వ్యాక్సిన్ల సంఖ్య ఎందుకు తగ్గుతోంది: చిదంబరం ఫైర్‌

16 May, 2021 16:39 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నివారణకు టీకా ఎంతో కీలకమని ఆయా దేశాలు వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యాయి. ఇటీవలే అమెరికా, బ్రిటన్‌ లాంటి దేశాలు సగం మందికిపైగా వారి జనాభాకు టీకాలు పూర్తి చేసినట్లు ప్రకటించుకున్నాయి. భారత్‌లో మాత్రం వ్యాక్సినేషన్‌ ప్రక్రియ అంత వేగంగా జరుగుతున్నట్లు అనిపించడం లేదని కాంగ్రేస్‌ నేతలు ఇప్పటికే మండిపడుతున్నరు. ఈ అంశంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కేంద్రం వైఖరిపై పలు సార్లు ఫైర్‌ అయిన సంగతి తెలిసిందే. తాజాగా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం దేశంలోని వ్యాక్సిన్ల కొరత పై మండిపడ్డారు.

దేశ‌వ్యాప్తంగా వ్యాక్సిన్ కొర‌త‌పై కాంగ్రెస్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబ‌రం మోదీ స‌ర్కార్ ల‌క్ష్యంగా విమ‌ర్శ‌లు గుప్పించారు. రోజూ వ్యాక్సిన్లు ఇచ్చే సంఖ్య త‌గ్గుముఖం ప‌ట్ట‌డాన్ని ప్ర‌స్తావిస్తూ ప్ర‌భుత్వ వ్యాక్సిన్ వ్యూహాన్ని ఆయ‌న ప్ర‌శ్నించారు.  ఏప్రిల్ 2 నాటితో పోలిస్తే ప్రస్తుతం రోజూ వేస్తున్నటీకాల సంఖ్య త‌గ్గుతోంద‌నే ఆ డేటాను చిదంబ‌రం ఆదివారం ట్వీట్ చేశారు. ఏప్రిల్ 2న రోజుకు 42 ల‌క్ష‌ల వ్యాక్సిన్ డోసులు వేసిన కేంద్రం శుక్ర‌వారం ఆ సంఖ్య 11.6 ల‌క్ష‌ల‌కు ప‌డిపోయింద‌ని, ఇంత భారీ వ్యత్యాసం ఎందుకు వస్తోందని ప్ర‌శ్నించారు. ఓ పక్క వ్యాక్సిన్ల కొర‌త‌తోనే వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ నెమ్మ‌దిగా సాగుతుంటే, మరో పక్క ఆరోగ్య శాఖ మంత్రి మాత్రం దేశంలో క‌రోనా వ్యాక్సిన్ల కొర‌త లేద‌ని చెబుతున్నార‌ని ఆయన ఎద్దేవా చేశారు. 
కరోనావైరస్ మహమ్మారి సెకండ్‌ వేవ్‌ కారణంగా దేశం తీవ్రంగా వ్యాక్సిన్ల కొరతను ఎదుర్కొంటోంది. అయితే, జూలై చివరి నాటికి భారతదేశంలో టీకాల సంఖ్య 51.6 కోట్లకు చేరుకుంటుందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష్ వర్ధన్ తెలిపారు.

( చదవండి: ‘శత్రువు కనిపించకపోవచ్చు.. మీ వైఫల్యాలు కనిపిస్తున్నాయి’ )

మరిన్ని వార్తలు