చంద్రబాబు మమ్మల్ని రెచ్చగొట్టారు: పంచకర్ల

28 Aug, 2020 13:49 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: ఉత్తరాంధ్రపై చంద్రబాబు విషం చిమ్ముతున్నారని మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మనుషులే అభివృద్ధి చెందాలి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తన అనుచరులతో కలిసి పంచకర్ల రమేష్‌బాబు సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో శుక్రవారం వైఎస్సార్‌ పార్టీలో చేరారు. పార్టీ కార్యాలయంలో  జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమేష్‌బాబు మాట్లాడుతూ.. ఐదు నెలల క్రితమే టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేశా. అభివృద్ధి వికేంద్రీకరణకు వ్యతిరేకంగా ధర్నాలు చేయాలని చంద్రబాబు రెచ్చగొట్టారు. 

మా ప్రాంతానికి వ్యతిరేకంగా ఉండలేక పార్టీని వీడాం. అభివృద్ధి వికేంద్రీకరణపై సీఎం వైఎస్‌ జగన్ నిర్ణయాన్ని స్వాగతించాం. సీఎం నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలంతా స్వాగతించారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు ఇంకా చాలా మంది టీడీపీ నేతలు వైఎస్ఆర్‌సీపీలోకి వచ్చే పరిస్థితి ఉంది. లోకేష్ నాయకుడిగా పనికిరాడని టీడీపీ నేతలంతా చెప్పాం. దొడ్డిదారిన లోకేష్‌ను మంత్రిగా చేసి పెత్తనం చెలాయించేలా చేశారు. సీఎం జగన్ అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఉత్తరాంధ్రకు మంచి రోజులు వచ్చాయి’అని పేర్కొన్నారు.
(చదవండి: 'ఆగస్టు 28.. చంద్రన్న రక్తపాత దినోత్సవం')

బాబు ఊహల్లోంచి బయటకి రావాలి: అవంతి
‘చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా ఇచ్చింది ఉత్తరాంధ్రే. విశాఖలో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలి. ఉత్తరాంధ్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలిసిపోతుంది. చంద్రబాబు ఇప్పటికైనా ఊహల్లోంచి బయటకు రావాలి. బాబు అధికారంలో ఉండగా విశాఖలో ప్రైవేట్‌ గెస్ట్‌ హౌస్‌లకే రూ.23 కోట్లు చెల్లించారు. 30 ఎకరాల్లో ప్రభుత్వ గెస్ట్‌హౌస్‌ కట్టేందుకు చంద్రబాబు అడ్డుపడుతున్నారు. రాజధాని బిల్డింగ్‌లకు మాత్రం 30వేల ఎకరాలు సేకరించారు’అని మంత్రి అవంతి శ్రీనివాస్‌ విమర్శించారు.

ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రజా వ్యతిరేకి. ప్రజాస్వామ్యంలో మెజార్టీ ప్రజలు కోరుకున్నదే నెరవేరుతుంది. న్యాయ వ్యవస్థపై మాకు నమ్మకం ఉంది. విశాఖకు పరిపాలన రాజధాని వస్తుంది. రఘురామరాజు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారు. రఘురామరాజుపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేశాం. రఘురామరాజుపై చర్యలు తీసుకుంటారనే విశ్వాసం ఉంది’అని పేర్కొన్నారు.
(చదవండి: వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల)

మరిన్ని వార్తలు