Palle Vs JC: పల్లె అక్రమాలపై జేసీ లొల్లి.. 

14 May, 2022 10:37 IST|Sakshi
జేసీ, పల్లె వర్గీయుల మధ్య బాహాబాహీ    

పుట్టపర్తిలో ఏర్పాటైన ఉజ్వల లేఅవుట్‌ 

1992లో 150 కాటేజీల నిర్మాణం  

నాలుగేళ్ల క్రితం పవర్‌ ఆఫ్‌ అటార్నీ తెచ్చుకున్న ‘పల్లె’ అనుచరులు 

ఢిల్లీవాసి డింపుల్‌ ఆరోరా ఇంటి పక్కన అక్రమ నిర్మాణం 

ఎస్పీ, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన బాధితురాలు

ఉజ్వల అక్రమాలపై స్పందించిన జేసీ ప్రభాకర్‌రెడ్డి  

మాజీ ఎమ్మెల్యే ‘పల్లె’ అనుచరులే సూత్రధారులని ఆరోపణ 

ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్తుండగా పోలీసుల అడ్డగింత 

రచ్చకెక్కిన టీడీపీ వర్గ విభేదాలు

పుట్టపర్తి...జిల్లా కేంద్రం కావడం.. విమానాశ్రయానికి కూతవేటు దూరంలోనే ఉండటంతో భూముల విలువ అమాంతం పెరిగింది. దీంతో టీడీపీ నాయకులు కొందరు కనిపించిన స్థలాలను కబ్జా చేస్తున్నారు. ఈ క్రమంలో ఎప్పుడో 1992లో ఏర్పాటైన ఉజ్వల ఫౌండేషన్‌పై కన్నేసిన కొందరు పవర్‌ ఆఫ్‌ అటార్నీ పేరుతో పార్కులు, పార్కింగ్‌ స్థలాలనూ విక్రయిస్తున్నారు. దీంతో ఉజ్వల ఫౌండేషన్‌లో కాటేజీలు కొనుగోలు చేసిన వారు ఎస్పీ, కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా అక్రమార్కుల్లో వణుకు మొదలైంది. మరోవైపు వీటన్నింటికీ ‘పల్లె’ అనుచరులే కారణమని జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆరోపించడంతో పాటు సొంతపార్టీ నేతలపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు బయలుదేరడం చర్చనీయాంశమైంది. 

సాక్షి, పుట్టపర్తి: పుట్టపర్తి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (పుడా) ఏర్పాటు కాకముందు సుడా (సత్యసాయి అర్భన్‌ డెవలప్‌మెంట్‌ ) ఉండేది. 1992లో సుడా పరిధిలోని 6.25 ఎకరాల్లో ఉజ్వల ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో లేఅవుట్‌ వేశారు. ఇందులో 150 కాటేజీల నిర్మాణం చేపట్టారు. దీంతో దేశ విదేశాల్లోని సత్యసాయి భక్తులు వీటిని కొనుగోలు చేశారు. ఈ క్రమంలోనే ‘ఈ–2’ కాటేజీని ఢిల్లీకి చెందిన డింపుల్‌ అరోరా కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఆమె అందులోనే నివాసం   ఉంటున్నారు. ఇలా 1992 నుంచి లేఅవుట్‌లో కాటేజీలు అమ్ముతూ వచ్చిన ఉజ్వల ఫౌండేషన్‌ మిగిలిన కాటేజీలను చెన్నైకి చెందిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తికి విక్రయించింది. అయితే రిజిస్ట్రేషన్‌ చేయాల్సినప్పుడల్లా చెన్నై నుంచి అతను పుట్టపర్తి రావడం ఇబ్బందిగా మారడంతో నాలుగైదేళ్ల కిందట రవి అనే వ్యక్తికి పవర్‌ ఆఫ్‌ అటార్నీ ఇచ్చారు. రెండేళ్ల క్రితం రవి కోవిడ్‌తో మరణించారు. దీంతో కొన్నిరోజులుగా లావాదేవీలు నిలిచిపోయాయి. ఈక్రమంలో రవి స్నేహితుడైన గోవర్దన్‌రెడ్డి చెన్నైకి వెళ్లి సుబ్రహ్మణ్యంను కలిసి కొత్తగా పవర్‌ ఆఫ్‌ అటార్నీ తెచ్చుకున్నారు.  

అక్రమాలకు ఊతం.. 
పవర్‌ఆఫ్‌ అటార్నీ పొందిన గోవర్ధన్‌రెడ్డి తన మామ, పుట్టపర్తి మాజీ ఎంపీపీ, టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పల్లెరఘునాథరెడ్డికి నమ్మినబంటు శ్రీరామిరెడ్డితో కలిసి ఉజ్వల ఫౌండేషన్‌లో ఖాళీగా ఉన్న స్థలాల కబ్జాకు ప్లాన్‌ వేశారు. లేఅవుట్‌లోని చిల్ట్రన్‌పార్కు, పార్కింగ్‌ ఏరియా, సెక్యూరిటీ, లైబ్రరీకి కేటాయించిన స్థలాలను ఇష్టానుసారంగా విక్రయించాడు. దీంతో లేఅవుట్‌కు చెందిన ఉమ్మడి స్థలాలను విక్రయించిన వారిపై చర్యలు తీసుకోవాలని ‘ఈ–2’ కాటేజీలో ఉంటున్న డింపుల్‌ అరోరా 15 రోజుల కిందట ఎస్పీ రాహుల్‌దేవ్‌ సింగ్‌కు ఫిర్యాదు చేశారు. ఇది తెలుసుకున్న గోవర్దన్‌రెడ్డి తన మామ శ్రీరామరెడ్డి సాయంతో   డింపుల్‌ అరోరాపై బెదిరింపులకు దిగారు. అంతేకాకుండా  ఈ–2 కాటేజీ పక్కన ఉన్న నాలుగు సెంట్ల స్థలంలో ఏకంగా పునాది వేశారు. దీంతో డింపుల్‌ ఆరోరా ఈ విషయాన్ని కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన వెంటనే స్పందించారు. పుట్టపర్తి ఆర్డీఓ, మున్సిపల్‌ కమిషనర్, పుడా వైస్‌ చైర్మన్లతో  కమిటీ నియమించి...వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఈ నెల 9న ఉత్తర్వులు జారీ చేశారు.
 
రచ్చకెక్కిన వర్గవిభేదాలు.. 
ఉజ్వల ఫౌండేషన్‌ వ్యవహారంతో టీడీపీ వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. ఈ క్రమంలోనే టీడీపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి పుట్టపర్తి వస్తున్నట్లు తెలుసుకున్న ఆపార్టీ నేతలు కొత్త చెరువులో పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు. ‘గో బ్యాక్‌ జేసీ’ అంటూ పల్లె అనుచరులు, ‘స్వాగతం జేసీ’ అంటూ జేసీ అనుచరులు నినాదాలు చేశారు. టికెట్‌ వచ్చేది పల్లెకే అంటూ పల్లె వర్గీయులు, మీకు టికెట్‌ వచ్చేంత సీన్‌ లేదని జేసీ వర్గీయులు వాదులాడుకున్నారు.  మాటా మాటా పెరిగి ఒక దశలో తోపులాటకు దారితీసింది. ఈ క్రమంలో పోలీసులు ఇరువర్గాల వారిని శాంతింపజేశారు.  


 జేసీకి కలిసివచ్చిన ‘ఉజ్వల’  
టీడీపీకి చెందిన ‘పల్లె’, జేసీ విభేదాలతో ఆ పార్టీ నేతల్లో ఆందోళన మొదలైంది. పుట్టపర్తి జిల్లా కేంద్రం కావడంతో అధికార పార్టీకి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో తన ప్రాభవం కోల్పోతున్నానని పల్లె రఘునాథ రెడ్డి    ఆందోళనలో ఉన్నారు.‘మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ’ జేసీ ప్రభాకర్‌ రెడ్డి పల్లెపై ప్రతీకారేచ్ఛతో రగలిపోతున్నారు. పల్లెకు టికెట్‌ రానీయనంటూ బాహాటంగానే శపథం పూనారు. పుట్టపర్తి నియోజకవర్గానికి టీడీపీ తరఫున సైకం శ్రీనివాసరెడ్డికి టికెట్‌ తెప్పించుకుంటామని చెబుతున్నారు. నియోజకవర్గంలోని ప్రతి మండలంలోనూ అనుచర వర్గాన్ని తయారుచేసి పల్లెకు వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ‘ఉజ్వల’ అక్రమాలను జేసీ అందిపుచ్చుకున్నారు.

పల్లె అక్రమాలపై జేసీ లొల్లి.. 
కొన్నాళ్లుగా పల్లె రఘునాథరెడ్డిపై గుర్రుగా ఉన్న తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఉజ్వల ఫౌండేషన్‌లో అక్రమాలపై స్పందించారు. ఉజ్వల ఫౌండేషన్‌ అక్రమాలన్నీ ‘పల్లె’ కనుసన్నల్లోనే జరిగాయని, పల్లె అనుచరుడైన శ్రీరామిరెడ్డి, అతని అల్లుడు గోవర్ధన్‌రెడ్డి కాటేజీలను అక్రమంగా విక్రయించి రూ.కోట్లు దండుకున్నారని ఆరోపించారు. ‘ఉజ్వల’ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు శుక్రవారం అనంతపురం నుంచి బయలుదేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడుతుందని భావించి జేసీని  మరూరు టోల్‌ ప్లాజా వద్ద అడ్డుకున్నారు. జేసీకి నచ్చజెప్పి అనంతపురంలోని తన నివాసానికి పంపించారు.  

>
మరిన్ని వార్తలు