Munugode Bypoll 2022: ఉప ఎన్నికల వేళ.. ఫేక్‌ ప్రచారాల గోల!

3 Nov, 2022 14:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహప్రతివ్యూహాల్లో మునిగితేలాయి. పోలింగ్‌ ప్రక్రియ చివరి ఘట్టానికి చేరడంతో పార్టీల ప్రచారం పతాకస్థాయికి చేరింది. సోషల్‌ మీడియా వేదికగా పార్టీలు ఫేక్‌ పోస్టుల యుద్ధానికి దిగాయి. ఫలానా నేత తమ పార్టీలో చేరబోతున్నారంటూ సోషల్‌ మీడియాలో ఫొటోలు, వీడియోలు షేర్‌ చేస్తున్నాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారని, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌.. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను కలిసినట్టు ప్రచారం జరుగుతోంది. 

స్రవంతిపై బోగస్‌ ప్రచారం: కాంగ్రెస్‌
గతంలో దుబ్బాక లో చేసిన విధంగా నేడు మునుగోడు ఆడబిడ్డ పాల్వాయి స్రవంతిపై అసత్య ప్రచారాలు చేస్తూ లబ్ధి పొందాలని అధికార పార్టీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని కాంగ్రెస్‌ నాయకులు మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ను స్రవంతి కలిసినట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ కుమ్మకై తమ అభ్యర్థి పై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. బోగస్‌ వీడియో సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీనియర్‌ నేతలు పోరిక బలరాం, పొన్నం ప్రభాకర్‌, మధుసూదన్‌రెడ్డి ట్విటర్‌ ద్వారా కోరారు. 


నా మనోధైర్యాన్ని దెబ్బతీయలేరు: స్రవంతి

తనపై జరుగుతున్న అసత్య ప్రచారం గురించి ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లతామని పాల్వాయి స్రవంతి తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేసి దోషులపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఇలాంటి బోగస్‌ ప్రచారాలతో తన మనోధైర్యాన్ని దెబ్బతీయలేరని స్రవంతి స్పష్టం చేశారు. 


బీజేపీలో చేరడం లేదు: కర్నె

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ బీజేపీలో చేరతారని సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే తాను పార్టీ మారడం లేదని, మునుగోడులో ఓటమి భయంతో తనపై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని కర్నె ప్రభాకర్‌ వివరణయిచ్చారు. ఇటువంటి అసత్య ప్రచారాలతో బీజేపీ గెలవాలనుకుంటే వారి దౌర్భాగ్యపు పరిస్థితికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఇటువంటి వార్తలను నమ్మొద్దని ఆయన కోరారు. మునుగోడులో కచ్చితంగా టీఆర్‌ఎస్‌ గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు