ప్రజాస్వామ్యం ఖూనీ

13 Aug, 2021 06:03 IST|Sakshi
పార్లమెంట్‌ వద్ద నిరసన ర్యాలీలో పాల్గొన్న రాహుల్‌ గాంధీ, ఇతర విపక్ష పార్టీల నేతలు

ప్రభుత్వం రాజ్యసభలో భౌతికదాడులకు దిగింది

కాంగ్రెస్‌ సహా పలు విపక్షాల ఆందోళన

పార్లమెంట్‌ నుంచి విజయ్‌ చౌక్‌ వరకు ర్యాలీ

ఉపరాష్ట్రపతితో విపక్షాల భేటీ

సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలు ముగిసినా ఢిల్లీలో రాజకీయ వేడి తగ్గలేదు. ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కిందంటూ, రాజ్యసభలో భౌతికంగా దాడులకు దిగిందంటూ నిరసన వ్యక్తం చేస్తూ గురువారం విపక్షాలు ర్యాలీగా వచ్చి విజయ్‌చౌక్‌లో ధర్నా నిర్వహించాయి. ముందుగా గురువారం ఉదయం పార్లమెంట్‌లో రాజ్యసభలో ప్రతిపక్షనేత ఖర్గే కార్యాలయంలో ప్రతిపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. కాంగ్రెస్, ఎన్‌సీపీ, శివసేన, సమాజ్‌వాదీ, సీపీఎం, సీపీఐ, డీఎంకే తదితర పార్టీల నేతలు సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం పార్లమెంట్‌ నుంచి విజయ్‌చౌక్‌కు నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రతిపక్ష ఎంపీలంతా ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ప్రజల గొంతుకను నొక్కేశారని నినదిస్తూ విజయ్‌ చౌక్‌కు చేరుకున్నారు. అక్కడ కొద్దిసేపు ధర్నా నిర్వహించారు.  

మార్షల్స్‌లా బయటి వ్యక్తులొచ్చారు: శివసేన
శివసేన పక్షనేత సంజయ్‌ రౌత్‌ మాట్లాడుతూ ‘ప్రతిపక్షాలకు తమ అభిప్రాయాలను పార్లమెంటులో వెల్లడించేందుకు అవకాశం రాలేదు. మహిళా ప్రజాప్రతినిధుల పట్ల జరిగిన సంఘటన ప్రజాస్వామ్యానికి చేటు. పాకిస్తాన్‌ సరిహద్దు వద్ద నిలబడినట్లు అనిపించింది..’ అని విమర్శిచారు. బయటి వ్యక్తులు మార్షల్స్‌ యూనిఫారమ్‌ ధరించి మహిళలను కొట్టడానికి వచ్చారని ఆరోపించారు.

అధికార పార్టీయే కారణం: డీఎంకే
డీఎంకే రాజ్యసభ పక్ష నేత శివ మాట్లాడుతూ ‘ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించేందుకు తెచ్చిన ఇన్సూరెన్స్‌ బిల్లును లక్షలాది మంది ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. దీనిని సెలక్ట్‌ కమిటీకి పంపాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేసినా ప్రభుత్వం అంగీకరించలేదు. ఈ బిల్లును బలవంతంగా ఆమోదించుకుంది. దీనిపై ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేశారు. ఇద్దరు మహిళా ఎంపీలు దాడికి గురయ్యారు. ఈ నియంతృత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని ప్రతిపక్షాలు ఐక్యంగా ఉద్యమిస్తున్నాయి. పార్లమెంట్‌ సజావుగా జరగకపోవడానికి అధికార పార్టీనే కారణం‘ అని విమర్శించారు.

ఉపరాష్ట్రపతితో భేటీ..
విజయ్‌ చౌక్‌లో నిరసన అనంతరం విపక్షాలు రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడుతో సమావేశమయ్యాయి. ఆగస్టు 11న రాజ్యసభలో భారీ సంఖ్యలో మార్షల్స్‌ కాని వారిని మోహరించారని ఫిర్యాదు చేశారు. సమావేశాలు సజావుగా సాగేలా, విపక్షాలు ప్రజా సమస్యలపై తమ వాణి వినిపించేలా చూడాలని కోరారు. జనరల్‌ ఇన్సూరెన్స్‌ బిల్లును కేంద్రం తెచ్చిన తీరును నివేదించారు. ఈ సమావేశం అనంతరం 15 పార్టీల ఉమ్మడి ప్రకటనను విడుదల చేశాయి. ‘పార్లమెంటు వర్షాకాల సమావేశాలను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పట్టాలు తప్పించింది. ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను అగౌరవ పరుస్తుంది. ప్రారంభంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో సంయుక్తంగా ప్రతిపక్షాలు ముఖ్యమైన అంశాలపై చర్చించాలని ప్రతిపాదించాయి.

పెగసస్‌ గూఢచార్యం, రైతుల ఆందోళనలు, ధరలు పెరుగుదల, దిగజారుతున్న ఆర్థిక పరిస్థితి వంటి అంశాలపై చర్చించాలని కోరాం.. చర్చ కోసం పట్టుపట్టిన ప్రతిపక్షాల డిమాండ్లను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ప్రస్తుత ప్రభుత్వానికి పార్లమెంటరీ జవాబుదారీతనంపై నమ్మకం లేదు. పెగసస్‌పై చర్చ నుంచి పారిపోతోంది. ప్రతిష్టంభనను తొలగించడానికి ప్రతిపక్ష పార్టీలతో చర్చించాల్సింది. కానీ ప్రభుత్వం అహంకారపూరితంగా నిర్లక్ష్యంగా ఉంది. ప్రతిష్టంభనకు పూర్తిగా బాధ్యత ప్రభుత్వమే వహించాలి’ అని పేర్కొన్నాయి. ‘ప్రభుత్వ నిరంకుశ వైఖరిని, అప్రజాస్వామిక చర్యలను ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై దాడికి వ్యతిరేకంగా మా పోరాటాన్ని కొనసాగించడానికి, జాతీయ ప్రాముఖ్యత అంశాలు, ప్రజా సమస్యలపై ఆందోళన చేయడానికి మేం కట్టుబడి ఉన్నాం..’ అని పేర్కొన్నాయి.  

మరిన్ని వార్తలు