ఒక్క ఛాన్స్‌.. ఈటలపై పోటీకి సై అంటున్న నేతలు!

29 May, 2021 08:21 IST|Sakshi

హుజూరాబాద్‌ ఉప ఎన్నికపై నేతల ఆశలు

టీఆర్‌ఎస్‌ నుంచి పోటీకి ఇప్పటి నుంచే ప్లాట్‌ఫారం

కాంగ్రెస్‌ కౌశిక్‌ రెడ్డి, బీజేపీ పెద్దిరెడ్డి సైతం టీఆర్‌ఎస్‌ లైన్‌లో..

యాక్టివ్‌ రోల్‌లోకి వకుళాభరణం, శ్రీనివాస్‌

కెప్టెన్‌ ఫ్యామిలీ నుంచి ఆశావహులు

కొత్తగా తెరపైకి స్థానిక నేతలు

సాక్షి, కరీంనగర్‌: హాట్‌ టాపిక్‌గా మారిన హుజూరాబాద్‌ నియోజకవర్గంలో రాజకీయ వేడి పెరుగుతోంది. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ బీజేపీలోకి వెళ్లడం ఖాయమైనట్టు తేలడంతో అన్ని రాజకీయ పార్టీలు అలర్ట్‌ అయ్యాయి. హుజూరాబాద్‌ నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్‌ ఏకచత్రాధిపత్యం చలాయించారు. ఈ నియోజకవర్గంలో ఆయన స్థాయిలో పార్టీ నాయకులెవరూ ఎదిగే అవకాశం రాలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈటల బీజేపీలోకి వెళితే.. ఉప ఎన్నిక అనివార్యం కానుంది.

ఒకవేళ ఉప ఎన్నిక జరిగితే ఈటల పోటీ చేయడం తథ్యం. ఆ పరిస్థితుల్లో టీఆర్‌ఎస్‌ కూడా ఆయనను ఢీకొనే స్థాయి నాయకుడిని బరిలో దింపాల్సిన ఉంటుంది. 2004లో కమలాపూర్‌ నుంచి, 2009 తరువాత హుజూరాబాద్‌ నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్న ఈటలకు ప్రతి గ్రామంతో సంబంధాలున్నాయి. పార్టీ కేడర్‌తో సంబంధం లేకుండా వ్యక్తిగత పరిచయాలు ఎక్కువ. ఈ పరిస్థితుల్లో ఈటలను ఢీకొనే స్థాయి నాయకుడు ఎవరా అని హుజూరాబాద్‌తోపాటు కరీంనగర్‌ జిల్లాలోనూ చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో ఉన్న నాయకుల కన్నా ఎక్కువగా.. కాంగ్రెస్, బీజేపీకి చెందిన వారి పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఈటల

స్థానంలో చాన్స్‌ కోసం..
2004 నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ, ప్రత్యర్థి పార్టీలకు అవకాశం ఇవ్వని ఈటల రాజేందర్‌ పార్టీ మారి బీజేపీలో చేరితే.. టీఆర్‌ఎస్‌ టిక్కెట్టు కోసం గట్టి పోటీ నెలకొనే అవకాశాలు న్నాయి. గతంలో హుజూరాబాద్‌ నుంచి పోటీ చేసిన నాయకులే.. పార్టీ మారి బరిలో నిలిచేందుకు ముందు వరుసలో ఉండడం గమనార్హం. ఈ క్రమంలో 2004, 2009, 2018లలో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన నాయకులు ఈసారి టీఆర్‌ఎస్‌ నుంచి పోటీకి సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీ మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ నాయకుడు ఇనుగాల పెద్దిరెడ్డి, కాంగ్రెస్‌ ఇన్‌చార్జి పాడి కౌశిక్‌ రెడ్డి, బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు, టీఆర్‌ఎస్‌ నాయకుడు వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు టీఆర్‌ఎస్‌ నుంచి అవకాశం వస్తే పోటీకి సిద్ధంగా ఉన్నా రు. వీరితోపాటు టీఆర్‌ఎస్‌వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, కెప్టెన్‌ లక్ష్మికాంతరావు కుటుంబ సభ్యుల్లో ఒకరు టికెట్టు ఆశిస్తున్న వారిలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 

చదవండి: టీఆర్‌ఎస్‌ ఫోకస్‌: ఈటల బాటలో నడిచేదెవరు?

కాంగ్రెస్‌ నుంచి ఓడి.. టీఆర్‌ఎస్‌ ద్వారా వకుళాభరణం
2009 సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అ భ్యర్థి ఈటల రాజేందర్‌పై కాంగ్రెస్‌ అభ్యర్థిగా వకులాభరణం కృష్ణమోహన్‌ రావు పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువా త 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో సైతం కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగి మరోసారి ఓడిపోయారు. 2014 వరకు కాంగ్రెస్‌లోనే బీసీ కమిషన్‌ సభ్యుడిగా కొనసాగారు. 2014లో ఆయనకు కాంగ్రెస్‌ టికెట్టు దక్కలేదు. కేసీఆర్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2014లో టీఆర్‌ఎస్‌లో చేరారు. అప్పటి నుంచి పార్టీ బీసీ నాయకుడిగా కొనసాగుతున్నారు. తా జా రాజకీయ పరిణామాల దృష్ట్యా టీఆర్‌ఎస్‌ టి క్కెట్టును ఆశిస్తున్నారు. బీసీ వర్గానికి చెందిన ఆ యన ఈటల ఎపిసోడ్‌ వెలుగు చూసిన నాటి నుంచి నియోజకవర్గంలో చురుగ్గా వ్యవహరిస్తున్నా రు. తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. 

ఈటల బీజేపీ.. పెద్దిరెడ్డి టీఆర్‌ఎస్‌లోకి..
1994, 1999లో హుజూరాబాద్‌ టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేసిన పెద్దిరెడ్డి 2004లో కెప్టెన్‌ లక్ష్మికాంతరావు చేతిలో ఓడిపోయారు. 2009 ఎన్నికల నాటికి ప్రజారాజ్యంలో చేరి హుస్నాబాద్‌ నుంచి పోటీ చేసి పరాజయం చెందారు. 2014లో టీడీపీ అభ్యర్థిగా రామగుండం నుంచి పోటీ చేసినా ఫలితం దక్కలేదు. ఈ నేపథ్యంలో 2019లో ఆయన బీజేపీలో చేరారు. హుజూరాబాద్‌ నుంచి కమలం అభ్యర్థిగా పోటీ చేయాలని భావిస్తూ వచ్చారు. అయితే.. ఈటల బీజేపీలో చేరుతారనే ప్రచారంపై పెద్దిరెడ్డి తన అసంతృప్తిని వెళ్లగక్కారు.

తనను సంప్రదించకుండా ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు. ఈటల బీజేపీలో చేరిన పక్షంలో పెద్దిరెడ్డి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లడం ఖాయమనే తెలుస్తోంది.హుజూరాబాద్‌కు చెందిన పెద్దిరెడ్డి అనుయాయుడు పోరెడ్డి శంతన్‌ రెడ్డితోపాటు ఇద్దరు కౌన్సిలర్లు శోభ, మంజుల శుక్రవారం టీఆర్‌ఎస్‌లో చేరడం ఈ అనుమానాల కు తావిస్తోంది. టీడీపీలో ఉన్నప్పుడు కేసీఆర్‌తో పెద్దిరెడ్డికి ఉన్న సంబంధాలు కూడా ఆయనకు కలిసి వస్తాయని భావిస్తున్నారు. ఈటల ఎపిసోడ్‌ వెలుగులోకి వచ్చిన నాటినుంచే టీఆర్‌ఎస్‌ నుంచి పోటీకి పెద్దిరెడ్డి సిద్ధంగా ఉన్నారని వస్తున్న వార్తలను నిజం చేసే పనిలో ఉన్నారు. 

లైన్‌లో టీఆర్‌ఎస్‌వీ అధ్యక్షుడు.. 
టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న వీణవంక మండలానికి చెందిన గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ సైతం టీఆర్‌ఎస్‌ టిక్కెట్టు ఆశిస్తున్నారు. తనకు అవకాశం ఇస్తే గెలుస్తానని ఇప్పటికే పార్టీ అధిష్టానానికి సంకేతాలు పంపినట్లు తెలిసింది. ఈయనతోపాటు మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎంపీ కెప్టెన్‌ లక్ష్మికాంతరావు కుటుంబం నుంచి కూడా బరిలో నిలుస్తారనే ప్రచారం ఉంది. టీఆర్‌ఎస్‌లో ప్రకంపనలు సృష్టించిన ఈటల వ్య వహారం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు.

హాట్‌ టాపిక్‌గా కౌశిక్‌రెడ్డి 
2018లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన పాడి కౌశిక్‌ రెడ్డి తాజా రాజకీయ పరిణామాల్లో కీలకంగా మారారు. టీఆర్‌ఎస్‌ హవాలో కూడా ఈటలకు గట్టి పోటీ ఇచ్చిన కౌశిక్‌ ఓడిపోయినప్పటి నుంచి ఈటలపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. రాజేందర్‌ను మంత్రి వర్గం నుంచి తొలగించిన తరువాత కూడా దూకుడు ఆపలేదు. మాజీ మంత్రి భూకబ్జాల పేరుతో కరీంనగర్‌లో రెండుసార్లు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ పార్టీ కి చెందిన ముఖ్యనేతలు ఈటలకు మద్దతుగా నిలిచిన సమయంలో కౌశిక్‌రెడ్డి మాత్రం ఈటలను టార్గెట్‌ చేయడం చర్చనీయాంశమమైంది. టీఆర్‌ఎస్‌ పార్టీ అగ్ర నాయకత్వ మే కౌశిక్‌రెడ్డి ద్వారా విమర్శలు చేయిస్తోందనే అనుమానాలు కూడా ఉన్నాయి. అంఅందుకే టీఆర్‌ఎస్‌ నుంచి కౌశిక్‌రెడ్డి పోటీ లో ఉంటారని ప్రచారం జరుగుతోంది. కా గా.. కౌశిక్‌ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కు సమీప బంధువు కావడం గమనార్హం. 

మరిన్ని వార్తలు