తిరుమలలో వేయి కాళ్ల మండపాన్ని కూల్చింది చంద్రబాబే..

4 Jan, 2021 05:33 IST|Sakshi

కృష్ణా పుష్కరాల సమయంలో ఆలయాలను కూల్చిందెవరు? 

పీఠాధిపతులు, మఠాధిపతులు రాజకీయాలు చేయడం దారుణం  

టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు ఓవీ రమణ  

సాక్షి, తిరుపతి: ‘తిరుమలలోని అతి పురాతన కట్టడం వేయి కాళ్ల మండపాన్ని చంద్రబాబు హయాంలోనే కూలదోయించారు.. కొన్ని రోజుల పాటు కూల్చే కార్యక్రమాన్ని చేపట్టినా.. మఠాధిపతులు, పీఠాధిపతులు, బీజేపీ నాయకులు ఏం చేశారు? అని టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు ఓవీ రమణ ప్రశ్నించారు. తిరుమల ఆలయంలోనే నిత్యం నిర్వహించే కల్యాణోత్సవ కార్యక్రమాన్ని బయట చేయాలని ఆదేశాలిచ్చింది చంద్రబాబేనన్నారు. ఆలయాల పేరుతో చంద్రబాబు, బీజేపీ శ్రేణులు చేస్తున్న విష ప్రచారంపై ఆయన స్పందించారు. ‘సాక్షి’తో మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు. శ్రీవారిని అడ్డుపెట్టుకునే చంద్రబాబు రాజకీయ అరంగేట్రం చేశారని గుర్తుచేశారు. నాడు సంజయ్‌గాం«దీకి శ్రీవారి దర్శనం చేయించి ఆయన్ను ప్రసన్నం చేసుకుని కాంగ్రెస్‌ టికెట్‌ పొందినట్టు తెలిపారు.

తిరుమలలోని గొల్లమండపాన్ని కూడా కూలదోయించేందుకు యత్నించారని, ఆ సమయంలో యాదవుల నుంచి వ్యతిరేకత రావడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్టు చెప్పారు. ఇంకా మహాప్రాకారం పేరుతో కళ్యాణకట్ట, పుష్కరిణిని ఓకేచోట కలపాలని చూసిన వ్యక్తి చంద్రబాబేనని ధ్వజమెత్తారు. కృష్ణాపుష్కరాల సమయంలో ఆలయాలను చంద్రబాబు కూల్చలేదా? అని ఓవీ రమణ ప్రశ్నించారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి, లేదా పవిత్ర కార్యక్రమాలు ప్రారంభించే సమయంలో చంద్రబాబు బూట్లు వేసుకునే పూజలు చేస్తారని, అటువంటి వ్యక్తికి ఆలయాలు, వాటి పవిత్రత గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.

సోము వీర్రాజు బీజేపీ అధ్యక్షుడు అయినప్పటి నుంచే వివాదాలు మొదలయ్యాయని ఆరోపించారు. పీఠాధిపతులు, మఠాధిపతులు రాజకీయాలు చేయడం అన్యాయమన్నారు. సంప్రదాయాలు, ఆలయాల పవిత్రతను కాపాడలనుకునే వ్యక్తి సీఎం వైఎస్‌ జగన్‌ అని, ఏదన్నా కార్యక్రమాన్ని ప్రారంభించేటప్పుడు ఆయన పాటించే నియమాలే ఇందుకు నిదర్శనమని ఓవీ రమణ స్పష్టం చేశారు.    

మరిన్ని వార్తలు