ఏడు లక్షల ఓట్లతో.. తేల్చిచెప్పారు!

11 Nov, 2020 20:01 IST|Sakshi
బిహార్‌ ఎన్నికల పోలింగ్‌ (ఫైల్‌)

‘నోటా’కు జైకొట్టిన బిహారీలు

‘నోటా’కు 1.7 శాతం ఓటింగ్‌

పలుచోట్ల మెజారిటీ కన్నా ‘నోటా’కే ఎక్కువ ఓట్లు

పట్నా: టీ-20 మ్యాచ్‌లా ఉత్కంఠ రేపిన బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ నేతృత్వంలోని ఎన్డీఏ సాధారణ మెజార్టీతో తిరిగి అధికారం నిలబెట్టుకుంది. బీజేపీ అత్యధిక  స్థానాలు దక్కించుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. తాజాగా ముగిసిన ఎన్నికల్లో బిహారీలు పెద్ద ఎత్తున ‘నోటా’ వైపు మొగ్గుచూపారు. ఏడు లక్షలకు పైగా ఓటర్లు ‘నోటా’కు ఓకే చెప్పారు. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 7,06,252 (1.7 శాతం) మంది ఓటర్లు ‘నోటా​’కే జై కొట్టారు. బిహార్‌లో 7.3 కోట్ల మంది ఓటర్లు ఉండగా కేవలం 4 కోట్ల మంది (57.09శాతం) మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు.

నువ్వా నేనా అన్నట్టు సాగినా ఎన్నికల్లో చాలా మంది అభ్యర్థులు ‘నోటా’ కన్నా తక్కువ ఓట్ల మెజార్టీతో గెలిచారు. హోరాహొరీగా జరిగిన పోరులో చాలా చోట్ల అభ్యర్థుల గెలుపోటములపై ‘నోటా’తీవ్ర ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. 2013 నుంచి నోటా ఆప్షన్‌ అందుబాటులోకి వచ్చింది. ఈవీఎంలలో చివరన దీన్ని పొందుపరుస్తున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకుంటే ‘నోటా’ గుర్తును ఎంచుకోవచ్చు. పోటీ చేస్తున్న అభ్యర్థుల కన్నా నోటా గుర్తుకి ఎక్కువ ఓట్లు వస్తే మళ్లీ ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు నిరాకరించడంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

(చదవండి: నితీష్‌ సీఎం అయితే మాదే క్రెడిట్‌: శివసేన)

మరిన్ని వార్తలు