AIADMK OPS Vs EPS: మరో కొత్త వివాదం.. అన్నాడీఎంకే ఖజానాపై ‘వారిద్దరి’ కన్ను 

13 Jul, 2022 08:29 IST|Sakshi

బ్యాంకు ఖాతాల్లో రూ.300 కోట్లు

నగదు లావాదేవీల అజమాయిషీపై ఈపీఎస్, ఓపీఎస్‌ ఉత్తరాలు

ఇన్నాళ్లూ పార్టీపై పట్టుకోసం పోరాడిన ఈపీఎస్, ఓపీఎస్‌ మధ్య తాజాగా మరో కొత్త వివాదం మొదలైంది. అన్నాడీఎంకే బ్యాంక్‌ ఖాతాల నిర్వహణ బాధ్యత నాదంటే.. నాదంటూ వారిద్దరూ లేఖల యుద్ధానికి దిగారు. పరిస్థితి ముదిరితే  ఖాతాలను స్తంభింపజేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే బ్యాంకు ఖాతాలపై తనదే పెత్తనమని ఎడపాడి పళనిస్వామి, కాదు..కాదు కోశాధికారిగా తానే అధికారిక వ్యక్తినని పన్నీర్‌సెల్వం కొత్తగా మరో కుమ్ములాట మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో సమస్య సద్దుమణిగే వరకు ఇద్దరికి అవకాశం లేకుండా సీలువేస్తారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ఖాతాల్లోని రూ.300 కోట్లు స్తంభించిపోయే ప్రమాదం ఉంది.
చదవండి: అవసరమా! ఆ సింహాలు క్రూరంగా, కోపంగా కనిపించాలా?

అంతకంతకూ ముదురుతున్న వివాదాలు 
అంతఃకలహాలతో అన్నాడీఎంకే అట్టుడికి పోతోంది. ప్రధాన కార్యదర్శిగా ఎడపాడి పళనిస్వామి ఎంపిక, పన్నీర్‌సెల్వం శాశ్వత బహిష్కరణ జరిగిపోయింది. కోశాధికారి పదవి నుంచి ఓపీఎస్‌ను తప్పించినట్లు బ్యాంకు అధికారులకు ఈపీఎస్‌ ఓ లేఖ పంపారు. అయితే తన అనుమతి లేకుండా ఎలాంటి లావాదేవీలు జరిపేందుకు వీలులేదని, హద్దుమీరితో తగిన చర్యలు తప్పవని పన్నీరు సెల్వం మరో లేఖలో హెచ్చరించారు.

ఇక కోశాధికారిగా దిండుగల్లు శ్రీనివాసన్‌ను నియమించాం, ఆయన అనుమతి లేకుండా లావాదేవీలు జరుపరాదని కరూరు వైశ్య బ్యాంకు, ఇండియన్‌ బ్యాంకుకు, చీఫ్‌ ఎలక్షన్‌ కమిషన్‌కు ఈపీఎస్‌ మంగళవారం మరో లేఖ రాశా రు. ఈరెండు బ్యాంకుల్లో అన్నాడీఎంకేకు సుమారు రూ.300 కోట్లు ఉండటంతో ఈపీఎస్, ఓపీఎస్‌లు తహతహలాడుతున్నారు.  ఎవరి ఆదేశాలు పాటించాలో తెలియక బ్యాంకు అధికారులు తలలుపట్టుకున్నారు. రూ.300 కోట్లు పక్కదారి పట్టకుండా పార్టీ బ్యాంకు ఖాతాలకు తాత్కాలికంగా సీలు వేయడమే మేలని అధికారులు ఆలోచిస్తున్నట్లు సమాచారం.

సీఈసీకి పోటాపోటీ పిటిషన్లు  
ఈనెల 11న సర్వసభ్య సమావేశంలో చేసిన తీర్మానాలపై ఈపీఎస్, ఓపీఎస్‌ ప్రధాన ఎన్నికల కమిషన్‌ (సీఈసీ) కార్యాలయంలో పోటాపోటీగా పిటిషన్లు వేశారు. ఇటీవలి సర్వసభ్య సమావేశంలో చేసిన తీర్మానాలు, ఆమోదయోగ్యం కాని ఆ పిటి షన్లపై స్టే విధించాలని సీఈసీకి సమర్పించిన పిటిషన్‌లో ఓపీఎస్‌ పేర్కొన్నారు. బైలా ప్రకారమే పార్టీ వ్యవహారాల్లో సవరణలు చేశామని ఎడపాడి పేర్కొంటూ సీఈసీకి ఆధారాలు సమర్పించారు.

మలి అడుగు ఎలా..?  
ఆశించినట్లుగానే ఎడపాడి పళనిస్వామికి ప్రధాన కార్యదర్శి పదవి దక్కింది. పన్నీర్‌సెల్వంను బహిష్కరించడం కూడా జరిగిపోయింది. అయితే     పార్టీపై పూర్తిస్థాయి పట్టుసాధించడం కోసం చేపట్టాల్సిన చర్యలపై చట్ట నిపుణులతో ఈపీఎస్‌ మంగళవారం సమాలోచనలు జరిపారు. పన్నీర్‌సెల్వం బహిష్కరణకు గురైనందున ప్రభుత్వంలో ప్రధాన ప్రతిపక్ష ఉపనేత పదవి వెంటనే చేజారిపోతుందా..? అని కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇతర అంశాలు 
ఇక అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం వద్ద సోమ వారం అరాచకాలకు పాల్పడిన, కార్యాలయంలోకి జొరబడిన 400 మంది కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. 14 మందిని అరెస్ట్‌ చేసి జైల్లో పెట్టారు. కార్యాలయ ప్రాంగణంలోని ఎంజీ రామ చంద్రన్, జయలలిత  విగ్రహాలకు రోజూ పూలమాలలు వేయడం ఎంతోకాలంగా ఆనవాయితీగా వస్తోంది.

అయితే పార్టీ కార్యాలయానికి ప్రభుత్వం సీలు వేయడంతో వారి విగ్రహాల్లో ఎండిపోయిన రోజాపూల మాలలను చూసి పారీ్టశ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  అన్నాడీఎంకేలోని రెండువర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగడంతో ఎడపాడి పళనిస్వామి, పన్నీర్‌సెల్వం ఇళ్ల వద్ద పోలీసుల బందోబస్తు పెంచారు. పార్టీ కార్యాలయానికి ప్రభుత్వం సీలు వేయడంతో ఎడపాడి తన ఇంటిని తాత్కాలిక కార్యాలయంగా మార్చారు. ఆఫీసుకు వేసిన సీలును తొలగించేలా ఆదేశించాలని కోరుతూ ఎడపాడి మద్ద తుదారు తరపున న్యాయవాది విజయ్‌ నారాయణన్‌ మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. 

మరిన్ని వార్తలు