వివాదస్పదంగా మారిన యూపీ సీఎం ‘అబ్బాజాన్‌’ వ్యాఖ్యలు 

15 Sep, 2021 15:00 IST|Sakshi

ఏ విద్వేషాలు నింపడానికి..!

యోగి ఆదిత్యనాథ్‌పై నేతల ఫైర్‌

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ‘అబ్బాజాన్‌’ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇలా విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడేవారు యోగి ఎలా అవుతారని ట్విటర్‌ వేదికగా కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. యూపీలోని ఖుషీనగర్‌లో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న యోగి ఆదిత్యనాథ్‌ అబ్బాజాన్‌ అని మాట్లాడేవారందరూ 2017కి ముందు రేషన్‌ని బొక్కేశారంటూ ముస్లింలను పరోక్షంగా టార్గెట్‌ చేశారు.

ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలకు రేషన్‌ అందుతున్నట్టుగా అప్పట్లో అందలేదని అన్నారు. ఖుషీనగర్‌ రేషన్‌ నేపాల్, బంగ్లాదేశ్‌లకు తరలిపోయేదన్న యోగి ప్రస్తుతం నిరుపేదలకు చెందిన నిత్యావసర సరుకుల్ని ఎవరైనా మింగేయాలని చూస్తే ఊచలు లెక్కపెడతారని హెచ్చరించారు. అబ్బాజాన్‌ అని మాట్లాడేవారందరూ అంటూ యోగి పరోక్షంగా ముస్లింలను టార్గెట్‌ చేయడం వివాదానికి దారి తీసింది. ట్విటర్‌  వేదికగా పలువురు నేతలు యోగిని ఎండగడుతున్నారు. ఈ దేశం హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, ఇతర మతాలు, వర్గాలు, కులాలకు చెందినదని.. రాజకీయ పార్టీ నాయకులు మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలని జేడీ(యూ) అధ్యక్షుడు, ఎంపీ లలన్‌ సింగ్‌ యోగికి హితవు చెప్పారు.
చదవండి: డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వంతో... యూపీకి ప్రయోజనం

బీజేపీ ప్రతీ ఎన్నికల్లోనూ మతం కార్డునే బయటకు తీస్తోందని, ఈసారి యోగి హిందువుల రేషన్‌ని ముస్లింలు తినేశారని ప్రచారం చేస్తూ తిరిగి సీఎం పీఠం ఎక్కడానికి చూస్తున్నారని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఉపాధ్యక్షుడు ఒమర్‌  విమర్శించారు.ఎస్పీ అధికారంలో ఉన్నప్పుడే రేషన్‌ సరిహద్దులు దాటి వెళ్లిందంటూ యోగి చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న యోగి అమర్యాదకరంగా మాట్లాడారని, చదువు లేకపోవడం వల్లే ఆయన ఇలా నోరు పారేసుకున్నారని సమాజ్‌వాదీ పార్టీ ఎంఎల్‌సీ అశుతోష్‌ సిన్హా విరుచుకుపడ్డారు.

మరిన్ని వార్తలు