిందేనని ఖర్గే డిమాండ్‌ చేశారు. అక్కడ పరిస్థితిని మెరుగు పరిచేందుకు కేంద్రం ఏం చేస్తోందో పార్లమెంటుకు చెప్పాల్సిన బాధ్యత ఆయనపై ఉందన్నారు.  

ఖర్గే వర్సెస్‌ గోయల్‌ 
ఉభయ సభల్లోనూ విపక్షాలు మంగళవారం నాలుగో రోజు కూడా కార్యక్రమాలను అడ్డుకున్నాయి. మణిపూర్‌పై మోదీ వచ్చి ప్రకటన చేయాలంటూ నినదాలతో హోరెత్తించాయి. ఉదయం రాజ్యసభ ఆరంభానికి ముందే బీఆర్‌ఎస్‌తో పాటు 51 మంది విపక్ష ఎంపీలు 267 నిబంధన కింద నోటీసులిచ్చారు. 176 నిబంధన కింద ఇచ్చిన నోటీసులపై చర్చకు ప్రభుత్వం సిద్ధమని సభా పక్ష నేత, కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ పేర్కొన్నారు.

267 కింద నోటీసులిస్తే 176 కింద ఎలా చర్చ చేపడతారని కాంగ్రెస్‌ నేత పి.చిదంబరం ప్రశ్నించారు. తమ ఎంపీ సంజయ్‌సింగ్‌ సస్పెన్షన్‌ను నిరసిస్తూ ఆప్‌ సభ్యులు ఆందోళన కొనసాగించారు. దాంతో సభ మధ్యాహా్ననికి వాయిదా పడింది. తిరిగి మొదలవగానే విపక్షాలు వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళనకు దిగాయి. గోయల్, ఖర్గే మధ్య వాగ్వాదం జరిగింది. మణిపూర్‌ తగలబడుతుంటే దానిపై చర్చకు ‘మోదీ సాబ్‌’ సభకు ఎందుకు రాలేదని ఖర్గే ప్రశ్నించగా, విపక్ష పాలిత రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న అకృత్యాల మీదా సభలో చర్చిద్దామని గోయల్‌ అన్నారు. దాంతో సభ మధ్యాహ్నం రెండింటి దాకా వాయిదా పడింది.

ఎస్టీల రాజ్యంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టగానే విపక్షాల ఆందోళన నేపథ్యంలో సభ బుధవారానికి వాయిదా పడింది. లోక్‌సభ కూడా నేరుగా మధ్యాహ్నం రెండింటికి, అనంతరం జీవ వైవిధ్య బిల్లును ప్రవేశపెట్టాక సాయంత్రం ఐదింటికి వాయిదా పడింది. తర్వాత సహకార సంఘాల బిల్లును సభ ఆమోదించింది. ప్రతిష్టంభనకు ఫుల్‌స్టాప్‌ పెట్టేందుకు అఖిల పక్ష నేతలతో స్పీకర్‌ ఓం బిర్లా భేటీ అయినా లాభం లేకపోయింది.

మోదీ వచ్చి మణిపూర్‌ హింసపై స్వయంగా చర్చ మొదలు పెట్టాల్సిందేనని వారు స్పష్టం చేశారు. ఏ రోజైనా చర్చకు సిద్ధమని, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చర్చ మొదలు పెడతారని అధికార పక్షం ప్రతిపాదించింది. ఇక సంజయ్‌ సింగ్‌ సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా పార్లమెంట్‌ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద విపక్ష కూటమి సోమవారం రాత్రంతా బృందాలవారీగా చేసిన ధర్నాలో బీఆర్‌ఎస్‌ ఎంపీలు పాల్గొన్నారు.  

మోదీకి ‘ఇండియా’ పేరు నచ్చినట్టుంది: మమత 
కోల్‌కతా: ‘‘ప్రధాని మోదీకి థ్యాంక్స్‌. విపక్ష కూటమి పేరు ‘ఇండియా’ ఆయనకు బాగా నచ్చినట్టుంది’’ అంటూ పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ చెణకులు విసిరారు. విపక్ష కూటమి గురించి బీజేపీ ఎంతగా విమర్శలు చేస్తే, ‘ఇండియా’ అనే పేరు వారికి అంతగా నచ్చినట్టు అర్థమన్నారు.

మరిన్ని వార్తలు