కనీస మద్దతు ధర : చిదంబరం ఫైర్

21 Sep, 2020 11:53 IST|Sakshi
ఫైల్ ఫోటో

వ్యసాయ బిల్లులు :  కేంద్రంపై చిదంబరం విమర్శలు

డేటా లేనపుడు  రైతులకు కనీస మద్దతు ధర ఎలా ఇస్తారు 

గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చారా?

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం కొత్తగా ఆమోదించిన నూతన వ్యవసాయ బిల్లులపై విపక్ష పార్టీల నిరసన కొనసాగుతున్న తరుణంలో కేంద్ర మాజీ ఆర్థికమంత్రి, కాంగ్రెస్ సీనియర్  నాయకుడు చిదంబరం కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధానంగా కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ) పై ఆయన తన దాడిని ఎక్కుపెట్టారు. ప్రభుత్వం వద్ద ప్రైవేటు వాణిజ్యానికి సంబంధించిన డేటా అందుబాటులో లేనప్పుడు  రైతులకు కనీస మద్దతు ధర ఎలా ఇస్తారని ప్రశ్నించారు. భారతదేశం అంతటా ప్రతిరోజూ వేలాది గ్రామాల్లో మిలియన్ల ప్రైవేటు లావాదేవీలు జరుగుతాయి. ఏ రైతు ఏ వ్యాపారికి ఏ ఉత్పత్తులను అమ్మారో ప్రభుత్వానికి ఎలా తెలుస్తుందని  వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌ను ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలా ప్రణాళికలు వేస్తోందని  చిదంబరం ట్వీట్ చేశారు.   (రాజ్యసభ రగడ : విపక్ష ఎంపీల సస్పెన్షన్)

రైతుకు చెల్లించే ధర మద్దతు ధరకంటే చాలా తక్కువగా ఉంటోందని చిదంబరం ఆరోపించారు. రైతుల పంటకు మద్దతు ధర కల్పిస్తామంటూ చెబుతున్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఇప్పటివరకు ఆ పని ఎందుకు చేయలేదని నిలదీశారు. దీన్ని గుడ్డిగా నమ్మేందుకు రైతులు మూర్ఖులు అని మంత్రి ప్రభుత్వం భావిస్తోందా అని మండిపడ్డారు.  దీంతో పాటు సమాజంలోని వివిధ వర్గాల ప్రజలకు మోదీ సర్కార్ ఇచ్చిన హామీలను తుంగలో  తొక్కిన వైనంపై ఆయన విరుచుకుపడ్డారు.  ప్రధానంగా ప్రతి భారతీయుడి ఖాతాలో15 లక్షలు రూపాయలు వేస్తామన్న హామీని మోదీ ప్రభుత్వం నెరవేర్చిందా? రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేశారాట? ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాల వాగ్దానం సంగతి ఏమిటని చిదంబరం ప్రశ్నించారు. 

కాగా, వ్యవసాయానికి సంబంధించిన ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ బిల్లు, ఫార్మర్స్ అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫార్మార్స్ సర్వీసు బిల్లులకు ఇప్పటికే లోక్‌సభ ఆమోదం తెలుపగా, ఆదివారం రాజ్యసభ కూడా ఆమోదించింది. రాష్ట్రపతి సంతకంతో ఈ బిల్లులు అమలులోకి రానున్నాయి. కొత్త వ్యవసాయ బిల్లులంటూ రాజకీయ రగడ నడుస్తోంది. కార్పొరేట్లకు కొమ్ముకాసేందుకే ప్రభుత్వం ఈ బిల్లులను తీసుకొచ్చిందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. దీనిపై దేశవ్యాప్తంగా రైతులు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు