Padmarajan Record: రాజాధిరాజన్‌  ఓడినా.. రికార్డే 

2 Sep, 2021 10:10 IST|Sakshi

ఢిల్లీ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోకి  ఎన్నికల వీరుడు పద్మరాజన్‌

 అత్యధికసార్లు పోటీ చేసి ఓడిన అభ్యర్థిగా గుర్తింపు  

ఎన్నికల్లో పోటీ అంటే ఇప్పటి వరకు ఓట్లు.. సీట్లు.. మెజారిటీ.. అని మాత్రమే మీరు విని ఉంటారు.. కానీ తమిళనాడు సహా.. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా నామినేషన్‌ వేయడం, పోటీ చేసి.. డిపాజిట్‌ కూడా దక్కించుకోకపోవడం ఆయన స్పెషాలిటీ. ఈ కారణంతో ఏకంగా ఢిల్లీ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం  పొందాడు ఈ నాయకుడు కాని.. నాయకుడు. ఆయనే 219 సార్లు పోటీ చేసి అరకోటికి పైగా డిపాజిట్‌ నగదు పోగొట్టుకున్న పద్మరాజన్‌..!  

సాక్షి, చెన్నై: గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏ ఎన్నికలు జరిగినా తొలిరోజే నామినేషన్‌ వేసే ఎన్నికల వీరుడు పద్మరాజన్‌ కొత్త రికార్డు నమోదు చేశాడు. ఎన్నికల్లో అత్యధికసార్లు పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి గా ఆయన గుర్తింపు పొందారు.  సేలం జిల్లా  మేట్టూరు సమీపంలోని ఎరటై పులియ మరత్తూరుకు చెందిన అరవై నాలుగేళ్ల పద్మరాజన్‌ 1988 నుంచి అనేక ఎన్నికల్లో ఆయన నామినేషన్లు వేశారు. సహకార సంఘాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ, పార్లమెంట్, రాజ్యసభ ఎన్నికల్లో సైతం బరిలోకి దిగి.. ఎలక్షన్‌ కింగ్‌గా అవతరించారు. తాజాగా రాష్ట్రంలో ఓ రాజ్యసభ స్థానానికి జరగనున్న ఎన్నికలకు నామినేషన్‌ వేశారు. ఎమ్మెల్యేల మద్దతు లేని దృష్ట్యా, ఈ నామినేషన్‌ బుధవారం తిరస్కరణకు గురైంది.  

జాబితా.. పెద్దదే..! 
ఇప్పటి వరకు 36 సార్లు లోక్‌సభకు, 41 సార్లు రాజ్యసభకు, 66 సార్లు అసెంబ్లీకి, ఐదు సార్లు రాష్ట్రపతి, మరో ఐదుసార్లు ఉప రాష్ట్రపతి, 4 సార్లు ప్రధాన మంత్రి అభ్యర్థులకు ప్రత్యర్థిగా, 13 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ముఖ్యమైన అభ్యర్థులకు పోటీగా , ఏడు పార్టీల అధినేతలకు ప్రత్యర్థిగా.. మొత్తం 219 సార్లు పద్మరాజన్‌ ఎన్నికల నామినేషన్లు వేశారు. ప్రతి ఎన్నికల్లోనూ తన సొంత డబ్బు ఖర్చు పెట్టి డిపాజిట్‌ సొమ్ముచెల్లించడం పద్మరాజన్‌ స్టైల్‌. ఇంతవరకు వార్డు సభ్యుడిగా కూడా గెలవనప్పటికీ, రికార్డులను మాత్రం పెద్దఎత్తున తన సొంతం   చేసుకుంటున్నారు.  

రికార్డుల రారాజు.. 
అత్యధిక సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన పద్మరాజన్‌కు ఢిల్లీ బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు దక్కింది. ఇది వరకు ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డుతో పాటుగా మరికొన్ని రికార్డులను దక్కించుకున్న ఆయనకు ప్రస్తుతం ఢిల్లీ బుక్‌ ఆఫ్‌రికార్డులోనూ స్థానం దక్కడం విశేషం. ఓటమితో కృంగి పోకూడదని, ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇలాంటి రికార్డుల రూపంలో విజయం దరిచేరుతుందని ఈ సందర్భంగా పద్మరాజన్‌ వ్యాఖ్యానించడం ఆసక్తికరం.  గెలిచిన వాళ్లకే ప్రాధాన్యత ఇచ్చే ఈ ప్రపంచంలో వరుస ఓటములు చవిచూస్తున్న తనను కూడా గుర్తించి, రికార్డులు, అవార్డులు దరిచేర్చడం ఆనందంగా ఉందన్నారు. ఇప్పటి వరకు 219 నామినేషన్లు దాఖలు చేసిన రూ. 50 లక్షల మేరకు డిపాజిట్‌సొమ్మును పోగొట్టుకున్నట్లు వెల్లడించారు. తన నామినేషన్ల పర్వం..  ఏదో ఒకరోజు గిన్నిస్‌ బుక్‌లోనూ చోటు సంపాదిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

చదవండి: కాషాయ జెండా పట్టుకొని ఎర్ర జెండా డైలాగులా ఈటలా?

మరిన్ని వార్తలు