కాబోయే సీఎం కేటీఆర్‌కు కంగ్రాట్స్‌

22 Jan, 2021 03:01 IST|Sakshi

రైల్వే ఉద్యోగుల సభలో డిప్యూటీ స్పీకర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్‌ సంఘ్‌ ఆఫీస్‌ను ప్రారంభించిన కేటీఆర్‌

సాక్షి, సికింద్రాబాద్‌ (హైదరాబాద్‌): ‘మా పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌.. అతి త్వరలోనే కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్‌కు శాసనసభ, రైల్వే కార్మికులు, అందరి తరఫున కంగ్రాట్స్‌ చెబుతున్నా.. మీరు ముఖ్యమంత్రి అవ్వగానే సికింద్రాబాద్‌ ప్రాంత రైల్వే కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. ఉద్యమానికి, తెలంగాణ ప్రభుత్వానికి రైల్వే ఉద్యోగులు అండగా ఉంటున్నారు. మీరు ముఖ్యమంత్రి అయ్యాక వారిని ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాలి..’అని రైల్వే కార్మికుల తరఫున మంత్రి కేటీఆర్‌ను శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ టి.పద్మారావుగౌడ్‌ కోరారు. చదవండి: (సీఎం పీఠంపై కేటీఆర్: పెరుగుతున్న మద్దతు)

సికింద్రాబాద్‌లో గురువారం దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్‌ సంఘ్‌ కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. అనంతరం జరిగిన ఉద్యోగులు, కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పజ్జన్న (పద్మారావు)ను తాను చిచ్చా అని పిలుస్తా అని చెప్పారు. పద్మారావును తన బాబాయ్‌ అని అన్నారు. అయితే పద్మారావు ‘కాబోయే సీఎంకు కంగ్రాట్స్‌’అంటూ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలపై కేటీఆర్‌ స్పందించలేదు. ఇటు పద్మారావు ప్రసంగ సమయంలోనూ ఆయన చిరునవ్వుతోనే ఉన్నారు.

హైస్పీడ్‌ రైళ్ల ద్వారానే ప్రగతి సాధ్యం..
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం హైస్పీడ్‌ రైళ్లను ప్రవేశపెట్టడమేనని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ‘ప్రధాన నగరాలకు సత్వర రవాణా మార్గాలుండటం ద్వారా దేశ ప్రగతి సత్వరంగా సాధ్యమవుతుంది. రైల్వే వ్యవస్థను కేంద్రం విస్మరిస్తోంది. సబ్‌కా సాథ్‌.. సబ్‌కా విశ్వాస్‌ తమ నినాదం అంటున్న మోదీ ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలను నిర్లక్ష్యం చేస్తోంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాలకు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఇవ్వడంలో కేంద్రం జాప్యం తగదు. వచ్చే బడ్జెట్‌లో దక్షిణాది రాష్ట్రాలకు.. ముఖ్యంగా తెలంగాణకు పెద్దపీట వేయాలి. లేనిపక్షంలో రైల్వే ఉద్యో గులు తీసుకునే కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది.

కాజీపేటలో వ్యాగన్‌  కోచ్‌ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం కేంద్రం 135 ఎకరాల స్థలం అడిగితే రాష్ట్ర ప్రభుత్వం 300 ఎకరాలు కేటాయించింది. ఆరున్నర ఏళ్ల కాలం పూర్తయినా నేటికీ నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. తెలంగాణలో కొత్త లైన్లకు కూడా మోక్షం లభించలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు రైల్వే సమస్యలు, కార్మికుల సమస్యలకు సత్వర పరిష్కారం చూపేందుకు సిద్ధంగా ఉన్నాం..’అని కేటీఆర్‌ హామీనిచ్చారు. దక్షిణ మధ్య రైల్వే జాతీయ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు వి.శ్రీనివాస్‌గౌడ్, పువ్వాడ అజయ్‌ కుమార్, డీఆర్‌ఎం ఏకే గుప్తా, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ కె.పాపారావు, ఎంప్లాయిస్‌ నేతలు ప్రభాకర్, గంట రవీందర్, మురళీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు