బీజేపీకే 54% హిందూ ఓట్లు

13 Mar, 2022 04:08 IST|Sakshi

యూపీ ఎన్నికలపై సర్వే వెల్లడి

ముస్లిం ఓట్లలో 79 శాతం ఎస్పీకే

బీజేపీకి పెరిగిన ముస్లిం ఓట్ల

ఎస్పీకి 8% పెరిగిన హిందూ ఓట్లు

లక్నో: తాజాగా ముగిసిన ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మతపరమైన ఓటింగ్‌ ధోరణి స్పష్టంగా కన్పించిందని సెంటర్‌ ఫర్‌ ద స్టడీ ఆఫ్‌ డెవలపింగ్‌ సొసైటీస్‌ (సీఎస్‌డీఎస్‌)–లోక్‌నీతి పోస్ట్‌ పోల్‌ సర్వే పేర్కొంది. హిందూ ఓట్లలో సగానికి పైగా బీజేపీకి పడగా ఏకంగా మూడింట రెండొంతుల మంది ముస్లింలు సమాజ్‌వాదీకి ఓటేసినట్టు వివరించింది. అయితే బీజేపీకి ముస్లిం ఓట్లు, అఖిలేశ్‌ సారథ్యంలోని ఎస్పీకి హిందూ ఓట్లు పెరిగినట్టు తెలిపింది. ‘‘2017 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి ముస్లిం ఓట్లు స్వల్పంగా పెరిగాయి.

ఎస్పీకి హిందూ ఓట్లు కూడా 18 శాతం నుంచి 26 శాతానికి పెరిగాయి’’ అని వెల్లడించింది. హిందూ ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకునే ప్రయత్నాల్లో భాగంగా ఎన్నికల ప్రచార సమయంలో అఖిలేశ్‌ యాదవ్‌ పలు హిందూ దేవాలయాలను సందర్శించడం తెలిసిందే. బీజేపీ తరఫున సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కూడా 80 శాతం మంది ప్రజలు బీజేపీకే మద్దతుగా ఉన్నారంటూ పదేపదే ‘80–20’ ప్రచారం ద్వారా హిందూ–ముస్లిం భావోద్వేగాలు రేకెత్తించే ప్రయత్నం చేశారు. సమగ్రమైన శాంపిల్స్‌ ఆధారంగా సర్వే జరిగినట్టు సీఎస్‌డీఎస్‌ రీసెర్చ్‌ విభాగమైన లోక్‌నీతి కో డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ సంజయ్‌ కుమార్‌ తెలిపారు.

► హిందూ ఓటర్లలో 54 శాతం మంది బీజేపీకి ఓటేశారు. 2017లో ఇది 47 శాతమే.
► బీఎస్పీకి 14 శాతం, కాంగ్రెస్‌కు 2 శాతం హిందూ ఓట్లు దక్కాయి.
► ముస్లిం ఓటర్లలో ఏకంగా 79 శాతం మంది సమాజ్‌వాదీకే ఓటేశారు. 2017లో ఇది 46 శాతం మాత్రమే!
► బీజేపీకి 8 శాతం ముస్లిం ఓట్లు పడ్డాయి. 2017లో ఇది 5 శాతమే.
► బీజేపీ కూటమి నుంచి గెలిచిన 273 మంది ఎమ్మెల్యేల్లో ఒక్క ముస్లిం కూడా లేరు.
► బీజేపీ ఒక్క ముస్లిం అభ్యర్థికి కూడా టికెటివ్వలేదు. మిత్రపక్షం అప్నాదళ్‌ ఒకరికి అవకాశమిచ్చింది.
► బీఎస్పీకి 6 శాతం ముస్లిం ఓట్లు మాత్రమే పడ్డాయి. 2017లో ఇది 19 శాతం
► 2017 కంటే 10 మంది ఎక్కువగా ఈసారి 34 మంది ముస్లిం అభ్యర్థులు గెలిచారు.
► వీరిలో 31 మంది ఎస్పీ అభ్యర్థులే. మిగతా ముగ్గురు కూడా ఎస్పీ మిత్రపక్షాలు ఆరెల్డీ, ఎస్‌బీఎస్‌పీ తరఫున పోటీ చేశారు.

మరిన్ని వార్తలు