ముత్తిరెడ్డి మద్దతుతో జనగాంలో జెండా ఎగరవేద్దాం: పల్లా ఆసక్తికర వ్యాఖ్యలు

23 Sep, 2023 21:18 IST|Sakshi

సాక్షి,  జనగామ: తెలంగాణ ఎన్నికలకు సన్నాహాకాలు కొనసాగుతున్నాయని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన వేళ.. రాజకీయ పరిణామాలు వేగం పుంజుకుంటున్నాయి. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ అధికారికంగా జాబితా ప్రకటించేసింది. కాంగ్రెస్‌, బీజేపీలు అభ్యర్థుల ప్రకటనను వీలైనంత త్వరగా ఇచ్చే ప్రయత్నాల్లో ఉన్నాయి. మరోవైపు బీఆర్‌ఎస్‌ నుంచి పెండింగ్‌లో ఉన్న స్థానాలపై ఉత్కంఠ నెలకొంది. ఈ తరుణంలో.. పల్లా రాజేశ్వరరెడ్డి చేసిన ట్వీట్‌ ఆసక్తికర చర్చకు దారి తీసింది. 

జనగాం అసెంబ్లీ టికెట్‌ పల్లా రాజేశ్వరరెడ్డికి దక్కుతుందనే ప్రచారం బలంగా సాగుతున్నవేళ.. ఆయన సోషల్‌ మీడియాలో ఓ వీడియో పోస్ట్‌ చేశారు. ముత్తిరెడ్డి మద్దతు, కేసీఆర్ ఆశీర్వాదంతో జనగాంలో జెండా ఎగరవేద్దామని ట్వీట్ చేశారు. ‘‘ఎక్కడైనా మార్పు జరగాలనుకున్నప్పుడు ఇప్పటికే ఉన్న ఎమ్మెల్యేలను ఒప్పించి ముందుకు సాగాలన్నారు. స్టేషన్ ఘనపూర్‌లోను ఎమ్మెల్యే రాజయ్యను మార్చి కడియం శ్రీహరికి ఇచ్చారని, దీంతో తాము రాజయ్యను కలిసి మాట్లాడామన్నారు. జనగామ, పాలకుర్తి, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాలలో బీఆర్ఎస్‌ను కచ్చితంగా గెలిపించుకోవాలన్నారు.

జనగామలోను ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పదేళ్లుగా బాగా పని చేశారన్నారు. ఆయన ఉద్యమంలో కూడా ఉన్నారని గుర్తు చేశారు. అయితే కొన్ని ఇబ్బందులవల్ల జనగామలో మనం(BRS) ఓడిపోయే అవకాశం ఇవ్వకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. సీఎం కేసీఆర్‌కు ముత్తిరెడ్డి అంటే గౌరవం ఉందన్నారు. ముత్తిరెడ్డిని పిలిపించి మాట్లాడుతారని, అందరం ఏకతాటిపై వెళ్దామన్నారు.

తాను కేసీఆర్, ముత్తిరెడ్డిల ఆశీర్వాదం తీసుకున్నానన్నారు. రేపు ఎన్నికల్లో కేసీఆర్ ఆశీర్వాదంతో పాటు మంత్రులు, ముత్తిరెడ్డి సహా అందరం కలిసికట్టుగా ముందుకు సాగి జనగామలో బీఆర్ఎస్‌ను గెలిపించాలన్నారు. రేపో ఎల్లుండో కేసీఆర్ టిక్కెట్ ప్రకటించాక అందరం కలిసి వెళ్దామన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి.

మరిన్ని వార్తలు